Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు కాలేజీలు నిబంధనలు పాటించాల్సిందే
- కళాశాలల్లో ఇంటర్ తరగతులనే బోధించాలి
- ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తప్పనిసరి
- పీజీలో 50 మార్కులున్నోళ్లనే అధ్యాపకులుగా నియమించాలి :ఇంటర్ బోర్డు మార్గదర్శకాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాల్సిన అవసరముందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. బోర్డు ప్రకటించిన నిబంధనలను ప్రయివేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు పాటించాలని ఆదేశించింది. కాలేజీల్లో ఇంటర్ తరగతులనే బోధించాలని తెలిపింది. కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపకుల వేధింపుల వల్ల సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో మార్చి ఆరో తేదీన హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో శ్రీచైతన్య, నారాయణతోపాటు పలు ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆత్మహత్యల నివారణకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మార్చి 17న ఆ కమిటీ సమావేశం జరిగింది. అందులో చర్చించిన అంశాల ఆధారంగా విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం మార్గదర్శకాలను విడుదల చేశారు. జూనియర్ కాలేజీల్లో ప్రతిరోజూ క్రీడలు, మానసిక ఉల్లాసం కలిగించే కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. పీజీలో 50 శాతం మార్కులున్నోళ్లనే అధ్యాపకులుగా సరిపోయినంత మందిని నియమించాలని తెలిపారు. విద్యాసంవత్సరం మధ్యలో వారిని తొలగించొద్దని పేర్కొన్నారు. ఒకవేళ తొలగించాల్సి వస్తే వారి స్థానంలో మరొకరిని వెంటనే నియమించాలని ఆదేశించారు. కాలేజీ ప్రిన్సిపాల్ మొబైల్ నెంబర్‌ను తప్పకుండా ప్రకటించాలని కోరారు. ఒకవేళ ప్రిన్సిపాల్ మారితే ఆ విషయాన్ని జిల్లా ఇంటర్ విద్యా అధికారి (డీఐఈవో)కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇతరులను కాలేజీల్లోకి అనుమతించొద్దని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు సమయమిచ్చి అనుమతించాలని సూచించారు. కాలేజీలో సీనియర్ అధ్యాపకున్ని కౌన్సిలర్‌గా నియమించాలని కోరారు. అదనపు తరగతులను మూడు గంటల కంటే అదనంగా తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు రెసిడెన్షియల్ విధానంలో ఉంటే విద్యార్థులకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్ర ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తీసుకోవడంతోపాటు తయారు కావడానికి గంటన్నర సమయం కేటాయించాలని తెలిపారు. సాయంత్రం గంటసేపు విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. మధ్యాహ్నం, రాత్రి భోజనానికి కనీసం 45 నిమిషాల సమయం కేటాయించాలని వివరించారు. విద్యార్థి ఎవరైనా కాలేజీ నుంచి వెళ్లిపోతే ఫీజు తిరిగి చెల్లించాలని ఆదేశించారు. మూడు నెలల్లోపు అయితే 75 శాతం, నాలుగు నుంచి ఆర్నెళ్లలోపు అయితే 50 శాతం, ఆర్నెళ్ల తర్వాత వెళ్తే 25 శాతం ఫీజును వారంరోజుల్లో చెల్లించాలని కోరారు. ఏడాదిలో రెండుసార్లు విద్యార్థులకు మెడికల్ చెకప్ చేయించాలని సూచించారు. అధ్యాపకులు టీచింగ్ డైరీని అమలు చేయాలని తెలిపారు. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
కొత్త సీసాలో పాత సారా : మధుసూదన్‌రెడ్డి
ఇంటర్ బోర్డు జారీ చేసిన మార్గదర్శకాలు కొత్త సీపాలో పాత సారాలాగా ఉందని ఇంటర్ విద్య జేఏసీ చైర్మెన్ పి మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టేందుకు, ఫీజులను నివారించేందుకు, నాణ్యమైన భోజనం అందించేందుకు ఎలాంటి చర్యలుంటాయో ప్రకటించలేదని తెలిపారు. బోర్డు నిబంధనలు పాటించకుంటే కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయో లేవని పేర్కొన్నారు.