Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం తగదు
- మే నుంచి జూన్ వరకు దశలవారీగా ఆందోళనలు
- జూన్ 5న పంచాయతీరాజ్ కమిషనర్‌కు సమ్మె నోటీసు
- 12న కలెక్టరేట్ల ఎదుట నిరసనలు : తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్ పాలడుగు భాస్కర్
- మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీ కార్మికుల పర్మినెంట్, కారోబార్, బిల్కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు, ఎస్కే.డే ఇన్సూరెన్స్ స్కీం అమలు, తదితర సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెలోకి వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్ పాలడుగు భాస్కర్ అల్టిమేటం జారీచేశారు. జీపీ కార్మికులు, ఉద్యోగుల వేతనాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం రూ.20 లక్షలు ఇవ్వాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. దానికి అధ్యక్ష వర్గంగా జెఏసీ సభ్యులు ఎన్. యజ్ఞనారాయణ్(టీజీపీకేబీయూ), పి. అరుణ్‌కుమార్ (ఐఎఫ్టీయూ), ఎన్. దాసు (ఐఎఫ్టీయూ), చాగంటి వెంకటయ్య (సీఐటీయూ), జె. వెంకన్న (ఐఎఫ్టీయూ), నర్సింహారెడ్డి (ఏఐటీయూసీ) వ్యవహరించారు. సదస్సునుద్దేశించి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ...సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాలకు సంబంధించిన కార్యాచరణ ప్రకటించారు. పంచాయతీల్లో వారు వివిధ కేటగిరీల వారీగా పని చేస్తున్నారని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 500 మందికి ఒక కార్మికుడిని ఖరారు చేయలేదన్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులకు నేటికీ ఉద్యోగ భద్రత లేదన్నారు. ఇచ్చే అరకొర వేతనం నాలుగైదు నెలలకోసారి ఇస్తే కార్మికులు ఎలా బతకాలని ప్రశ్నించారు. మల్టీపర్పస్ విధానం కార్మికుల ప్రాణాలను తీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కారోబార్లు, బిల్ కలెక్టర్లు ఆత్మగౌరవాన్ని చంపుకుని పనిచేస్తున్నారని వాపోయారు. వారికి వారాంతపు సెలవులు కూడా ఇవ్వడం లేదన్నారు. 11వ పీఆర్సీ కమిషన్ సిఫారసుల మేరకు జీఓ నెం.60 ప్రకారం రూ.19 వేలు, రూ.22,900, రూ.31,040 వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ సలహాదారులు ఎమ్డీ.యూసుఫ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ముందుకు తెస్తున్నదనీ, ప్రాణత్యాగం చేసి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, 8 గంటల పని దినాలను 12 గంటలకు మార్పులు చేస్తున్నదని విమర్శించారు. ఈ విధానాలను గ్రామ పంచాయితీ సిబ్బంది ముందుగా వ్యతిరేకించాలనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జేఏసీ కార్యదర్శి ఎన్.యజ్ఞనారాయణ్ మాట్లాడుతూ..కారోబార్, బిల్ కలెక్టర్ల సమస్యలు పరిష్కరించాలనీ, పీఆర్సీలో నిర్ణయించిన మినిమం బేసిక్‌ను వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. వివిధ కేటగిరీలను యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఐఎఫ్‌టీ యూ ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ.. పీఆర్సీ ద్వారా అందరికీ జీతాలు పెంచి పంచాయతీ కార్మికులను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని ఎందుకు పర్మినెంట్ చేయరని నిలదీశారు. ఎక్కడా లేని మల్టీపర్పస్ విధానం పంచాయతీ కార్మికులకే ఎందుకు అని ప్రశ్నించారు. ఈ సదస్సులో నల్లా రాధాకృష్ణ (జీపీకేఎంయూ), దాసు (ఐఎఫ్టీయూ), పి. శివబాబు (ఐఎఫ్టీయూ), తదితరులు మాట్లాడారు.
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి
జీపీ కార్మికుల డిమాండ్లన్నీ న్యాయమైనవే : ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి
గ్రామపంచాయతీ కార్మికుల కోసం తీసుకొచ్చిన మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలనీ, వారికి కనీస వేతనం ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ కాదు..అందరూ బతికే తెలంగాణ కావాలని ఆకాంక్షించారు. సమస్యలపై అన్ని గ్రామపంచాయతీ కార్మిక సంఘాలు ఒక్కతాటిపైకొచ్చి పోరాడటం మంచి పరిణామం అని ప్రశంసించారు. ఇచ్చేదే రూ.8,500 వేతనం, అందులో ఇద్దరు, ముగ్గురు పంచుకుంటే ఆ వేతనంతో ఎలా బతుకుతారని ప్రశ్నించారు. వారు కోరుతున్నవేం గొంతెమ్మ కోరికలు కాదనీ, న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.పంచాయతీ కార్మికులు ప్రమాదాల్లో చనిపోతుంటే తనకేం పట్టనట్టు రాష్ట్ర సర్కారు వ్యవహరించడం సరిగాదన్నారు. పంచాయితీ సిబ్బందికి ప్రకటించిన ఎస్కే.డే ఇన్సూరెన్స్ పథకాన్ని నేటికి కూడా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల పోరాటాలకు తన మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు.
జేఏసీ కార్యాచరణ ఇదే..
- గ్రామాల్లో మేడే దినోత్సవాన్ని నిర్వహించాలి.
- మే 10 నుండి 25 వరకు జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలి.
- మే 26న సర్పంచ్‌లకు, పంచాయితీ కార్యదర్శులకు వినతి పత్రాలు ఇవ్వాలి.
- మే 29న ఎంపిడిఓలకు వినతి పత్రాలు ఇవ్వాలి.
- జూన్ ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతులు అందజేత
- జూన్ 5న పంచాయితీరాజ్ శాఖ కమిషనర్‌కు సమ్మె నోటీస్ ఇవ్వాలి.
- జూన్ 12న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
- సమస్యలు పరిష్కరించకుంటే జూన్ 25 తర్వాత నిరవధిక సమ్మెలోకి కార్మికులు