Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే వెబినార్‌లో దేవరాజు మహారాజు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'ఆనాటి డార్విన్ జీవ పరిణామం నుంచి పక్కకుపోయిన దేశం నేడు ప్రమాదకర పరిణామంలో ఉంది. ప్రభుత్వాలు తాత్కాలికమైనవి..సైన్స్ శాశ్వతమైనది. సైన్స్‌తో ఆటలా డొద్దు. భవిష్యత్ అంతా దానిదే. యువత సైన్స్ వైపు వెళ్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తీసేసినంత మాత్రాన యువత మెదళ్ల నుంచి శాస్త్రీయ భావనలను తీసేయలేరు. సైన్స్ వల్లనే మానవ జీవితం సుఖమయం అయింది. ఎన్నో సౌలభ్యాలు పొం దుతున్నాం' అని ప్రొఫెసర్ దేవరాజు మహరాజు అన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్యవిజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 'మనువాదులకు చెంపపెట్టు జీవ పరిణామం' అంశంపై ఎస్వీకే కార్యదర్శి ఎస్.వినయకుమార్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. లౌకిక, ప్రజాస్వామ్య దేశంలో ఒక మతానికి సంబంధించిన గ్రంథాన్ని విద్యార్థులపై రుద్ధమేంటని ప్రశ్నించారు. రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి కేంద్ర పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. డార్విన్ జీవ పరిణామక్రమ సిద్ధాంతాన్ని ఎస్సీఈఆర్టీ తీసేస్తే తమ రాష్ట్రంలో పాఠ్యపుస్తకాల్లో బోధిస్తామంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పిందని, మోడీకి ఆ రోజే సీఎం పినరయి విజయన్ లేఖ రాశారని గుర్తుచేశారు. ఇదే రకంగా కేంద్రప్రభుత్వ నిర్ణయంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా పోరాడాలని సూచించారు. మత రాజ్యం కోసం బీజేపీ పాకులాడుతోం దని, మత రాజ్యమైన పాకిస్తాన్ బాగుపడిందా? అని ప్రశ్నించారు. 18వ శతాబ్ద ప్రారంభంలో దేశదేశాలు తిరుగుతూ జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించారని తెలిపారు. స్వార్థం, డబ్బు కోసం పనిచేసేవారు శాస్త్రవేత్తలు కారని, సమాజం పట్ల బాధ్యత గలవారు, త్యాగనిరతి, మనుషుల పట్ల ప్రేమ ఉన్నవారే నిజమైన శాస్త్రవేత్తలని చెప్పారు. పాఠ్యపుస్తకాల్లో మొఘల్ పాలకుల చరిత్ర తొలగింపు, గాంధీని హత్య చేసిన వ్యక్తిని గొప్పగా చిత్రీకరించడంతోపాటు 'విజ్ఞాన్ ప్రసార్'ను బీజేపీ మూసేసిందని తెలిపారు. దేశంలో వైజ్ఞాన సృహను పెంచడానికి రాజ్యాంగంలోని అర్టికల్ 51ఏహెచ్ విజ్ఞాన ప్రసార్‌ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అది నడుస్తున్నదని, ఇది విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యా యులకు విజ్ఞానాన్ని పెంచడానికి 300లకుపైగా మ్యాగజైన్లను అన్ని భాషల్లో ప్రచురించిందని తెలిపారు. షార్ట్ ఫిల్మ్‌లను రూపొందించి అవగాహన కల్పించే ఇండియా సైన్స్ టీవీ ఓటీటీని సైతం పక్కనపెట్టారని తెలిపారు. సైంటిఫిక్ టెంపర్‌ను పెంచిన ఘనత దేశ మొదటి ప్రధాని నెహ్రూకే దక్కుతుందని వివరించారు. 95శాతం పరిశోధన కేంద్రాలను ఆయనే ప్రారంభించారని తెలిపారు. మోడీ ప్రభుత్వం మాత్రం పరిశోధన సంస్థలకు నిధులు కేటాయించకుండా దివాళతీయిస్తున్నదని, పైగా కార్పొరేట్ సంస్థలతో నిధులు తీసుకుని పరిశోధనలు చేయాలని సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీహరి కోట నుంచి ఎన్నో రాకెట్లు పోతున్నాయని, శాటిలైట్ వల్లనే ఇంటర్నెట్నెట్, గూగుల్ మ్యాప్ చూడగల్గుతున్నామని దేవరాజు ఈ సందర్బంగా వివరించారు.
సైన్స్ వల్లనే జీవితం సుఖమయంగా ఉందని, ఎన్నో సౌకర్యాలు పొందుతున్నామని ఆయన చెప్పారు.