Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కుటుంబ సంక్షేమ నిధి' పథకానికి శ్రీకారం
- మే 2న నల్లగొండలో ప్రారంభుం
- జులై 1 నుంచి చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ కుటుంబాలకు భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ముందుకొస్తున్నది. అర్థాంతరంగా మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించి సాంత్వన కలిగించనుంది. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సంక్షేమ నిధి (ఎఫ్‌డబ్ల్యూఎఫ్) అనే వినూత్న పథకానికి టీఎస్‌యూటీఎఫ్ శ్రీకారం చుట్టనుంది. నల్లగొండ జిల్లా టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయం కేంద్రంగా ఆ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ నిధిని వచ్చేనెల రెండో తేదీన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అదేరోజు ఉదయం పది గంటలకు టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో ఎఫ్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. అదేరోజు 'నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్-2023 జాతీయ సమైక్యతకు తోడ్పడుతుందా?'అనే అంశంపై దాచూరి రామిరెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా స్మారకోపన్యాసానికి ప్రధాన వక్తగా మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త వి బాలసుబ్రహ్మణ్యం హాజరవుతారు. టీఎస్‌యూటీఎఫ్ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాలకు హాజరు కావాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 'ఒక్కరి కోసం అందరూ...అందరి కోసం ప్రతి ఒక్కరూ' అనే నినాదంతో పరస్పర సంఘీభావం ప్రాతిపదికన జూన్ 30 వరకు ఈ పథకంలో చేరేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వివరించారు. జులై ఒకటో తేదీ తర్వాత మరణించిన టీఎస్‌యూటీఎఫ్ సభ్యుల కుటుంబాలకు పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. కనీసం ఐదువేల మందిని సభ్యులుగా చేర్పించి, ప్రతి ఒక్కరి నుంచి రూ.100 చొప్పున సంఘీభావ విరాళం వసూలు చేస్తామని తెలిపారు. మరణించిన సభ్యుని కుటుంబానికి రూ.15 రోజుల్లోగా రూ.ఐదు లక్షలు అందించాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని వివరించారు.
ఎఫ్‌డబ్ల్యూఎఫ్ చైర్మెన్‌గా చావ రవి
ఎఫ్‌డబ్ల్యూఎఫ్ పథకం నిర్వహణ కోసం జనరల్ కౌన్సిల్, కార్యవర్గం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అనే మూడు దొంతరల్లో పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. సభ్యత్వాలు పూర్తై, ఎన్నికలు జరిగి పూర్తి స్థాయి పాలకవర్గం ఏర్పడే వరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీనే ఎఫ్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యవర్గంగా, రాష్ట్ర ఆఫీసు బేరర్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. ఈనెల తొమ్మిదో తేదీన నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎఫ్‌డబ్ల్యూఎఫ్ ఆఫీసు బేరర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎఫ్‌డబ్ల్యూఎఫ్ చైర్మెన్‌గా చావ రవి, వైస్ చైర్మెన్‌గా కె జంగయ్య, కార్యదర్శిగా ఎం రాజశేఖర్‌రెడ్డి, సహాయ కార్యదర్శిగా టి లక్ష్మారెడ్డి, కోశాధికారిగా జి నాగమణి ఎన్నికయ్యారు. ప్రతి రెండేండ్లకు ఒకసారి టీఎస్‌యూటీఎఫ్ జిల్లా, రాష్ట్ర మహాసభలు జరిగే సందర్భంలోనే ఎఫ్‌డబ్ల్యూఎఫ్ పాలక వర్గానికి కూడా ఎన్నికలను నిర్వహిస్తారు. ఎఫ్‌డబ్ల్యూఎఫ్ పథకంలో సభ్యులుగా చేరేందుకు పలు నియమ నిబంధనలను పొందుపరిచారు. టీఎస్యూటీఎఫ్లో సభ్యులుగా ఉండి ప్రభుత్వ, ప్రభుత్వ ద్రవ్య సహాయంతో నిర్వహించబడుతున్న విద్యాసంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్, ఫుల్ టైం కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఈ పథకంలో సభ్యులుగా చేరొచ్చు. వారు తప్పనిసరిగా వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ మాసపత్రిక చందాదారులై ఉండాలని, ఒకవేళ లేకుంటే రూ.200 చెల్లించి వెంటనే చందాదారులుగా కావాలని నిబంధనల్లో పొందుపరిచారు. ఈ పథకంలో చేరినపుడు సభ్యత్వం రూ.200, కాషన్ డిపాజిట్ రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాషన్ డిపాజిట్ రిటైర్ అయినపుడు లేదా ఉద్యోగం కోల్పోయినపుడు వడ్డీతో కలిపి తిరిగి చెల్లించబడుతుంది.