Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యాలయాల తరలింపు షురూ
- ప్రారంభోత్సవంలో అందరూ పాల్గొనాలి : సీఎస్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రారంభమైంది. ఈమేరకు ఆ ప్రక్రియను ప్రభుత్వం బుధవారం చేపట్టింది. బీఆర్కే భవన్ నుంచి కొత్త సెక్రటేరియేట్‌కు ఫైళ్లు, కంప్యూటర్లు, జిరాక్స్ యంత్రాల తరలింపు ప్రక్రియకు ఆయా శాఖల అధికారులు శ్రీకారం చుట్టారు. షెడ్యూల్‌కు అనుగుణంగా ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన చెందిన వస్తువులను కొత్త సెక్రటేరియేట్ లోకి తరలిస్తున్నారు. బుధవారం ఏడు, గురువారం పది, శుక్రవారం మరో పది శాఖలను తరలించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఉన్నతాధిక ారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చారు. ఎస్సీ అభివద్ధి, గిరిజన సంక్షేమ శాఖలు ఇప్పటికే తరలింపును చేపట్టాయి. ఎస్సీ అభివద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కొత్త సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లారు. ఆయా శాఖలకు చెందిన ఫైళ్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, జిరాక్స్ యంత్రాలను నూతన భవనంలోకి తీసుకెళ్లారు. కొత్త సెక్రటేరియేట్‌లో కొత్త ఫర్నీచర్‌ను ఏర్పాటు చేయడంతో పాత భవనం బీఆర్కే భవన్‌లోనే ఫర్నిచర్‌ను ఉంచేయాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బీఆర్కే భవన్ నుంచే గాక నగరంలోని ఇతర కార్యాలయాల నుంచి కూడా అంబేద్కర్ సచివాలయానికి తరలించేందుకు సన్నాహాలు చేశారు. కాగా సచివాలయం ప్రారంభం రోజున ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరూ కచ్చితంగా విధులకు హాజరుకావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి ఆదేశించారు . తొలిరోజు జరిగే ప్రారంభోత్సవ సభలో అందరూ విధిగా పాల్గొనాలని ఉత్తర్వులు జారీచేశారు.
విధుల్లోకి టీఎస్‌పీస్పీ
ఇక కొత్త సెక్రటేరియేట్ భద్రతా బాధ్యతలను టీఎస్పీఎస్పీ చేపట్టింది. ఇప్పటిదాకా ఎస్పీఎఫ్ ఆ బాధ్యతలను నిర్వర్తించగా, ఆ శాఖ నుంచి టీఎస్ఎస్పీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ (సీఎఎస్ఓ)గా అదనపు కమాండెంట్ పి. వెంకట్రాములును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అందుకు అనుగుణంగా టీఎస్పీఎస్పీ బలగాలు బుధవారం నుంచి విధుల్లో చేరాయి. టీఎస్పీస్పీతో పాటు ఏఆర్, సీఎస్‌డబ్ల్యూ, ఐఎస్‌డబ్ల్యూ, ట్రాఫిక్ విభాగాలకు చెందిన 468 మంది భద్రతా సిబ్బంది కొత్త సచివాలయం భద్రతా విధుల్లో భాగస్వాముల వుతారు. వీరిలో టీఎస్ఎస్పీ సిబ్బందినే 270 మంది ఉన్నట్టు అధికారిక సమాచారం.
మీడియాకు 'నో' ఎంట్రీ
కొత్త సచివాలయంలోకి ఆయా ప్రభుత్వ కార్యాలయాల తరలింపుకు సంబంధించి వార్తలను కవర్ చేసేందుకు అక్కడకు వెళ్లిన పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లకు అనుమతి లభించలేదు. సామాగ్రి తరలిస్తున్న వాహానాల ఫోటోలను పాత సచివాలయంతోపాటు కొత్త సెక్రెటరియేట్ మెయిన్‌గేట్ రోడ్డు బయట నుంచే తీసుకోవాల్సి వచ్చింది. సెక్యూరిటీని అడిగినా లోపలకు పోనివ్వల ేదు. ఇక గత్యంతరం లేక బయట నుంచే మీడియా తమ విధులను పూర్తిచేసుకోవాల్సి వచ్చింది.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల
ఈనెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ భవన ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి సభ ప్రాంగణం, వాహనాల పార్కింగ్ ఏరియాను చూశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా శాఖల సచివాలయ ఉద్యోగులు, పలువురి సీటింగ్, వారికి కేటాయించబడిన పార్కింగ్ ఏర్పాట్లపై ఈ సందర్బంగా మంత్రి సంబంధిత అధికారులతో చర్చించారు. తెలంగాణ వైభవం ఉట్టి పడేలా సెక్రటేరియట్ లైటింగ్ వంటి సుందరీకరణ పనులపై ప్రధానంగా దష్టి సారించాలని అధికారులను మంత్రి అదేశించారు.
వికలాంగుల శాఖకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయించాలి
ఈనెల 30వ తేదీన ప్రారంభమయ్యే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వికలాంగుల సంక్షేమ శాఖకు గ్రౌండ్ ఫ్లోర్లో కేటాయించాలని టీఆర్ఎస్వీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ మున్నా డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా బుధవారం ఆయన లేఖ రాశారు. వికలాంగులు లిఫ్టులున్నా కూడా పై అంతస్తుల వరకు వెళ్లి సమస్యలను చెప్పే పరిస్థితి ఉండబోదని తెలిపారు. పూర్తి వైకల్యం ఉన్న వారు చాలా అవస్థలకు గురవుతారని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి వికలాంగుల సంక్షేమ శాఖను సచివాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేయాలని కోరారు.