Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ పరిసరాల్లో నేలకొరుగుతున్న ఈత, తాటి వృక్షాలు
- అనుమతులు లేకుండా వేల కొద్ది చెట్లు నరికివేత
- పేరుకే సొసైటీలు.. ఉపాధి కోల్పోతున్న గీత కార్మికులు
- జిల్లాలోనూ నీరా పరిశ్రమల ఏర్పాటుకు డిమాండ్
(కామంచికల్ నుంచి కె.శ్రీనివాసరెడ్డి)
కామంచికల్.. అమ్మపాలెం.. తనికెళ్ల.. వెంకటగిరి.. గుర్రాలపాడు.. ఇలా తాటి, ఈత చెట్లు ఒక ఊరు తర్వాత మరో ఊరు.. వందలు, వేలకొద్ది వృక్షాలను స్థిరాస్తి వ్యాపారం కోసం ఇష్టానుసారంగా నేలకూల్చుతున్నారు. పట్టణాలకు సమీపంలో కొద్దోగొప్పో గీత వృత్తిదారునికి ఉపాధి లభిస్తుంటే.. అక్కడే చెట్లను నరికివేస్తుండటంతో కల్లుగీత కార్మికుల ఆవేదన వర్ణణాతీతం. సొసైటీ సభ్యుడన్న పేరేగానీ ఎటువంటి ఆదరువు లేకపోవడంతో ఊళ్లు విడిచి.. ప్రత్యామ్నాయ వృత్తుల వైపు గీతన్నలు మల్లుతున్నారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పొట్ట పోసుకుంటున్నారు. కేరళ, తమిళనాడు తరహాలో గీత సొసైటీలను పటిష్టం చేసి, రుణ, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వృత్తిదారున్ని ప్రోత్సహించాలని వేడుకుంటున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా పరిశ్రమల ఏర్పాటుకు సుమారు రెండేండ్ల కిందట ప్రభుత్వం మాట ఇచ్చినా.. హైదరా బాద్‌లో రెండు పరిశ్రమలు మాత్రమే ఏర్పాటయ్యాయి. మిగతా చోట్ల ఎక్కడా లేవు. కాగా, సొసైటీలో సభ్యునిగా నమోదయిన కల్లుగీత కార్మికులకు.. చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి నప్పుడు.. శాశ్వత వైకల్యం బారిన పడినా, ప్రాణాలు పోయినా.. ఇచ్చే రూ.5 లక్షల పరిహారం తప్ప గీత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు. ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస ్గౌడ్ శనివారం ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో తమ గోడు వెళ్లబోసుకునేందుకు పలువురు గీత కార్మికులు సిద్ధమవుతున్నారు.
'రియల్' జోరులో 'గీత' వెతలు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం, వైరా, పాల్వంచ, ఇల్లెందు పరిసర ప్రాంతాల్లో రియల్ వెంచర్లు వెలుస్తున్నాయి. నగర, పట్టణాలకు ఎటుచూసినా పది కి.మీ పైగానే వ్యవసాయ భూములు వెంచర్లుగా వెలిశాయి. ఖమ్మం రూరల్, అర్బన్, రఘునాథపాలెం, కామేపల్లి, చింతకాని, కొణిజర్ల, ముదిగొండ, నేలకొండపల్లి, కూసు మంచి, తిరుమలాయ పాలెం మండ లాల్లో ఓవైపు 'రియల్' జోరు కొనసాగు తుంటే.. మరోవైపు జాతీయ ప్రాజెక్టులైన రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, రైల్వేలైన్ లతో పాటు భారీ విద్యుత్ టవర్లు కూడా వ్యవసాయ భూముల నుంచే పోతున్నాయి. ఈ భూముల్లోని తాటి, ఈత చెట్లను ఎలాంటి అనుమతి లేకుండానే పెకిలించి వేస్తున్నారు. కొందరు కొన్ని చెట్లకు మాత్రమే అనుమతి తీసుకుని అదనంగా వృక్షాలను కొడుతున్నారు. ఎక్సైజ్ చట్టంలోని రూల్ 27 ప్రకారం తాటి, ఈత చెట్లను కొట్టాలంటే కలెక్టర్ అనుమతి తప్పనిసరి. లేనిపక్షంలో నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేయవచ్చు. కానీ అది అమలవుతున్న దాఖలాలు లేవు. రఘునాథపాలెం మండలం కామంచికల్‌లో కొన్ని రోజుల కిందట ఓ వెంచర్ కోసం ఏడెకరాల భూమి వరకు చదును చేశారు. దీని పరిధిలో పదుల సంఖ్యలో తాటి చెట్లను తొలగించేందుకు సిద్ధమయ్యారు. దాంతో గ్రామంలోని గీత కార్మికులు ఆందోళన నిర్వహించి, రోజుల తరబడి ధర్నాలు చేసినా చివరికి 'రియల్ వ్యాపారి'దే పైచేయి అయింది.
నూతన కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న అమ్మపాలెంలో 32 చెట్లకు పర్మిషన్ తీసుకుని 35 చెట్లను కొట్టారు. దీని విషయంలో గ్రామంలో గొడవలు జరుగుతున్నాయి.
ఇలానే వదిలేస్తే తాటి, ఈత చెట్లనేవే లేకుండా పోయి గీత వృత్తి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి అనేకం నిత్యం చోటు చేసుకుంటుండటంతో భవిష్యత్‌పై గీత వృత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బతుకులు వట్టిపోతున్నాయి..
ఒకప్పుడు గ్రామంలో 600 చెట్లుండేవి. ఇప్పుడు 250కి వచ్చాయి. వీటిలో 150 చెట్లను మాత్రమే 30 మంది గీస్తున్నాం. వెంచర్లు, కరెంట్ తీగలు, రోడ్ల కింద చెట్లన్నీ తీసేస్తుండటంతో చేసేది లేక వేరే పనులు వెతుక్కుంటున్నాం. ఖమ్మానికి ఇంత దగ్గరున్నం దుకు లాభమే ఉంటది కానీ ప్రోత్సాహం లేదు.
- అనంతు లక్ష్మీనారాయణ,
గౌడసంఘం మాజీ అధ్యక్షుడు, కామంచికల్
'గీత' సంక్షేమం.. నామమాత్రం...
ఖమ్మం జిల్లాలో 206 గీత సొసైటీలు, 15,600 మంది సభ్యులున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో 14 సొసైటీల్లో 157 మంది సభ్యులున్నారు. అయితే 1998-99 హైకోర్టు తీర్పు ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో సొసైటీలను రద్దు చేశారు. దీనికి ముందు ఈ జిల్లాలో 240 సొసైటీలుండేవి. రాష్ట్రంలో చాలాచోట్ల గీత సొసైటీల పరిస్థితి ఇలాగే ఉందన్న విమర్శలు ఉన్నాయి. రియల్ వెంచర్లతో వృత్తి కనుమరుగై.. కల్తీ కల్లు పెరిగిపోతుంది. ఈ సొసైటీల పటిష్టత, వృత్తి పరిరక్షణ, వృత్తిదారుల సంక్షేమం, చెట్లు కొడితే చర్యలు.. ఇవన్నీ నామమాత్రంగానే అమలవుతున్నాయని గీత వృత్తిదారుల ఆరోపణ. ఖమ్మం జిల్లాలో 200కు పైగా ఉంటే కేవలం 8 సొసైటీలకే బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలందాయి. ప్రాజెక్టుల కింద చెట్లు పోతే ఈతకు రూ.1020, తాటికి రూ.1968 చొప్పున కట్టిస్తున్నారు. కానీ పట్టా భూమైతే యజమానికి దీనిలో సగం ఇచ్చేయాలి. గతంలో ఉన్న పన్నును తొలగించడం, 50 ఏండ్లు నిండితే పెన్షన్ సౌకర్యం, ప్రమాదం బారిన పడితే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, అది కూడా తాత్కాలిక వైకల్యమైతే రూ.10వేలు మాత్రమే పరిహారం.. ఇలా ఒకటి రెండు మినహా గీత వృత్తికి రక్షణ లేకుండా పోయిందని వృత్తిదారులు వాపోతున్నారు.