Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేయూత నివ్వని మోడీ సర్కార్
- కేంద్ర ప్రోత్సాహాకాల్లో నిరాశ
- భారీగా ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్లు రద్దు
కార్పొరేట్లు కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పరారవుతున్నా మోడీ ప్రభుత్వంలో చలనం కనిపించటంలేదు. మేడిన్ ఇండియా,మేకిన్ ఇండియా ఇలా పేర్లు మారుస్తూ కాలాన్ని దాటేస్తోంది. సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు మాత్రం కేంద్రం చేయూత నివ్వటంలేదు. కరోనాకు ముందే కాదు.. కరోనా తర్వాత కూడా చిన్నపరిశ్రమలు మరింతగా చితికిపోతున్నాయి. ఎంతో మేథోశక్తి ఉండి కూడా తమ సంస్థలను నడుపుకోలేక మూసివేసుకోవాల్సిన దుస్థితి. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రోత్సాహాకాల విషయంలో అదిగో..ఇదిగో అంటూ మభ్యపెడుతోంది. యువపారిశ్రామిక వేత్తల్ని నిరాశ పరుస్తోంది. దీంతో.సుమారు 70వేలకు పైనే ఎంఎస్ఎంఈలు రద్దు చేసుకున్నాయి.
హైదరాబాద్ : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. చిన్న పరిశ్రమలను పెద్ద మనస్సుతో చూస్తున్నామని.. భారీగా ప్రోత్సాహకాలు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగులుతోన్నాయి. వెంటాడుతోన్న మందగమనం భయాందోళనలు, ఆర్థిక ఇబ్బందులకు తోడు ప్రభుత్వ ప్రోత్సాహకాలు నిరాశజనకంగా ఉండటంతో వేలాది సంస్థలు మూత పడుతున్నాయి. దేశంలో 6.3 కోట్లకు పైగా మంది ఎంఎస్ఎంఈలపై ఆధారపడి జీవిస్తున్నారు. జీడీపీలో ఈ రంగం దాదాపు 33 శాతం మద్దతును అందిస్తోంది. దేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 23 శాతం మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఇంత ప్రాధాన్యత కలిగిన ఎంఎస్ఎంఈలకు చేయూత నివ్వకుండా కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపిస్తోందని పలు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్, ఆర్థిక మద్దతును అందించడానికి వీలుగా కేంద్రం 2020 జులైలో ఉద్యమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), వస్తు సేవల పన్ను నెట్వర్క్ (జీఎస్టీఎన్)తోనూ అనుసంధానమై ఉంటుంది. ఉద్యమ్ పోర్టల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేశంలో దాదాపు 73,576 ఎంఎస్ఎంఈలు తమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకున్నాయి. ఈ విషయాన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ ఇటీవల స్వయంగా రాజ్యసభకు లిఖితపూర్వంగా తెలిపారు.
మంత్రి ఇచ్చిన వివరాల ప్రకారం.. మొత్తం 1,57,89,528 ఎంఎస్ఎంఈలు పోర్టల్‌లో నమోదయ్యాయి. ఇందులో దాదాపు 1,52,18,776 యూనిట్లు సూక్ష్మ, 4,60,858 చిన్న, 41,078 మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో రిజిస్ట్రర్ అయిన ఆయా సంస్థలు కోట్లాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఎక్కువగా తయారీ, సేవా రంగాల్లోని సంస్థలు ఉన్నాయి. ఇవి మూలధన లభ్యత సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
ఎంఎస్ఎంఈలు అధికంగా రద్దు, ఉపసంహరించుకున్న వాటిలో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. ఆ రాష్ట్రం నుంచి 17,574, తమిళనాడు 6,570, ఉత్తరప్రదేశ్ 6,265, గుజరాత్ 6,115, రాజస్థాన్ 5,260 చొప్పున లైసెన్స్‌లు రద్దు అయ్యాయి. ఎంఎస్ఎంఈలు పెద్ద సంస్థల డిమాండ్లను తీర్చడానికి నిరాకరిస్తే వాటితో కలిసి పనిచేయమని బెదిరిస్తున్న దాఖలాలు ఉన్నాయి. 2022-23 బడ్జెట్లో మోడీ సర్కార్ ఎంఎస్ఎంఈ రంగానికి దాదాపు రూ.22,140 కోట్ల కేటాయింపులు చేసింది. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే 42 శాతం అదనం అయినప్పటికీ.. వాటిని వ్యయం చేయడంలో, మద్దతును అందించడంలో విఫలం అయ్యిందనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉన్న ఎంఎస్ఎంఈలకు మద్దతును ఇవ్వడం ద్వారా దేశ వృద్థికి దోహదం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నప్పటికీ.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం గమనార్హం.
తొక్కేస్తున్న కార్పొరేట్ సంస్థలు
ఉద్యమ్ పోర్టల్ నుంచి రిజిస్ట్రేషన్ల ఉపసంహరణలు ఆందోళన కలిగించే అంశమని భారత ఎంఎస్ఎంఈ ఫోరమ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలు చిన్న సంస్థలను తొక్కేస్తున్నాయని, ప్రమాదపుటంచునకు నెట్టివేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాలసీలు పెద్ద కంపెనీలకే అనుకూలంగా ఉన్నాయన్నారు. యూనిట్లు, యాజమాన్యంలో మార్పునకు తోడు ప్రభుత్వం నుంచి పెద్ద ప్రయోజనాలు లేకపోవడంతో అనేక సంస్థలు తమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకుంటున్నాయని ప్రైమస్ పార్ట్నర్స్ కో-ఫౌండర్ కనిష్క్ మహేశ్వరి పేర్కొన్నారు. సమస్యలను గుర్తించి ఈ రంగాన్ని అభివృద్థి చేయడానికి నిర్థిష్ట జోక్యం చాలా అవసరమన్నారు.