Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా మధ్యవర్తిత్వం
- టెర్మినేట్ అయిన 200 మందిని పదిరోజుల్లో తిరిగి తీసుకుంటామని యాజమాన్యం హామీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు సమ్మెను విరమించారు. ఎంఐఎం ఎమ్మెల్యే (మలక్‌పేట) మహ్మద్ బలాలా మధ్యవర్తిత్వంలో సమ్మెలో పాల్గొన్న హెచ్-82 యూనియన్, ఇత్తేహద్ యూనియన్ నాయకులు టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డితో చర్చలు జరిపారు. ఎలాంటి షరతులు లేకుండా సమ్మెను విరమిస్తున్నట్టు ఎమ్మెల్యే బలాలా, హెచ్-82 యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్ సాయిలు, ఇత్తెహాద్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నందీశ్వర్ ప్రకటించారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ, ఆపార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ హామీ ఇచ్చారనీ, అందువల్ల సమ్మెను విరమిస్తున్నట్టు తెలిపారు. సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్ల టెర్మినేట్ ఉత్తర్వులను పదిరోజుల్లో వెనక్కి తీసుకుంటామని సీఎమ్‌డీలు హామీ ఇచ్చారని తెలిపారు. హెచ్-82 యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టిజెన్లు కేవలం ఒక్కరోజు మాత్రమే సమ్మె చేశారు. ఏప్రిల్ 15వ తేదీనే టీఎస్పీఈజేఏసీ నేతృత్వంలో ఏడుశాతం ఫిట్మెంట్, ఇతర డిమాండ్లను పరిష్కరించుకుంటూ కార్మికశాఖ కమిషనర్ సమక్షంలో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో ఆర్టిజన్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ హెచ్-82, ఇత్తేహాద్ యూనియన్లు ఈనెల 25 నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం, ప్రభుత్వం సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లతో పాటు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్ని కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో సమ్మెపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఎట్టకేలకు సమ్మెలో మరో భాగస్వామిగా ఉన్న ఇత్తెహాద్ యూనియన్ ఎంఐఎం నేతల జోక్యంతో సమ్మెను విరమించుకుంటున్నట్టు ప్రకటన చేసింది. అయితే ఈ సమ్మె సందర్భంగా ఆర్టిజన్ల డిమాండ్లు ఏవీ పరిష్కారం కాలేదు. కేవలం ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైన ఆర్టిజన్లను పది రోజుల్లో తిరిగి విధుల్లోకి తీసుకుంటామనే ఏకైక హామీని మాత్రమే యాజమాన్యం ఇచ్చింది. బుధవారం విద్యుత్ సంస్థల్లోని ఆర్టిజన్ కార్మికులు వందశాతం విధులకు హాజరైనట్టు సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు.