Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశానికి బీఆర్ఎస్ వెలుగుదివ్వె...
- పార్లమెంటరీ పంథాలో దేన్నైనా సాధించొచ్చని నిరూపించాం
- స్వరాష్ట్రాన్ని సాధించాం.. పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచాం...:
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్
- ప్రతినిధుల సభను ప్రారంభించిన సెక్రటరీ జనరల్ కేకే
- తీర్మానాలను ప్రతిపాదించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించాలి...
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటమనేది పెద్ద టాస్క్ కాదని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కానీ గతం కన్నా ఎక్కువ సీట్లను సాధించాలనీ, ఈసారి వంద సీట్లు సాధించాలంటూ బీఆర్ఎస్ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. దాహం వేసినప్పుడే బావి తవ్వుదామనే పద్ధతిలో కాకుండా అనునిత్యం ప్రజల్లో ఉండటం ద్వారా పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. దళిత బంధు పథకానికి సంబంధించి కొంతమంది ప్రజా ప్రతినిధులు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. అలాంటి వారందరి చిట్టా తన దగ్గరుందంటూ హెచ్చరించారు. ఇకముందు వసూళ్లకు పాల్పడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు.
కుక్కలు మొరిగినట్టుగా కేంద్రం తీరు...
రైతులను ఆదుకునే విషయంలో కేంద్రం తీరు దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టుగా ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్లే తెలంగాణ రైతులు కేంద్రంపై ఏనాడూ ఆశలు పెట్టుకోవటం లేదన్నారు. అవసరానికి అక్కరకొచ్చే పరిస్థితి కేంద్రానికి లేదంటూ విమర్శించారు. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వమే అన్నింటికీ సిద్ధపడి రైతులను ఆదుకుంటోందని వివరించారు. ఈ క్రమంలో దేశంలోనే మొదటిసారిగా ఎకరాకు రూ.10 వేల పునరావాస సాయాన్ని ప్రకటించామని గుర్తు చేశారు. ఒక్క గింజనూ వదలకుండా మొత్తం ధాన్యాన్ని కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయేనని తెలిపారు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో గుణాత్మక రాజకీయాలతో ఒక నూతన ట్రెండ్‌ను సృష్టించేందుకే పరిణామ క్రమంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ముందుకొచ్చిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. భారత దేశానికి అదో వెలుగుదివ్వె అని ఆయన తెలిపారు. అదే స్ఫూర్తితో పాలనలోనూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేసేందుకోసం ఆవిర్భవించిన బీఆర్ఎస్ (టీఆర్ఎస్)... 22 ఏండ్ల అనతికాలంలోనే స్వరాష్ట్ర సాధన లక్ష్యాన్ని సాధించటం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. ఆ క్రమంలో ఒక గుణాత్మక మార్పు చెంది చారిత్రక దశలోకి ప్రవేశించిన సందర్భంలో 23వ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవటం అందరకీ గర్వకారణమని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ వేడుకలను, గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా ఆ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు అక్కడికి చేరుకున్న కేసీఆర్... తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభకు చేరుకున్నారు. ఆ తర్వాత పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే.కేశవరావు ప్రసంగంతో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఆయన ప్రసంగం పూర్తయిన తర్వాత ప్రతినిధుల నుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు తీర్మానాలను ప్రతిపాదించారు. ప్రతినిధుల సభలో కేసీఆర్ మాట్లాడుతూ... రాజకీయ పంథాలో తక్కువ నష్టంతో తెలంగాణాను సాధించుకున్నామని అన్నారు. తద్వారా పార్లమెంటరీ పంథాలో దేన్నైనా సాధించవచ్చనే విషయా న్ని రుజువు చేశామని తెలిపారు. 75 ఏండ్ల స్వతంత్ర భారత పార్లమెంటరీ పంథాలో తెలంగాణ బిడ్డలు... గులాబీ జెండానెత్తుకుని అనుసరించిన ప్రజాస్వామిక ఉద్యమ కార్యాచరణ అత్యంత క్లిష్టమైన తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాన్ని సాధించిందని వివరించారు. అదే పంథాలో 'అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్...' అనే నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలబెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలొచ్చినా వ్యవసాయ రంగాన్ని ఆదుకుని తీరతామని అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పునరావాస సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. తద్వారా వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూస్తామని హామీనిచ్చారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళుతున్నదని తెలిపారు. ఇటీవల అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో తక్షణమే కలెక్టర్లతో నివేదికలు తెప్పించుకుని వారిని ఆదుకోవాలని ప్రజా ప్రతినిధులను ఆయన ఆదేశించారు. అకాల వర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యపరచాలని సూచించారు. మొక్క జొన్న లు, జొన్నలతోపాటు ఇతర అన్ని పంటలనూ గతంలో మాదిరిగానే కొంటా మని హామీనిచ్చారు. మార్క్‌ఫెడ్‌కు ఆ మేరకు ఆదేశాలిస్తామని వెల్లడించారు.
బండ మీద నూకలు పుట్టించొచ్చు...
తెలివుంటే బండ మీద సైతం నూకలు పుట్టించొచ్చని కేసీఆర్ ఈ సంద ర్భంగా వ్యాఖ్యానించారు. అదే రీతిన ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయ టం, ప్రజలతో నిత్యం సంబంధాలను నెరపటం, ప్రచార వ్యవస్థలను మెరుగు పరుచుకోవటం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చా రు. ఇదే సమయంలో పార్టీ శ్రేణులతో మమేకమవ్వటం ద్వారా వారి కష్ట సుఖాలను తెలుసుకుని కలుపుకుని పోవాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ, ప్రభుత్వం సాధించిన ప్రగతి గురించి సానుకూలంగా, పాజిటివ్‌గా ఆలోచిం చే మీడియాను, పత్రికలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. అక్క డో, ఇక్కడో క్యాడర్లో అసంతృప్తి ఉంటే దాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టా లంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఆదేశించారు.
బీసీ జనగణన ఎందుకు చేపట్టటం లేదు ?
బీసీ జనగణనను చేపట్టేందుకు కేంద్రం ఎందుకు వెనకడుగేస్తున్నదని సీఎం ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా జనగణనను ఆపలేదని గుర్తు చేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ దాన్ని ఎందుకు ఆపుతున్నదో అర్థం కావటం లేదన్నారు. మత విద్వేషాలతో కాలయాపన చేస్తూ ఆ ప్రక్రియను పక్కకు పెడుతున్నారని విమర్శించారు.
పార్టీ ఫండ్ రూ.1,250 కోట్లు...
బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఇప్పటికి రూ.1,250 కోట్లుగా నమోదైందని కేసీఆర్ తెలిపారు. ఇందులో రూ.767 కోట్లను డిపాజిట్ చేశామన్నారు. తద్వారా నెలకు రూ.7 కోట్ల వడ్డీ వస్తున్నదని తెలిపారు. దీంతో పార్టీని నడపటం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు, ప్రచారం, మౌలిక వసతుల కల్పన తదితర పనులను చేపడుతున్నామని వివరించారు.
మే 4న ఢిల్లీ కార్యాలయం ప్రారంభం...
ఢిల్లీలో నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని మే 4న ప్రారంభిస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. జూన్ ఒకటిన అమరుల స్మారకాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. రెండో తేదీన తెలంగాణ ఆవిర్భావ వేడుకలుంటాయని గుర్తు చేశారు.
అదానీపై ఎందుకు జీఎస్టీ వేయటం లేదు...? : కేటీఆర్
పసి పిల్లలు తాగే పాలపై జీఎస్టీ వేస్తున్న కేంద్రం... దేశాన్ని అప్పనంగా దోచుకుంటున్న అదానీ కంపెనీలపై ఎందుకు ఆ పన్ను వేయటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సర్వసభ్య సమావేశంలో తీర్మానాలను ప్రతిపాదించిన ఆయన మాట్లాడుతూ... దేశ యువతను రాజకీయాల వైపు మరల్చే విధంగా వారిని చైతన్యపరచాలని పిలుపు నిచ్చారు. మన జీవితంలోని ప్రతీ అంశాన్ని రాజకీయాలు ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఆ క్రమంలో రేపటి తరం రాజకీయాలపట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని అన్నారు.