Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 రోజుల్లోగా ఇవ్వవల్సిందే
- పౌర సరఫరాల సంస్థ చైర్మెన్ సర్దార్ రవీందర్‌సింగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైస్ మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణలో మరింత కఠినంగా వ్యవహరించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ సర్దార్ రవీందర్‌సింగ్ అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అదే స్థాయిలో సీఎంఆర్ సేకరణలో కూడా ప్రదర్శించాలని సూచించారు. బుధవారం పౌర సరఫరాల భవన్లో సంస్థ ఎండీ అనిల్‌కుమార్‌తో కలసి 2019-20లో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంఆర్ అధికంగా పెండింగ్‌లో ఉన్న వనపర్తి, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, ములుగు, నాగర్‌కర్నూల్ జిల్లాల డీఎస్ఓలు, డీఎంలు డిఫాల్ట్ రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ సీఎంఆర్‌లో జాప్యంతో వడ్డీ భారం పెరుగుతున్న దని తెలిపారు. సీఎంఆర్ అప్పగించడంలో మీకున్న సమస్యలేంటి, 90 మిల్లర్లకు లేని ఇబ్బంది మీకే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌తో పాటు కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో గణనీయంగా ధాన్యం దిగుబడి, కొనుగోళ్లు పెరిగాయని చెప్పారు. ఒక తెలంగాణ మినహా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్రంలో పండిన పంటలో పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదన్నారు. గతంలో మిల్లర్లు రైస్ మిల్లును నడపలేక రేకులు అమ్ముకునే స్థితి నుంచి సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో కొత్తగా రైస్ మిల్లును ఏర్పాటుచేసే స్థాయికి చేరుకున్నారని గుర్తుచేశారు.
2019-20లో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లు 15 రోజుల్లోగా బకాయి పడిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆయా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ లేకుండా చూసుకోవాలని సూచించారు. మిల్లర్ల నుంచి సీఎంఆర్ తీసుకునే సమయంలో నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని అధికారులను కోరారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ రాజారెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.