Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదంలో భారత రాజ్యాంగం
- రిజర్వేషన్లకు బీజేపీ ఎసరు
- ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు
- ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీ
- ఫూలే, అంబేద్కర్ జన జాతరల సందర్భంగా నవతెలంగాణతో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్వెస్లీ
'ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో దేశాన్ని పాలిస్తున్న బీజేపీ...బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకొచ్చేం దుకు పన్నాగాలు పన్నుతున్నది. కానీ, ఆ మనుధర్మ శాస్త్రంలో శూద్రుల స్థానమెక్కడుందో బీజేపీ పెద్దలు చెప్పగలరా..? ఆ విషయాన్ని సూటిగా చెప్పటానికి వారు జంకుతున్నారు. ఓట్లకు విఘాతం వాటిల్లకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. డబులింజన్ సర్కార్లు ఇప్పటికే ఆ విధానాలను అమలు చేస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరగతులపై నిత్యం దాడులు, అత్యాచారాలు, అఘాయి త్యాలు, లైంగిక వేధింపులు, గృహదహనాలు కొనసాగుతూనే ఉన్నాయి. పురాతన కాలంనాటి ఆచారాలు, అలవాట్లు ఆధునిక కాలంలోనూ ఆచరించా లంటూ బీజేపీ నేతలు, మతోన్మాదులు ఉద్భోది స్తున్నారు. ప్రజలపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫూలే, అంబేద్కర్ జయంతుల సందర్భంగా 'మనువాదాన్ని మట్టు బెడదాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందా' మంటూ ఈనెల 15 నుంచి 30 వరకు సామాజిక సంఘాల ఆధ్వర్యంలో జన జాతరలను నిర్వహి స్తున్నారు. ఈ సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి ఎస్ వెంకన్నకు కేవీపీఎస్ అధ్యక్షులు జాన్వెస్లీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యంశాలు..
జనజాతర్ల ఉద్దేశం ఏంటి?
మనువాద విధానాలతో సామాజిక న్యాయాన్ని సమాధి చేసేందుకు బీజేపీ పాలకులు ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగ హక్కులను వారు కాలరాస్తున్నారు. మహానుభావులు ఫూలే, అంబేద్కర్ పోరాట స్ఫూర్తికి భిన్నంగా మోడీ సర్కార్ తన విధానాలను అమలు చేస్తున్న నేపథ్యంలో కేవీపీఎస్, గిరిజన సంఘం, వృత్తి సంఘాలు, ఆవాజ్ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 30 వరకు జన జాతరలు నిర్వహించా లని నిర్ణయించాం. మనువాద విధానాలను ఎండగట్టడమే ఈ జాతరల ఉద్దేశం. రాజ్యాంగ విలువలను నిర్వీర్యం చేసి, దాని స్థానంలో మనుస్మృతిని ప్రవేశపెట్టేందుకు బీజేపీ సర్కార్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టటమే మా ప్రధాన లక్ష్యం. బడుగు బలహీన వర్గాల హక్కులకు సమాధి కట్టేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ పన్నాగాలను ప్రజల్లోకి తీసుకుపోవటమే ముఖ్యమైన కర్తవ్యం. బీసీ కుల గణను చేపట్టకుండా కేంద్రం కాలయాపన చేస్తున్నది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మహిళలపై 300 శాతం మేర దాడులు, దౌర్జన్యాలు, లైంగికదాడులు పెరిగాయి. మరో పక్క మోడీ సర్కార్ పేదలపై విపరీతమైన భారాలు మోపుతున్నది. జన జాతరల ద్వారా వీటన్నింటినీ ప్రజలకు విడమరిచి చెపుతున్నాం.
మనువాదం దేశానికి ప్రమాదమా?
నూటికి నూరుపాళ్లు సమాజానికి అది మహా ప్రమాదమే. ప్రతి ఒక్కరూ మార్పును కోరుకుంటారు. అది సమాజ పురోగమనానికి ఉపయోగ పడాలి. బీజేపీ మాత్రం మనుధర్మం ద్వారా చాతుర్వర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తూ కుల ధర్మాన్ని యధాతథంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వద్దనీ, మనుధర్మమే ఉండాలని ఆర్ఎస్ఎస్ ముఖ్యులు హేడ్గేవార్, గోల్వాల్కర్ చెప్పిన విషయాన్ని ఆ పార్టీ తూ.చా.తప్పకుండా అమలు చేస్తున్నది. అంతకు ముందు సావర్కర్ చెప్పింది కూడా అదే. వారి అజెండానే నేడు బీజేపీ ముందుకు తీసుకెళ్తున్నది. కులాన్ని బట్టి చదువులు, ఆస్తులు, శిక్షలు ఉండాలన్నదే మనుధర్మం ఉద్దేశం. ఇలా చేయడమంటే దేశాన్ని మళ్లీ వెనక్కి తీసుకుపోవడమే కదా! ఎన్ని మతాలున్నా, ఎన్ని వైరుధ్యాలున్నా ప్రజలందరూ ఐక్యంగా జీవిస్తున్న దేశంలో మతచిచ్చు పెట్టి లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది.
బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేస్తున్నదనే
ప్రచారంలో నిజముందా?
దేశంలోని కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ గద్దలు, ప్రయివేటు వారికి కట్టబెట్టటం ద్వారా మన ఆర్థిక సారభౌమత్వాన్ని మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తున్నది. ప్రభుత్వ రంగాన్నంతా అమ్మేశాక ఇక రిజర్వేషన్లను ఎక్కడ అమలు చేస్తారు..? ఇది ఒక పెద్ద కుట్ర.
మరో పక్క రాష్ట్రాల హక్కులను హరించటం ద్వారా బీజేపీ సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నది. సామాజిక న్యాయం విషయంలోనూ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. దేశంలో రోజురోజుకీ మహిళలపై, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి.వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. జన జాతర్ల సందర్భంగా ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అవసరాన్ని గుర్తింపజేస్తున్నాం.