Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువకుల బలిదానాలకు విలువ లేదు
- ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఇప్పటికే తనపై132 కేసులు :
నిరుద్యోగ నిరసన సభలో టీపీసీసీి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ - నల్లగొండ
ఎన్నికల ముందు ఇచ్చిన నోటిఫికేషన్‌తో కొంత మందికైనా ఉద్యోగాలు వస్తాయని భావిస్తే.. ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల భవిత ప్రశ్నార్థకమైందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అమరులైన వేల మంది యువకుల బలిదానాలకు కేసీఆర్ ప్రభుత్వంలో విలువ లేకుండా పోయిందన్నారు. యువత ఆశలన్నీ అడియాశలయ్యాయన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్లో నిరుద్యోగ నిరసన సభ నిర్వహించారు. అంతకుముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులను కలిశారు. అనంతరం మర్రిగూడ బైపాస్ నుంచి వేలాది కార్యకర్తల నడుమ గడియారం సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. గడియారం వద్ద ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకయ్యాయని ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికీ 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని ఏడాదిలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెబితే నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. ఆ తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు బిశ్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పారు. పదో తరగతి, టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పోరాటంతో ఎట్టకేలకు లీకేజీ వ్యవహారంపై విచారణ చేపట్టిందని తెలిపారు. దొంగతనం చేసినోళ్లను పట్టుకోవాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా నని తనకు నోటీసులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిం చినందుకు ఇప్పటికే తనపై 132 కేసులు పెట్టారని.. అయినా తలవంచనని స్పష్టంచేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు చదువుకున్న నిరుద్యోగ యువకుల వయస్సు 25 ఏండ్లు అని ఇప్పుడు వారి వయస్సు 35 దాటిందన్నారు. వారిలో చాలా మందికి ఇప్పటివరకు ఉద్యోగాలు లేకపోవడంతో వివాహం చేసుకోలేకపోయారని చెప్పారు. నలగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హామీ ఇచ్చిన మేరకు తెలంగాణలోని 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక్కొక్కరికి రూ.1.60 లక్షల నిరుద్యోగ భృతి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలను భద్రంగా ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పదో తరగతి పేపర్ లీక్ చేశారనే ఆరోపణతో అరెస్టయి జైలుకు పంపబడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు మరుసటి రోజే బయటకు వచ్చారని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ సభ్యులను మాత్రం వారం రోజులపాటు జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీకి చాలా విషయాల్లో స్నేహపూర్వక అవగాహన ఉందనే విషయం బట్టబయలైందన్నారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం నుంచి కేటీఆర్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును నియమించాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు కాంగ్రెస్ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు. ముస్లిం రిజర్వేషన్ కోటాను 12 శాతానికి పెంచుతామని బీఆర్ఎస్ హామీ ఇచ్చి నేటికీ చేయలేదని విమర్శించారు. మరోవైపు బీజేపీ ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని చెబుతుందన్నారు. ముస్లింలు ఎటువైపు ఉండాలో నిర్ణయించుకోవాలని కోరారు.
మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ప్రజలు, విద్యార్థులు, యువత వచ్చే ఎన్నికల్లో 12కి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే.. రాష్ట్రంలో 90 సీట్లను గెలుచుకోవచ్చని అన్నారు. ఈ సభలో మాజీ మంత్రి పుష్పలీల, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బొలుగురి వెంకటేష్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, చెవిటి వెంకన్న, అనిల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జీలు తదితరులు పాల్గొన్నారు.