Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలి
- కమిషనర్ ఆఫీస్ ఎదుట గిరిజన హాస్టల్ వర్కర్స్ ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో క్యాటరింగ్ విధానం రద్దు చేయాలనీ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాను ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ..క్యాటరింగ్ కోసం జీఓ నెంబర్ 527ను తీసుకొచ్చి ఇప్పుడొస్తున్న రూ.12 వేల వేతనాన్ని కూడా తగ్గించే కుట్రకు రాష్ట్ర సర్కారు పూనుకోవడం దారుణమన్నారు. ప్రతినెలా మొదటి వారంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డైలీవేజ్ వర్కర్స్‌ను క్రమబద్ధీకరించాలనీ, ఉద్యోగ భద్రత, వేతన భద్రత కల్పించాలని కోరారు. ఐదేండ్ల సర్వీస్ పూర్తయిన డైలీవేజ్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీని అమలు చేయాలని విన్నవించారు. యూనిఫామ్స్, గుర్తింపు కార్డులు ఇస్తామన్న హామీలను అధికారులు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలపై గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర్రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
వేతనాలు తగ్గకుండా చర్యలు తీసుకుంటాం. - ఏడీ సర్వేశ్వర్‌రెడ్డి
పీఎంహెచ్ వర్కర్స్కు వేతనాలు తగ్గకుండా చర్యలు తీసుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ ఎడి. సర్వేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ''యాక్టివిటీస్'' నిర్వహణ పేరిట అవసరమైన మేరకు కార్మికులకు వేతనాలు పెంచేలా చర్యలు తీసుకుంటామనీ, డైలీవేజ్ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి కె. బ్రహ్మాచారి, నాయకులు సంగ్యా నాయక్, ముత్తయ్య, హీరాలాల్, లక్ష్మణ్, కౌసల్య, అనురాధ, జంపయ్య, శేషు, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.