Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేయాలంటూ సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ దర్యాప్తు ఆలస్యంగా ఆలస్యంగా కొనసాగుతున్నదని తెలిపింది. అయితే, దర్యాప్తు మాత్రం సంతృప్తికరంగానే ఉందని పేర్కొన్నది. లీకేజీ కేసును సీబీఐకి ఇవ్వాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర్ర అధ్యక్షుడు బి.వెంకట్ దాఖలు చేసిన రిట్‌ను జస్టిస్ విజరుసేన్‌రెడ్డి శుక్రవారం విచారించారు. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఆయన తేల్చిచెప్పారు. తదుపరి విచారణను జూన్ 5కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటిలోగా సిటీ పోలీస్ కమిషనర్ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఆటోడ్రైవర్ మతి కేసులో నోటీసులు
హైదరాబాద్ నగరంలోని తుకారాంగేట్ పీఎస్‌లో ఈ నెల 25న చిరంజీవి అనే 32 ఏండ్ల ఆటోడ్రైవర్ అనుమానాస్పదంగా మృతిచెందిన కేసులో హౌం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నగర పోలీస్ కమిషనర్, నార్త్ జోన్ డీసీపీ, గోపాలపురం ఏసీపీ, తుకారాంగేట్ ఎస్హెచ్ఓలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చిరంజీవి మృతిపై పత్రికల్లో వచ్చిన వార్తను న్యాయస్థానం సుమోటో స్వీకరించి శుక్రవారం విచారించింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ విచారణను చేపట్టింది.
హైకోర్టుకు సెలవులు
రాష్ట్ర హైకోర్టుకు వేసవి సెలవులను శుక్రవారం ప్రకటించారు. జూన్ 2 వరకు ఆ సెలవులు కొనసాగనున్నాయి. ప్రారంభంలో శని, ఆదివారాలు, ముంగింపులో శని, ఆదివారాలు కలిపితే ఈ నెల 29 నుంచి జూన్ 4 వరకు సెలువులు ఉంటాయి. ఈ కాలంలో ప్రతి మంగళవారం అత్యవసర కేసుల నమోదుకు రిజిస్ట్రీ అనుమతినిచ్చింది. వాటిని ప్రతి గురువారం హైకోర్టు వెకేషన్ కోర్టులు విచారిస్తాయి. మే 4, 11, 18, 25, జూన్ 1 తేదీల్లో ప్రత్యేక కోర్టులు అత్యవసర కేసుల్ని విచారిస్తాయి.
కోర్టు ధిక్కార నోటీసులు
కోర్టు ధిక్కార కేసులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, సెక్రటరీ విజయానంద్ తదితరులకు హైకోర్టు నోటీసులిచ్చింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలియజేయాలని వారిని ఆదేశించింది. విచారణను జూన్ 23కి వాయిదా వేస్తూ జస్టిస్ టి.వినోద్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.