Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల నాయకుల నిరసన
- దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ- ముషీరాబాద్/విలేకరులు
మహిళారెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఏఐకేఎస్, ఏఐడబ్ల్యూయూ, ఐద్వా, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. బ్రీజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ.. అంతర్జాతీయంగా పతకాలు సాధించి గౌరవాన్ని ప్రతిష్టను తెచ్చిపెడుతున్న అగ్రశ్రేణి క్రీడాకారులు దేశం నడిబొడ్డున ఆందోళన చేపట్టడం బాధాకరమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం కేసు కూడా నమోదు చేయలేదన్నారు. రెజ్లర్ల ఆరోపణలపై విచారణ జరిపిన పర్యవేక్షణ కమిటీ ఫలితాలను బహిర్గతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్‌తోపాటు ఆ విభాగంలో పనిచేస్తున్న మరికొందరు కోచ్‌లపై చర్యలు తీసుకోవాలన్నారు. జె.వెంకటేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు భేటీ బచావో భేటి పడావో అంటూ సంబురాలు చేసుకుంటూనే మరోవైపు ఈ దారుణమైన నేరంలో నిందితుడైన బీజేపీ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితునిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అథ్లెట్లు వారి కలలను సాకారం చేసుకోవడానికి ఇలాంటి ఘటనలు అవరోధం కాకూడదంటే నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి.నర్సింహారావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీకాంత్, కార్యదర్శి ఈశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, పద్మ, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ నాయక్, సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షులు జయ కుమారస్వామి, కోశాధికారి ఆర్ వాణి, డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, సహాయ కార్యదర్శి మహమ్మద్ జావేద్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో డీవైఎఫ్ఐ, సీఐటీయూ, ఏఐఏడబ్ల్యు, ఏఐకేఎస్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ బ్రిజ్ బూషన్ శరణ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, పెద్దిసూరి, పల్లపు వెంకటేష్ మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు ప్రజాసంఘాల నాయకులు నిరసన తెలిపారు.