Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఓట్లతో గద్దెనెక్కి.. గుండెల మీద తన్నారు
- టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-కామారెడ్డి/రాజంపేట్
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల నష్టపరిహారం చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా నరసన్నపల్లిలో, రాజంపేట్ మండలం పొందుర్తిలో నష్టపోయిన పంటలను బుధవారం పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట బీమా చేయకపోవడం చాలా దురదృష్టకరమని, ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని, అదేవిధంగా జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పంటలను పరిశీలించి పంట నష్టపోయిన ప్రతి రైతును కలిసి నివేదిక ఇవ్వాలని చెప్పారు.
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలో శాసనసభలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు భట్టి విక్రమార్క, మండలి నాయకుడు జీవన్‌రెడ్డి పంట కొనుగోలుపై నిలదీస్తే చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని చెప్పారని, ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతుల ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో దేశంలో రెండో స్థానంలో ఉందని, తొమ్మిదేండ్లలో రైతులు ఏ ఒక్క రోజు కూడా సంతోషంగా లేరని అన్నారు. ప్రతి రైతుకు నష్టపరిహారం అందే వరకు కాంగ్రెస్ నాయకులమంతా కలిసికట్టుగా చేస్తామని చెప్పారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, కుంట లింగారెడ్డి, యాదవ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి,గణేష్ నాయక్,భీమ్ రెడ్డి, పండ్ల రాజు, గూడుగుల శ్రీను, కృష్ణారావు, చందు, సందీప్, ప్రవీణ్, నిఖిల్, శ్రీదర్ గుప్త తదితరులు ఉన్నారు.