Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రక్రియను పూర్తి చేయండి : మంత్రి వర్గ ఉపసంఘం ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవో నంబర్ 58, 59 కింద ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. వారం రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పట్టాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. శుక్రవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఉపసంఘం సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్తో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ అంశంపై సబ్ కమిటీ చర్చించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, ఏయే జిల్లాలో ఎన్ని పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి, జాబితాను సిద్ధం చేయాలని సీసీఎల్ఏను ఆ కమిటీ ఆదేశించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందేలా చూడాలని స్పష్టం చేసింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి, పంపిణీకి సిద్దం చేయాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు రోజువారీగా సమీక్షలు నిర్వహించి, ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి, వారి జీవితాల్లో ఆనందం నింపాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొంది. ఆ దిశగా అందరూ కృషి చేసి, అర్హులైన వారికి ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనం చేకూర్చాలని అభిప్రాయపడింది.