Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ ఒకటి నుంచి పోరాటం తీవ్రతరం : తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పేదలకు ఇండ్లు, ఇండ్లస్థలాలివ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య వివరించారు. ఈ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జూన్ ఒకటి నుంచి పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ జిల్లా జక్కలొద్దీలో ప్రారంభమైన ఇండ్లు, ఇండ్ల స్థలాల పోరాటం రాష్ట్రవ్యాప్తంగా 67 కేంద్రాలకు విస్తరించి ఏడాది కాలంగా కొనసాగుతున్నదని తెలిపారు. 37 వేల మంది పేదలు ఆయా కేంద్రాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని చెప్పారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండగా, మరో వైపు కొన్ని కేంద్రాల్లో పోలీసులు, మరి కొన్ని కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు గుండాలతో దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శించారు.
పేదల పోరాట ఫలితంగా రాష్ట్ర సర్కారు అనివార్యంగా జీవో నెంబర్ 58, 59 విడుదల చేసిందని వీరయ్య ఈ సందర్భంగా చెప్పారు. కానీ, జీవో 58ని పక్కన పెట్టి జీవో 59తో తమకు కావాల్సిన వారికి భూమిని ధారాదత్తం చేసేందుకు పేదలకు షరతులు విధించటం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆచరణలో అమలు చేయకూడదనే ఉద్దేశంతోనే విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, పొజిషన్ లో ఉన్నట్టు రుజువులు చూపాలంటూ షరతులు పెడుతున్నారని ఆరోపించారు. అవసరమనుకుంటే భౌతికంగా తనిఖీ చేసుకోవాలనీ, కానీ అందరికి పట్టాలివ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి 120 గజాల స్థలం ఇవ్వాలనీ, సరిపోకపోతే అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించాలని సూచించారు. 5.60 లక్షల మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం తన హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఆ హామీ మేరకు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలనీ, ఇప్పటికే నిర్మించిన వాటిని కేటాయించాలని కోరారు. రాజ్యాంగం చెప్పిన జీవించే హక్కులో భాగమైన నివాస హక్కు అందరికి దక్కేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
2022 డిసెంబర్ 31 నాటికి అందరికి ఇండ్లు కట్టిస్తామన్న ప్రధాని మోడీ తన హామీ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందనే భయం మోడీకి పట్టుకుందని తెలిపారు. దీంతో కేంద్ర గృహ నిర్మాణశాఖ నిధుల నుంచి రూ.467 కోట్లతో ఇల్లు, భారీ ప్రహారీ గోడ, అక్కడ్నుంచి పార్లమెంటు వరకు సొరంగం నిర్మించుకుంటున్నారని విమర్శించారు. అదే మోడీ..... ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ ఎంపీలు, నాయకులు కేంద్రంపై ఒత్తిడి చేయాలనీ, తద్వారా పేదలకు ఒక ఇంటికి రూ.10 లక్షలు ఇప్పించాలని సూచించారు. పట్నం రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహారావు, అవాజ్ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి తదితరులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మానాయక్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.రవి, వేదిక రాష్ట్ర నాయకులు మూడ్ శోభన్, బొప్పని పద్మ, కోట రమేష్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.