Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మృతి
- కొట్టడం వల్లే చనిపోయాడని కుటుంబీకుల ఆందోళన
- ఎక్స్‌గ్రేషియా రూ.40 లక్షలివ్వాలని డిమాండ్
నవతెలంగాణ-బేగంపేట్
పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు అనామానాస్పద స్థితిలో మృతిచెందాడు. అయితే, పోలీసులు కొట్టడం వల్లే తట్టుకోలేక చనిపోయాడని నిందితుని కుటుంబీకులు ఆందోళన చేశారు. కుటుంబానికి రూ.40 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపింది. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సింగరేణి కాలనీకి చెందిన చిరంజీవి(38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య మంజుల, ఇద్దరు కుమారులు, కూతురుతో కలిసి నివసించేవాడు. అయితే, మొబైళ్ల చోరీ కేసులో నిందతునిగా అతన్ని తుకారంగేట్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారిస్తున్న సమయంలో అతను కుప్పకూలాడు. వెంటనే పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చిరంజీవి మృతిచెందాడు. చిరంజీవి గతంలో పలు కేసులలో నిందితునిగా ఉన్నాడు. అతను అనారోగ్యంతో మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.
చిరంజీవి మృతిచెందిన విషయం తెలుసుకున్న అతని బంధువులు, కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు కొట్టడంతోనే చిరంజీవి మరణించినట్టు ఆరోపిస్తున్నారు. పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించడంతోనే చిరంజీవి మృతిచెందాడని, తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి 11 గంటలకు చిరంజీవి మృతిచెందితే.. బుధవారం ఉదయం గాంధీ ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని పోలీసులు తమకు ఫోన్‌చేసి చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవికి ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని, పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపించారు. రూ.40లక్షలు ఎక్స్‌గ్రేషీయా చెల్లించాలని డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి వరకు గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళన కొనసాగింది. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రి ప్రధాన గేటుకు పోలీసులు తాళాలేశారు. ఎవరినీ లోనికి అనుమతించలేదు.