Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యంత్రాల రాకతో వృత్తిదారుల ఉపాధికి దెబ్బ
- నగరాలకు పెరిగిన వలసలు
- ప్రత్యేక రక్షణ చట్టం కోసం ఉద్యమం
- నవతెలంగాణతో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య
- ఉత్సవ విగ్రహాల్లా కార్పొరేషన్లు
- కుటుంబాలు చిన్నాభిన్నం
కాలం మారింది. యాంత్రిక జీవనం పరుగులు పెడుతోంది. కులవృత్తులు, చేతివృత్తులూ రోజురోజుకు అంతరిస్తున్నాయి. యంత్ర పరికరాలే పనులన్నింటినీ చేస్తున్నాయి. నిద్ర లేచిన దగ్గర్నుంచి.. పడుకునే వరకూ అన్ని పనులకూ స్విచ్ ఆన్.. స్విఛాఫ్.. 'అమ్మా చాకలిదాన్నొచ్చినా.. బట్టలెయ్యుండ్రీ.. పొద్దుపోయింది' అనే మాటలు చెవుల నుంచి దూరం కాకముందే.. ఇంట్లోకి వాషింగ్ మిషన్ వచ్చి చేరింది. దీంతో రజక వృత్తి బజారున పడింది. బతుకుదెరువు కోసం పిల్లాపాపలతో పట్నం బయలెల్లింది. అయితే పాశ్చాత్య సంస్కతి ఎగబాకి రజకులను నట్టేట ముంచింది. దానికి పాలకుల పాపం మరికొంత తోడైంది. ఫలితం.. చాకిరేవుల కనుమరుగయ్యాయి. ఉన్న కాస్త వృత్తిదారులపై గ్రామ పెత్తందార్లు దాష్టికానికి ఒడిగడుతున్నారు. వివక్షకు గురిచేస్తున్నారు. లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారు. వెరసి.. వృత్తిదారుల బతుకు దుర్భరంగా మారిందని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 29, 30 తేదీల్లో ఆ సంఘం రాష్ట్ర మూడో మహాసభలు జనగాంలో జరగనున్న నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి ఎస్ వెంకన్నకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యంశాలు..
రజక వృత్తిదారుల పరిస్థితి ఎలా ఉంది?
వారి పరిస్థితి దయనీయంగానే ఉంది. చేతివత్తిదారుల్లో ఒక్కో వత్తిదీ ఒక్కో దీనగాథ అయితే... రజకులది చెబితే ఒడవని వ్యథ...ఇది చాలా ప్రధానమైన వత్తి. సేవా వృత్తి. అందరికీ అవసరమైందైనప్పటికీ వీరి పట్ల వివక్ష కొనసాగుతున్నది. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రజకుల జనాభా 10లక్షలుగా ఉంది. వీరిలో 80శాతం మంది వృత్తిపై ఆధార పడి బతుకుతున్నారు. బట్టలు ఉతకటం, ఇస్త్రీ చేయటం ఒక్క మాటలో చెప్పాలంటే.. వీరు లేనిదే పల్లెల్లో సంప్రదాయమైన పనులు చాలా వరకు జరగవు. పెండ్లిండ్లు, చావుల వరకు వీరుండాల్సిందే. ఇప్పుడు ఈ కుల వృత్తి అంతరించిపోతున్నది. ప్రపంచీకరణ పల్లె జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నది. ఇస్తరాకుల తయారీ నుంచి బట్టలు ఉతికే వరకు యంత్రాలు ప్రవేశించి వృత్తుల చేతుల్ని విరిచేస్తున్నాయి. పల్లెచల్లగా ఉండాలంటే అక్కడ శ్రమించే వృత్తిదారుడు చేతినిండా పనితో సంతోషంగా ఉండాలి. ఇందులో చాకలి (రజక) వృత్తి ఒకటి. వీరు రోజంతా శ్రమిస్తున్నా కుటుంబాన్ని పో షించుకోవడంలో అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. వెట్టిచాకిరి తప్పడం లేదు. గ్రామకమిటీ నిర్ణయించిన ధర 'మాకు గిట్టదు' అన్న వారికి సాంఘిక భహిష్కరణ బహుమతిగా అందుతోంది. మహిళలపై లైంగిక దాడులతో పాటు రాష్ట్రంలో ఏదో ఒక మూల పెత్తందార్ల దాష్టీకానికి గురవుతూనే ఉన్నారు.
వలసలు పెరిగటానికి కారణాలేంటి?
వారి పని స్వభావం వల్లనో ఏమోగానీ..ఇప్పటికీ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికంగా జరగాల్సినంత అభివృద్ధి, చైతన్యం రజకుల్లో పెరగని మాట వాస్తవం. చదువుపై ప్రాముఖ్యత పెరగాల్సినంతగా పెరగలేదు. వృత్తికి ప్రాధాన్యత ఇవ్వటం మూలంగా డ్రాఫౌట్స్ నేటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఉన్న కాస్త భూమితో తగిన పైకం రాక..ఉపాధి హామీ పనులకు పోతున్నారు. ఇదిలా ఉంటే..ఈ మధ్యకాలంలో నగరాల్లో ఆపార్ట్మెంట్ కల్చర్ విపరీతంగా పెరిగింది. వృత్తిదారుల అవసరం కూడా ఆ మేరకు పెరిగింది. పల్లె నుంచే కాదు..పక్క రాష్ట్రాల నుంచి కూడా నగరాలకు వలసలొస్తున్నారు. అయినా వీరి ఆదాయం దారిద్య్రరేఖకు దిగువనే ఉంటున్నది.
వివక్ష ఇప్పటికీ కొనసాగుతున్నదా?
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ రజక వృత్తిదారులను కుల వివక్ష వెంటాడుతూనే ఉన్నది. దళితుల తర్వాత ఆ స్థాయిలో వివక్షను ఎదుర్కునేది వీరే. రూపాల్లో తేడాలున్నాయి అంతే.. అరే.. ఓరే.. సాకలోడా..అని పిలుస్తూ ఆత్మన్యూనతకు గురిచేస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. దేశం, రాష్ట్రం ఎంతో ముందుకు పోతున్నదని చెప్పుకుంటున్నప్పటికీ..పాత కాలం (ప్యూడల్) అవశేషాలను ఒడిసి పట్టుకుని, అదే తరహా వివక్షత పెత్తదాంర్ల నుంచి ఎదురవు తున్నది.ఏనిమిదేండ్ల కాలంలో రాష్ట్రంలో 17మంది హత్యకు గురయ్యారు. 70మందిపై దాడులు, సాంఘిక బహిష్కరణలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీలకు కొన్ని ప్రత్యేక రక్షణ చట్టాలున్నాయి. ఆ తరహా చట్టాలు రజకులకు లేకపోవటంతో పెత్తందార్లు ఎలాంటి జంకు లేకుండా వ్యవహరిస్తున్నారు. అందుకే అందుకే ప్రత్యేక సామాజిక భద్రత రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేస్తున్నాం.
వృత్తి ఆధునీకరణ కుదరదా?
ఆదునిక సమాజంలో వృత్తిని కూడా ఆదునీకరిం చాల్సిన అవసరం ఉంది. తద్వారా ఉపాధి మెరుగవుతుంది. పాలకులు ఆ వైపుగా తగిన నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని పలు మార్లు సంబంధిత అధికార్ల దృష్టికి రజక వృత్తిదారుల సంఘం తీసుకొచ్చింది. ఉద్యమాలు నిర్వహిం చింది. చేస్తాం..చూస్తామంటూ..ప్రభుత్వాలు తాత్సారం చేశాయి. ఈ మధ్యన్నే కాస్త కదిలిక వచ్చింది. మెకనైజ్డ్ దోబీఘాట్ల స్కీం వచ్చింది. తొమ్మిది పైలెట్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కార్యాచరణను ప్రభుత్వం రూపొందించింది. 141 మున్సిపాల్టీల్లో రూ.282 కోట్లతో ఆధునిక దోభీ ఘాట్లను ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ శాఖ ద్వారా కృషి జరుగుతున్నది. 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను 73వేల మంది వృత్తిదారులు వినియోగించుకుంటున్నారు.మరిన్ని మెరుగైన సౌకర్యాలు సాధించుకోవాల్సింది ఉంది.
కుల గణన చేస్తే..రజక వృత్తికి జరిగే ప్రయోజనం ఏంటి?
సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వెనకబాటు తో కొట్టుమిట్టాడుతున్న రజక వృత్తిదారుల పట్ల పాలకులు నిర్లక్ష్యం ఉన్న మాట వాస్తవం. కుల గణన చేపడితే..జనాభా ప్రాతిపదికన చట్టబద్దంగా వారికి రావాల్సిన నిధులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో తమ వాటా ఎంతో తేలిపోతుంది. ఇది అందరికీ వర్తించే అంశమే. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కుల గణనను తొక్కి పెడుతున్నది. ఓబీసీ వర్గీకరణ కోసం 2017లోనే కేంద్ర ప్రభుత్వం రోహిణీ కమిషన్‌ను వేసింది. ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించటం లేదు. బీసీలు, ఎంబీసీల పట్ల బీజేపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టే అర్థమవుతున్నది.
రాష్ట్రంలో రజక ఫెడరేషన్ పనిచేస్తున్నదా?
రజక ఫెఢరేషన్ రాష్ట్రంలో నిర్వీర్యంగా ఉంది. 1982 లోనే ఇది ఏర్పడింది. కానీ..దీనికి ఎప్పుడూ నిధులు కేటాయించలేదు. పేరుకే ఫెడరేషన్ తప్ప..వాస్తవానికి ఉత్సవ విగ్రహంగా మారింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా దాని స్థితిలో ఎలాంటి పురోగతి లేకపోవడం వృత్తిదారులను మరింత బాధకు గురిచేస్తున్నది.పాలక వర్గాన్ని నియమించలేదు. జీవో నెం 11 ప్రకారం రజక సంక్షేమ కమిటీలు వేయాలి. వాటిని నిరంతర ఫంక్ష నింగ్‌లో ఉంచాలి. కానీ.. ఆ ప్రక్రియ కొనసాగటం లేదు. మరో పక్క ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలను ఇప్పటి వరకు రివైజ్ చేయలేదు. దీంతో వృత్తిదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పాత జీవోలను జిల్లా అధికారులు పట్టించుకోవటం లేదు.కొత్త జీవోలను ప్రభుత్వం ఇవ్వటం లేదు.
మహాసభలో చర్చించనున్న ప్రధాన అంశాలేంటి?
మహాసభలో వృత్తిదారులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన అంశాలను చర్చిస్తాం. అందులో ముఖ్యంగా 'రజక వృత్తి దారులకు రూ.10లక్షల రుణం ఇవ్వాలి. 50సంవత్సరాలు నిండిన ప్రతి రజకునికి పెన్షన్ ఇవ్వాలి. రజకులపై జరిగే దాడులు, దౌర్జన్యాలు, లైంగిక దాడులు అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి. ఉచిత విద్యుత్ లబ్దిదారులం దరికీ రూ. 5లక్షలు బీమా సౌకర్యం కల్పించాలి. ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఆస్పత్రులు, పోలీసు శాఖ లు, విద్యాసంస్థల్లో రజక వృత్తిపనిని స్థానిక రజక వృత్తి దారులకు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీగణన చేపట్టాలి, జస్టిస్ రోహిణీ కమీషన్ సిఫారసులు అమలు చేయాలి.'తదితర అంశాలపై చర్చించి.. పలు తీర్మానాలు ఆమోదిస్తాం. చాకలి ఐలమ్మ ప్రాంగణంలో జరుగబోయే ఈ మహాసభలకు ప్రత్యేకత ఉంది. నాలుగేండ్ల కాలంలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చిన పోరాటాలు, సాధించిన విజయాలపై సమీక్ష నిర్వహించి... తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో భవిష్యత్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం.