Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 58,59 జీవోల ప్రకారం ఇండ్లస్థలాలపై తమ్మినేని
- దరఖాస్తు చేసుకున్నవారందరికీ పట్టాలు ఇవ్వాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవో నెంబర్ 58, 59ల ప్రకారం ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చే గడువును పొడిగించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ పట్టాలను మంజూరు చేయాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. పేదలకు ఇండ్లస్థలాల పట్టాలివ్వడానికి విడుదల చేసిన జీవో నెంబర్ 58, 59 గడువు ఈనెల 30వ తేదీతో ముగియనున్నట్టు ప్రభుత్వ ప్రకటనలు తెలియజేస్తున్నాయని వివరించారు. మిగులు భూములు, ప్రభుత్వ భూముల్లో 2020, జూన్ రెండో తేదీకి ముందు వాస్తవ అధీనంలో ఉన్న పేదలకు పట్టాలివ్వడానికి ఇచ్చిన గడువును పొడిగించాలని కోరారు. మీసేవా కేంద్రంలో దరఖాస్తుల కోసం ఇచ్చిన గడువులో, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ఆటంకం ఏర్పడింద ని పేర్కొన్నారు. ఇప్పటివరకు జీవో నెంబర్ 58 ప్రకారం గ్రామాల్లో 1.50 లక్షల మంది, జీవో నెంబర్ 59 ప్రకారం పట్టణాల్లో 42 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్టు ప్రకటించారని తెలిపారు. 125 గజాలలోపు ఉన్నవారు ఉచితంగా పట్టా పొందడానికి మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 126 నుంచి 250 గజాలున్నవారు రిజిస్ట్రేషన్ ధరలో 50 శాతం చెల్లించాలని తెలిపారు. 251 గజాల నుంచి 500 గజాల వరకు ఉన్నవారు 75 శాతం, 500 నుంచి వెయ్యి గజాలు స్వాధీనంలో ఉన్నవారు 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఇందుకు ఆధార్‌కార్డు గానీ, కరెంటు బిల్లుగానీ లేదా గ్రామపంచాయితీ/మున్సిపాల్టీకి చెల్లించిన రశీదులు జతపర్చాలని పేర్కొన్నారు. పై ఆధారాలేవీ లేని వారు వేలసంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో భౌతికంగా సర్వే నిర్వహించి 2020 జూన్ రెండో తేదీకి ముందు స్వాధీనంలో ఉన్న పేదలకు వారి స్థితిని బట్టి పట్టాలను మంజూరు చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాలు లేకపోవడం, ఉన్నా సరిగా పనిచేయకపోవడంతో చాలామంది వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నా రు.ఆన్లైన్లో నింపడం రాక కూడా దరఖాస్తులు చేసుకోలేదని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం,మంచిర్యాల,పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో ప్రధానంగా దళితులు,గిరిజనులు,వెనకబడిన తరగతుల పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్లు, సిబ్బంది స్వయంగా సర్వే చేసి, ప్రభుత్వ భూమిలో లేదా మిగులుభూముల్లో 125 చదరపు గజాల స్థలంలో ఇండ్లు నిర్మాణం చేసుకున్నవారి నుంచి దరఖాస్తులు తీసుకోవా లని సూచించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా తహశీల్ కార్యాలయాలకు బాధ్యత పెట్టడం ద్వారా ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని తమ్మినేని తెలిపారు. అందుకనుగుణంగా ఆయా జీవోల గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.