Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి వస్తువూ చైనా నుంచే దిగుమతి ఎందుకు?
- రైతు ఆత్మహత్యలు లేని మహారాష్ట్రగా తీర్చిదిద్దుతాం
- ఆ రాష్ట్రంలో భారీ కిసాన్ ర్యాలీ : సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో కావాల్సినంత నీరున్నా ప్రజలకు సాగు, తాగునీరు ఇవ్వరెందుకు?. మేకిన్ ఇండియా అంటూ దేశమంతా చైనా బజార్లతో నింపారెందుకు?. మాంజా మొదలు అనేక వస్తువులు చైనా నుంచే దిగుమతి ఎందుకు చేసుకుంటున్నారు? ... అంటూ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, 10- 12 లక్షల మందితో మహారాష్ట్రలో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. మహారాష్ట్ర గడ్చిరోలి నుంచి గోదావరి ప్రవహిస్తున్నా... అక్కడ తాగునీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ నాయకునికి నీటి గురించి చింత లేదనీ, ఓట్లు పడితే దుకాణం నడుపుకుంటున్నారని విమర్శించారు. మనలో చైతన్యం రానంత వరకు మన జీవితంలో మార్పు రాదని స్పష్టం చేశారు. దేశంలో ప్రతీ ఎకరానికి సాగునీరు, ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వాలన్నదే బీఆర్ఎస్ నినాదమని తెలిపారు. ''పెన్ గంగా, వార్దా, గోదావరి నదులున్నా... కూడా తాగునీటికి కష్టాలే. ఔరంగాబాద్, అకోలాలో నీటి కష్టాలు ఉన్నాయి. పది రోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తున్నాయని చెప్పారు. దీనికి కారణం ఎవరు..? రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగాయి. కరెంట్ కష్టాలు కూడా మాయం అయ్యాయి. తెలంగాణలో పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ.10 వేలు ఇస్తున్నాం. తెలంగాణలో 15 నిమిషాలకో భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. పట్టా చేతికొస్తుంది. తెలంగాణలో సాధ్యమైనన్నీ మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావు. మహారాష్ట్రలో వచ్చే జెడ్పీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలి. ఓటు వేస్తేనే మీకు ఎవరైనా సహాయం చేస్తారు... ''అని కేసీఆర్ చెప్పారు.
మహారాష్ట్రలో జిల్లా పరిషత్ ఎన్నికలతో బీఆర్ఎస్ పని మొదలవుతుందని తెలిపారు. నాగ్‌పూర్, ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మే 7 నుంచి జూన్ 7 వరకు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కమిటీలు వేస్తామని కేసీఆర్ ప్రకటించారు.