Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది ఇదే రోజున కేవలం 1.90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే
- రెండున్నర రెట్లు అధికంగా ఈ యాసంగిలో కొనుగోళ్లు
- రోజుకు 90 వేల మెట్రిక్ టన్నులకుపైగా...
- 100 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అనుగుణంగా
- టార్పాలిన్లు, ప్యాడీక్లీనర్లు ఇతరత్రా మౌలిక సధుపాయాలు: మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాసంగి ధాన్యం కొనుగోళ్లు గతేడాది ఇదే సమయానికన్నా రెట్టింపును మించి ప్రస్తుతం కొనసాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న రైతన్నలకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఆయన దిశానిర్దేశం చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్, పౌరసరఫరాల సంస్థ జీఎం రాజారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేందుకు వీలుగా 7,142 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామనీ, ఇప్పటికే వీటిలో 4 వేలకు పైగా కేంద్రాలను ప్రారంభించి. గతేడాది సేకరించిన 1.90 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా రెండున్నర రెట్లు అధికంగా (5.16 లక్షల మెట్రిక్ టన్నులు) ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ఆ రకంగా ప్రతి రోజు 90 వేల మెట్రిక్ టన్నులకుపైగా సేకరిస్తున్నట్టు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షాల నుంచి రక్షణ కోసం 100 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సరిపడా 1,45,163 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయనీ, ప్యాడీ క్లీనర్లు 6,055, వెయింగ్ మిషన్లు 12,671, ఇతరత్రా మౌలిక సదుపాయాలను సైతం కల్పించామని వివరించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు రాజకీయాలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలుకు సానుకూలంగా నిర్ణయం వచ్చేలా చూడాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరించాల్సి ఉంటుందని చెప్పారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం విషయంలో కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వమే రైతులను ఆదుకుంటున్నదని తెలిపారు. వీటిని రైతులు ఆరబోసి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చని సూచించారు.