Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగిన సమ్మె
- సంఘీభావం తెలిపిన పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-విలేకరులు
ఐకేపీ వివోల సమ్మెలో భాగంగా బుధవారం రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా ముదిగొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీవోఏలు చేస్తున్న దీక్ష శిబిరాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో కలిసి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్యలపై ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కరించాలన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం వేతన స్కేలును ప్రకటించి వారికి న్యాయం చేయాలన్నారు. వారికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందని నున్నా నాగేశ్వరరావు తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సహకారం అందిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో వీవోఏలు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. భద్రాచలంలో సీఐటీయూ నాయకులు ఏజే రమేష్, నర్సారెడ్డి సంఘీభావం తెలిపారు. దమ్మపేటలో జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఐకేపి వీఓఏ ఉద్యోగుల సమ్మె బుధవారం 9వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు టీపీసీసీ మాజీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి దైద రవీందర్, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి మేడి ప్రియదర్శిని మద్దతు ప్రకటించారు. కేతెపల్లిలో వీవోఏలు రోడ్డు ఊడ్చారు. చిట్యాల మండలంలో వీవోఏలు రోడ్లను ఊడుస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు వైయస్సార్ తెలంగాణ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ పోకల అశోక్ మద్దతు తెలిపారు. మర్రిగూడలో వీఓఏల సమ్మె కొనసాగింది. నాంపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డు ఊడ్చారు. పెద్దవూర మండల కేంద్రంలో వీఓఏలు వంటావార్పు నిర్వహించారు.