Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం రోజులపాటు మేడే ఉత్సవాలు
- విలేకరుల సమావేశంలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మ్యానిఫెస్టోను వెంటనే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఇంకా నాలుగు మాసాలు గడువు ఉందని, ఆలోపు హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు, స్థలం ఉన్న వారికి 5 లక్షల ఆర్థిక సహాయం, లక్ష రుణమాఫీ, పోడు భూములకు పట్టాలు, పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ, వీఓఏల సమస్యల పరిష్కారం, రైతులకు కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు మేడే ఉత్సవాలు జరుపుకుం టారన్నారు. కార్మికుల పోరాట ఫలితమే నేడు మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నారని చెప్పారు. ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు మేడే ఉత్సవాలు జరపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆనాడు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 గంటల పని విధానం, కనీస వేతనం లేకుండా చేయడం, సంఘాలు పెట్టుకోకుండా నిషేధించడం, కార్మికుల సంక్షేమాన్ని ఎత్తివేయడం లాంటివి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు సంఘటితంగా ఉండి పాలకుల విధానాలను అడ్డుకోవాలన్నారు. మే 1న సాయంత్రం నాలుగు గంటలకు మిర్యాలగూడలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బహిరంగ సభ ఉంటుం దని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మూడవత్ రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, భవాండ్ల పాండు పాల్గొన్నారు.