Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు నేడే ఆఖరు
- మొత్తం ఫీజు కడితేనే పరీక్షలకు అనుమతి
- ప్రయివేటు కాలేజీ యాజమాన్యాల ఇష్టారాజ్యం
- డిగ్రీ విద్యార్థుల్లో ఆందోళన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'కాలేజీ ఫీజు కడితేనే పరీక్షలకు అనుమతి ఇస్తాం. మొత్తం ఫీజు కట్టకుంటే విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు కూడా తీసుకునేది లేదు.'అంటూ హైదరాబాద్లో ఓ ప్రయివేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యం హుకుం జారీ చేసింది. ఇదే పరిస్థితి మిగిలిన ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లోనూ ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలో డిగ్రీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్తోపాటు గతంలో ఫెయిలైన సెమిస్టర్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు గురువారంతో గడువు ముగియనుంది. ఆలస్య రుసుం రూ.500తో ఈనెల 29 నుంచి వచ్చేనెల నాలుగో తేదీ వరకు అవకాశమున్నది. అయితే కాలేజీ ఫీజు మొత్తం చెల్లిస్తేనే పరీక్షా ఫీజు తీసుకుంటామంటూ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. డిగ్రీ పరీక్షలు రాసేదెట్టా?అంటూ మానసిన వేదనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాలేజీ ఫీజుతో సంబంధం లేకుండా పరీక్ష ఫీజును తీసుకునేలా ప్రయివేటు డిగ్రీ కాలేజీలను ఆదేశించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఓయూ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వచ్చేనెల 18 నుంచి ప్రారంభమవుతాయని తాత్కాలిక షెడ్యూల్ను విడుదల చేసింది. ఇంకోవైపు మరికొన్ని ప్రయివేటు డిగ్రీ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. విశ్వవిద్యాలయం నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీన్ని అరికట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.
'అవంతి కాలేజీలో మా బాబు బీకాం జనరల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఆ కాలేజీ మొత్తం ఫీజులో రూ.15 వేలు చెల్లించాల్సి ఉన్నది. రూ.10 వేలు కాలేజీ ఫీజు కట్టి పరీక్ష ఫీజు చెల్లిస్తామని చెప్పాం. మిగిలిన రూ.ఐదు వేలు పరీక్షల సమయంలో హాల్టికెట్ తీసుకునే సమయంలో కడతామని కాలేజీకి చెప్పాం. కానీ ఆ కాలేజీ యాజమాన్యం అందుకు అంగీకరించడం లేదు. పరీక్షా ఫీజు కట్టించుకోకుండా ఉంటే మా బాబు భవిష్యత్తు ఏంటీ?. పరీక్షలు రాయకుండా ఉండాల్సిందేనా?. ఆ కాలేజీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం చేయాలి'అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నత విద్యామండలికి (పేరు చెప్పడానికి ఇష్టపడని)ఓ తండ్రి విజ్ఞప్తి చేశారు.