Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టారు
- బొగ్గు బ్లాక్‌ల వేలంతో వారి నిజస్వరూపం బట్టబయలు : సీపీఐ ప్రజాచైతన్య యాత్ర బహిరంగ సభలో కూనంనేని, చాడ
నవతెలంగాణ-గోదావరిఖని
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని గద్దె దించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ ప్రజా చైతన్య యాత్ర బుధవారం రాత్రి గోదావరిఖనికి చేరుకుంది. సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన జన సేవాదళ్ సభ్యులు, నగర సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు యాత్రకు ఘన స్వాగతం పలికి మున్సిపల్ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. బీజేపీకి హటావో.. దేశికి బచావో నినాదంతో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర 11వ రోజుకు చేరిందని, దీనికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. పేద మధ్య తరగతి, నిరుద్యోగులను మోసం చేస్తూ కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్యన చిచ్చుపెట్టిన బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వొద్దని ప్రజలకు సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను కూడా ప్రయివేటుపరం చేయాలని చాప కింద నీరులా కుట్రలకు పాల్పడుతున్నదన్నారు. మోడీ మతతత్వ ముసుగులో దేశంలోని సంపదను, పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ రామగుండం వచ్చినప్పుడు.. సింగరేణిని ప్రయివేటుపరం చేయబోమని చెప్పి.. నెల రోజుల్లోనే నాలుగు బొగ్గు బ్లాక్‌లను వేలం వేసి ఆయన నిజ స్వరూపం బయటపెట్టుకున్నారని విమర్శించారు. ఈ సభలో నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కలవేణి శంకర్, మర్రి వెంకటస్వామి, మంద పవన్, వెన్న సురేష్, గుంటి వేణు, గౌతం గోవర్ధన్, గోసిక మోహన్, కె.కనకరాజ్, మద్దెల దినేశ్, ఆరెల్లి పోశం, మడ్డి, ఎల్లా గౌడ్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వై.యాకయ్య తదితరులు పాల్గొన్నారు.