Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంక్షేమ శాఖలో అక్రమాల బాగోతం
- జిల్లా కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించిన వైనం
- పోస్టింగుల్లో త్రిమూర్తులదే రాజ్యం: విచారణ కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి లేఖ
- నేటికీ చేపట్టని విచారణ
నవ తెలంగాణ -నల్లగొండ కలెక్టరేట్
జిల్లా కలెక్టర్‌ను సైతం పక్కదోవ పట్టించి కొంతమంది అధికారులు తప్పుడు పత్రాలతో సంతకాలను ఫోర్జరీ చేసి ప్రభుత్వ శాఖలో అనర్హులకు పోస్టులను కట్టబెట్టిన వైనం గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క పేదల సంక్షేమమే తమ ధ్యేయమని చెబుతూ ఉంటే కమిషన్లకు అలవాటు పడ్డ కొంతమంది అధికారులు గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడటం గమనార్హం. నిరుపేద గిరిజనులు, విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే.. అవినీతి అధికారులు కొందరు ఆ సొమ్మును స్వాహా చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను పక్కదోవ పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నల్లగొండ జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో గతంలో తిష్ట వేసి పనిచేసిన ముగ్గురు అధికారుల హయాంలో జరిగిన అవినీతి అక్రమాల బండారం తాజాగా బటయపడింది.
గిరిజన సంక్షేమ శాఖలో 2016 నుంచి 2019 వరకు పనిచేసిన ముగ్గురు అధికారులు ఈ పని చేశారు. అందులో ఒకరు రిటైర్ అయ్యారు. మరొకరు సూర్యాపేట గిరిజన సంక్షేమ శాఖకు, ఇంకొకరు తిరుమలగిరి సాగర్‌కు బదిలీ అయ్యారు. ఈ ముగ్గురు అధికారులు.. ఉన్నతాధికారుల అండదండలతో, రాజకీయ నాయకుల పలుకుబడితో ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులూ లేకుండా జీవో నెంబర్ 212లోని నియమ నిబంధ నలకు విరుద్ధంగా 54 మంది టైం స్కేల్ వర్కర్లను నియమిం చారు. వారిపై చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం దుబ్బ తండాకు చెందిన పలువురు గిరిజనులు గతేడాది అక్టోబర్ 30వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయానికి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌కు లేఖలు పంపారు. అయితే పైన తెలిపిన ఏ శాఖ కూడా జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టకుండా లేఖను బుట్ట దాఖలు చేశారని తెలిసింది. అయితే ఫిర్యాదుదారులు తెలంగాణ విజిలెన్స్ శాఖకు కూడా పంపడంతో అసలు విషయం బయటపడింది. విజి లెన్స్ అధికారులు విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ కార్యదర్శిని ఆదేశించడంతో గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ కార్యదర్శి విచారణకు డిప్యూటీ డైరెక్టర్ విజయ లక్ష్మిని ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టాల్సి ఉండగా జరగక పోవడంతో మరిన్ని అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. దాంతో ఇందులో కూడా ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. విచారణ నిమిత్తం అదే రోజు గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయానికి వచ్చిన టైం స్కేల్ బాధితులు డిప్యూటీ డైరెక్టర్ రాకపోవడంతో సాయంత్రం వరకు వేచి చూసి వెనుతిరిగారు.
అవినీతి అక్రమాల చిట్టా
గతంలో పనిచేసిన డీటీడబ్ల్యూఓ నకిలీ ఉత్తర్వులు సృష్టించి, సంతకాలన్నీ ఫోర్జరీ చేసి ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా జిల్లా కలెక్టర్‌ను తప్పుదారి పట్టించడం వల్లే అవినీతి అక్రమాలకు తెర దించారని తెలుస్తోంది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన మధ్యవర్తి ప్రధాన పాత్ర పోషించి ఒక పోస్ట్‌కు రూ.2 నుంచి 5 లక్షల వరకు వసూలు చేసి సంబంధిత అధికారులకు ముట్టచెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టైం స్కేల్ ఉత్తర్వులు జారీ చేయడంలో బదిలీ అయిన ఒక అధికారి కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. రెండో స్థాయి అధికారి అండదండలతో నియమాలను బ్రేక్ చేసి, అర్హులను తొక్కేసి 54 మంది వర్కర్లను నియమించారు. విషయం బయటకు పోకుండా రాజకీయ పలుకుబడితో పనులు కానిచ్చారని, తమ మాట వినని అధికారులను రాజకీయ అండదండలు, డబ్బులు వెదజల్లి జిల్లా దాటించినట్టు సమాచారం. ఇందులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన వ్యక్తి సమీప బంధువులు కూడా ఉద్యోగాలు పొందారు. వారంతా విధులు నిర్వహించకపోయినా వేతనాలు పొందుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం హెచ్‌డబ్ల్యూఓ గ్రేడ్ వన్ అధికారి.. గతంలో ఎస్జీటీ నుంచి హెచ్‌డబ్ల్యూఓ గ్రేడ్-2గా ప్రమోషన్ తీసుకున్న సందర్భంలోనూ జీవో 45 నిబంధనలను పాటించకుండా పదోన్నతి పొందినట్టు రుజువైంది.
డీటీడీఓపై ఉన్నత స్థాయి అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకున్నప్పటికీ పదోన్నతి పొందిన అధికారి మాత్రం పదవి అనుభవిస్తూ శాఖపై పూర్తి అజమాయిషీ చేస్తున్నారు. అంతేకాకుండా వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ హాజరు లేకుండా డైట్ చార్జీలను డ్రా చేస్తున్నారు. అంతేకాదు, విద్యార్థులకు పెట్టాల్సిన మెనులోనూ నాణ్యత పాటించడం లేదని, ఎమ్ఎల్ఎస్ పాయింట్ల నుంచి వచ్చే బియ్యాన్ని విద్యార్థుల కోసం ఉపయోగించకుండా అక్కడే వాటిని విక్రయిస్తున్నారు. విద్యార్థుల కోసం జీసీసీ (గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్) నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు నుంచి కొనుగోలు చేయాల్సిన కిరాణా సరుకులను తమకు తెలిసిన షాపు వద్ద సరిపడా కొనుగోలు చేయకుండా విద్యార్థుల సంఖ్యకు సగానికి మాత్రమే వస్తువులు కొనుగోలు చేసి నకిలీ బిల్లులను సృష్టించారు. వస్తువులను విక్రయించిన షాప్ యజమాని ఖాతాలో వేయాల్సిన డబ్బులను వారి డీడీఓ అకౌంట్లో వేసుకొని డ్రా చేసి వారికి ఇవ్వాల్సింది ఇచ్చి మిగతావి కమిషన్ రూపంలో నొక్కేస్తున్నారు. అంతేకాదు, మెడికల్ అలవెన్స్, హాస్టల్ భవనాల రిపేర్లకు సంబంధించిన బిల్లులు, విద్యార్థులకు పంపిణీ చేసే నోటు పుస్తకాలు, బ్లాంకెట్లు, షాపులు, తదితర సామగ్రిలోనూ అవినీతికి పాల్పడ్డారని తెలిసింది.
ఆరు నెలలు దాటినా చేపట్టని విచారణ : ఫిర్యాదుదారులు
గిరిజన సంక్షేమ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌కు లేఖ రాసినా నేటికీ ఎలాంటి విచారణా చేపట్టలేదు. విజిలెన్స్ అధికారులే రికార్డులను పరిశీలించి విచారణ చేపట్టాలి. విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని అవినీతికి పాల్పడ్డ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించాలి. లేనిపక్షంలో తమ కార్యాచరణను ప్రకటించి పోరాటాన్ని ఉధృతం చేస్తాం.
బిజీ వల్ల రాలేకపోయారు..
వాస్తవానికి మేడం రావాల్సి ఉంది. బిజీ వల్ల రాలేకపో యారేమో. మరొక రోజైనా తప్ప కుండా వస్తారు. అది నా పరిధి విషయం కాదు.
మేడమే వచ్చి ఎంక్వయిరీ చేస్తారు.
- రాజ్ కుమార్
నల్లగొండ డీటీడబ్ల్యూఓ