Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీమా పత్రాలు, ఆర్సీలు, కంపెనీల లోగోలు స్వాధీనం
- 17 మంది అరెస్ట్ : ఎస్పీ
నవతెలంగాణ -ధరూర్
నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు, చలాన్లు తయారు చేస్తున్న 17 మందిని జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సృజన వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన మీసాల రామస్వామి ఆర్టీఏ ఏజెంట్. తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, రోడ్డు రవాణా కార్యాలయాల్లో ఉన్న లొసుగులు, పరిచయాలను అనుగుణంగా మలచుకొని లారీలు, పాఠశాలల బస్సులు, ఇతర ప్రయివేటు వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ తదితరాలకు సంబంధించి చలాన్లు, ఇన్సూరెన్స్ ప్రభుత్వానికి చెల్లించకుండా.. నకిలీ పత్రాలు సృష్టించి పనులు కానిస్తున్నాడు. తన పనిని నంద్యాల, వనపర్తి, జోగులాంగ గద్వాల, నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాలకు విస్తరించాడు. కొంతమంది ఆర్టీఏ ఏజెంట్లు, ఆటో ఫైనాన్స్ నిర్వాహకులు, డ్రైవర్లను తన ఏజెంట్లుగా నియమించకున్నాడు. వచ్చిన డబ్బుల్లో తాను సగం తీసుకుని మిగతాది ఏజెంట్లకు ఇచ్చేవాడు. దీనిపై గద్వాల జిల్లాలకు చెందిన కొందరు బాధితులు, ఇన్సూరెన్స్ కంపెనీల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రామస్వామిని అదుపులోకి తీసుకొని విచారణ జరపడంతో మొత్తం 17 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. మిగతావారిని గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి కారు, రెండు కలర్ ప్రింటర్స్, రెండు ల్యాప్టాప్స్, నకిలీ ఆర్సీలు, ఇన్సూరెన్స్ పత్రాలు, కంపెనీల లోగోలతో కూడిన డాక్యుమెంట్స్, 16 సెల్ఫోన్లను స్వాధీనం చేస్తున్నారు. ఈ ముఠాను అరెస్టు చేయడంలో ప్రధాన భూమిక పోషించిన గద్వాల డీఎస్పీ రంగస్వామి, అలంపూర్ సీఐ సూర్యనాయక్, ఎస్ఐలను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.