Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ డీన్ మల్లేశం
- ఎస్ఎఫ్ఐకి అభినందనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడల్ ఎంసెట్ పరీక్షతో విద్యార్థులకు ఎంతో ఉపయోగం కలుగుతుందని ఓయూ యూజీసీ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ మల్లేశం అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షను హైదరాబాద్‌లోని నానో జూనియర్ కళాశాలలో బుధవారం ప్రశ్నాపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె అశోక్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మల్లేశం మాట్లాడుతూ విద్యార్థుల్లో పరీక్షలంటే భయం పోగొట్టడానికి ఇలాంటి మోడల్ ఎంసెట్, నీట్ ఎంతో దోహదపడతాయని చెప్పారు. ఎంసెట్, నీట్ పరీక్షల్లో రాణించేందుకు ఇవి ఉపయోగపడ తాయని అన్నారు. విద్యార్థుల్లో అవగాహన పెంచడం కోసం ఇలాంటి పరీక్షలను నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నాయకులను ఆయన అభినందించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు మాట్లాడుతూ 18 ఏండ్లుగా ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ ఎంసెట్‌ను నిర్వహించామని గుర్తు చేశారు. ఈ పరీక్షల్లో రాణించిన విద్యార్థులు ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో సైతం మంచి ర్యాంకులు పొందారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు సరైన అవగాహన కల్పించడం కోసమే ఈ మోడల్ ఎంసెట్, నీట్‌ను నిర్వహిస్తున్నామని అన్నారు.
నానో కళాశాల చైర్మెన్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ విద్యార్థుల అవగాహన కోసం ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న ఈ కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, సహాయ కార్యదర్శి దామెర కిరణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా, నాయకులు
స్టాలిన్, శివ, కళా శాల సిబ్బంది పాల్గొన్నారు.