Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రైతుల రాస్తారోకో
- బైటాయించిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
- సమస్యను పరిష్కరించిన జాయింట్ కలెక్టర్
నవతెలంగాణ-మాడుగులపల్లి
లారీలు రావడం లేదంటూ వారం రోజులుగా ధాన్యం కొనుగోళ్లు బంద్ చేయడంతో రైతులు శుక్రవారం రోడ్డెకెక్కారు. రైతు సంఘం, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రంలో తక్షణం రైతుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముద్దిరెడ్డి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో కాంటాలు బంద్ చేశారు. దీంతో రైతులు నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐదు రోజుల నుంచి లారీలు రావడం లేదని పూర్తిగా ధాన్యం కొనుగోలు నిలిపివేశారన్నారు. అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, వ్యవసాయ అధికారులు జోక్యం చేసుకోవాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వచ్చే వరకు కదిలేది లేదని అక్కడే బైటాయించారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చారు. కొనుగోలు కేంద్రంలో అవకతవకలను పరిశీలించి పీఏసీఎస్ సిబ్బందిని మందలించారు. ప్రతిరోజూ కాంటాలు వేసిన ధాన్యాన్ని రవాణా చేయడానికి కనీసం ఐదు లారీలైనా పంపించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రతి రోజూ వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడూ కొనుగోలు చేయిస్తామని అదనపు కలెక్టర్ భాస్కరరావు రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి లారీల కాంట్రాక్టర్ యాదగిరితో మాట్లాడారు. నాలుగు లారీలు తెప్పించారు. ధాన్యం కాంటాలు వేయించి బస్తాలను లారీలలో ఎక్కించే వరకు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దేవిరెడ్డి అశోక్‌రెడ్డి, రైతు సంఘం మండల కార్యదర్శి దేవిరెడ్డి మల్లారెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రొండి శ్రీను, పుల్లెంల శ్రీకర్, సర్పంచ్ ఎర్ర కన్నయ్య, రవి, మాధవరెడ్డి, నర్సిరెడ్డి, నాగరాజు, నారాయణరెడ్డి, నాగయ్య, వెంకన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.