Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల
- ఇందిరాపార్క్ వద్ద 'టీ-సేవ్' నిరుద్యోగ దీక్ష
నవతెలంగాణ - అడిక్‌మెట్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సరైన పాలన ప్రజలకు అందించడం లేదు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చానని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్ వద్ద 'టీ-సేవ్' నిరుద్యోగ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు ప్రొఫెసర్ కాశీం, ప్రజా గాయకుడు గద్దర్ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. నిరుద్యోగ దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తన దీక్షను ఆపాలని విశ్వప్రయత్నాలు చేశారని.. అందులో భాగంగానే అరెస్టు చేశారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి మహిళలు అంటే లెక్కలేదని, మాజీ ముఖ్యమంత్రి భార్య విజయమ్మకు గౌరవం ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. పోలీసులను కేసీఆర్ పని మనుషుల్లాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులను అవమానపరచడం తన ఉద్దేశం కాదని.. వారు తన మీద పడుతుంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం తోయాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకానీ కొట్టాలనే ఉద్దేశం తనకు లేదని వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మొత్తం స్కాముల్లో కూరుకుపోయిందన్నారు. తండ్రి ప్రాజెక్టుల స్కాం.. కూతురు లిక్కర్ స్కాం.. సన్ పేపర్ స్కాంలకు పాల్పడ్డారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ కేసులో 19 మందిని మాత్రమే దోషులుగా చిత్రీకరించారన్నారు. పాత్రధారులను మాత్రమే పట్టుకుని సూత్రధారులను వదిలేశారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఐటీ శాఖ లోపాలు ఉన్నాయన్నారు. సీబీఐ విచారణ చేస్తే అవి బయటపడతాయని భయం పట్టుకుందన్నారు. కేటీఆర్‌ను కాపాడటంలో భాగంగానే సిట్ విచారణ సాగుతుందన్నారు. అసలు ప్రభుత్వ పరిధిలో వాడుతున్న కంప్యూటర్లకు అన్నిటికీ భద్రత సర్టిఫికెట్లు ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక టీసేవ్ తరఫున సీఎం కేసీఆర్‌కు పది ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని పంపుతున్నామని.. దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించలేదన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ రాలేదని, విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. నాణ్యమైన విద్య అందాలంటే తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలని చెప్పారు. 900కు పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉంటే పేదలకు ఏ విధంగా విద్య అందించగలమని ప్రశ్నించారు. వెంటనే టీఎస్పీఎస్సీ దోషులను కఠినంగా శిక్షించి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షలో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, వివిధ విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆస్తి కోసం వైఎస్ వివేక హత్య జరగలేదు : వైఎస్ షర్మిల
ఆస్తి కోసం వైఎస్ వివేక హత్య జరగలేదని వైఎస్ షర్మిల అన్నారు. నిరుద్యోగ దీక్ష అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తన చిన్నాన్న వివేకానందరెడ్డి పేరుపై గాని చిన్నమ్మ పేరుపై గాని ఎలాంటి ఆస్తులు లేవని తెలిపారు.
ఆస్తులన్నీ కూతురు వైఎస్ సునీత పేరు మీద వీలునామా రాశారని స్పష్టం చేశారు. ఉన్న చిన్నపాటి ఆస్తులను సునీత పిల్లలపై రాశారని చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి ప్రజల మనిషిని .. ఆయన గురించి కడప, పులివెందుల ప్రజానీకానికి బాగా తెలుసన్నారు.
ప్రజలకు ఏదేని సమస్యలు వస్తే వారితో కలిసి నేరుగా అధికారుల వద్దకు వెళ్లి పరిష్కరించేవారని గుర్తు చేశారు. లేని వైఎస్ వివేకానందరెడ్డిపై వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడం దారుణమన్నారు.