Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కొత్త సచివాలయం
- రేపు రాష్ట్ర ప్రజలకు అంకితం
- రూ.1000 కోట్లకు చేరిన వ్యయం..?
- ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వ కొత్త సచివాలయం సాకారమైంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, కేంద్రంలోని మోడీ సర్కార్ నిరంతరం సహాయ నిరాకరణ చేస్తున్నా అడుగులు తడబడకుండా ముందుకు సాగారు. ప్రజా పరిపాలనా సౌధానికి సీఎం కేసీఆర్ ఊపిరిలూదారు. కొత్త సచివాలయ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. తన ఆకాంక్షను నేరవేర్చుకున్నారు. రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన కార్యక్షేత్రం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు రూ. 1000 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదే రోజు నుంచి కొత్త సచివాలయంలో ప్రభుత్వం పరిపాలన సాగించనుంది. ప్రజలకు అందుబాటులోకి తేస్తూ వారికి అంకితం చేయనుంది.
తెలంగాణ ప్రజల పాలనాకేంద్రంగా సీఎం కేసీఆర్ 2019, జూన్ 27న కొత్త సెక్రెటరియేట్ భవనానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇండో-పర్షియన్ నిర్మాణశైలిలో అత్యాధునిక హంగులతో నూతన భవనాన్ని తీర్చిదిద్దారు. రాష్ట్ర హైకోర్టు తరహాలోనే సచివాలయంపై డోమ్‌లు నిర్మించారు. రెండు డోమ్‌లపై జాతీయ చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం 34 డోమ్‌లను ఏర్పాటు చేశారు. సచివాలయానికి ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన డోమ్‌లు అత్యంత ఎత్తయినవి. సుమారు 165 అడుగుల ఎత్తున ఉన్న డోమ్‌లపై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేయడంతో సుదూర ప్రాంతంనుంచి కూడా ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు గుమ్మటాలపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాలైన మూడు సింహాలతో దేశభక్తి, ఆత్మగౌరవ పతాకలా సచివాలయం తళుకులీనుతున్నది. ఇందులో నీటి సరఫరా కోసం హైడ్రో న్యుమాటిక్ వ్యవస్థ సైతం అందుబాటులో ఉంది. ఓవర్ హెడ్ ట్యాంక్‌ను అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించేలా తగిన ఏర్పాట్లున్నాయి. వర్షపునీటిని స్టోర్ చేసేందుకు సంపునూ నిర్మించారు. భవనంపై పడిన నీటిచుక్కకూడా వధాకాకుండా అవి సంపులోకి చేరేలా చేసి జలసంరక్షణ ప్రాధాన్యతకు సచివాలయాన్ని మార్గదర్శిలా తీర్చిదిద్దినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాను తోడ్కెళ్లి నూతన సచివాలయ పరిసరాలు, భవనంలోని మొదటి అంతస్థులోని రెండు శాఖలకు చెందిన ఛాంబర్లను చూపించారు. అనంతరం హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్,ఎమ్మెల్యేలు కొత్త సెక్రెటరియేట్‌ను సందర్శించారు.
కట్టిపడేసే డోమ్‌లు, ఫౌంటెన్లు
సచివాలయ ప్రాంగణంలో రెండు భారీ ఫౌంటెన్లను ఏర్పాటు చేశారు. 28 అడుగుల ఎత్తు, 58 అడుగుల వెడల్పుతో రెడ్ శాండ్‌స్టోన్‌తో వీటిని నిర్మించారు. హిందూ, దక్కనీ, కాకతీయ నిర్మాణ శైలుల మేళవింపుగా ఈ భవనాన్ని డిజైన్ చేశారు. నిజామాబాద్‌లోని కాకతీయుల కాలంనాటి నీలకంఠేశ్వర స్వామి ఆలయం, వనపర్తి రాజప్రాసాదాల్లోని శైలుల ఆధారంగా డోమ్‌లను తీర్చిదిద్దారు. గుజరాత్‌లోని సలంగ్పూర్ హనుమాన్ దేవాలయ నిర్మాణ శైలిని కూడా గుమ్మటాల్లో వాడారు. బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నీ ఎర్ర ఇసుకరాతితో, మధ్యలోని బురుజు రాజస్థాన్‌లోని ధోల్పూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఇసుకరాతితో నిర్మించినట్టు అధికారులు చెప్పారు. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లు అయిన డాక్టర్ ఆస్కార్, పొన్ని కాన్సెసావోలు డిజైన్ చేశారని ఇంజినీర్ ఇన్ చీఫ్ ఐ.గణపతిరెడ్డి తెలిపారు.
గ్రీన్ కాన్సెప్ట్ విధానంలో నిర్మాణం
నూతన సచివాలయాన్ని గ్రీన్ కాన్సెప్ట్ విధానంలో నిర్మించారు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా డిజైన్ చేశారు. చుట్టూ గదులు, మధ్యలో ఖాళీ స్థలం ఉంచారు. మొత్తం ఎనిమిది ఎకరాల స్థలాన్ని పచ్చదనం కోసం కేటాయించారు. పచ్చికతోపాటు మొక్కలను కూడా నాటారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌వైపు 2,500 చదరపు అడుగుల విస్తీర్ణం లో క్యాంటీన్, అదే వరుసలో గుడి, బ్యాంకు, ఏటీఎం ఉంటాయి. సచివాలయ ప్రాంగణంలో రెండున్నర ఎకరాల్లో 560 కార్లు, 720 ద్విచక్ర వాహనాలు, నాలుగు బస్సులకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. సందర్శకులకోసం మరో 300 కార్లు పట్టేలా ఒకటిన్నర ఎకరాల్లో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. రోజువారీ సందర్శకులు, అధికారులు, ప్రత్యేక సమావేశాల సందర్భంలో వచ్చే వాహనాలను దష్టిలో ఉంచుకొని ఆ మేరకు సిద్ధం చేశారు. ఈమేరకు ఇండియన్ గ్రీన్ బిల్డిండ్ కౌన్సిల్(ఐజీబీసీ) చైర్మెన్ శేఖర్‌రెడ్డి ప్రారంభోత్సవం రోజున సీఎంకు ప్రత్యేకంగా సర్టిఫికెట్‌ను అందజేయనున్నారు. సచివాలయం మీడియా సెంటర్ మాత్రం ప్రధాన భవనంలో లేదు. మెయిన్‌గేటు బయట ప్రత్యేకంగా మరో భవనాన్ని నిర్మించారు. అందులోనే పబ్లీసీటీ సెల్ సైతం ఏర్పాటు కానుంది.
ఆరో అంతస్థులో సీఎంవో
సచివాలయంలోని ఆరో అంతస్థులో సీఎం, చీఫ్ సెక్రటరీల ఛాంబర్లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు సీఎం సిబ్బంది, ఆయన ప్రజలను కలిసేందుకు 'జనహిత' పేరుతో 250 మంది కూర్చునేవిధంగా సమావేశ మందిరం, మంత్రులు, అధికారులకు సరిపడా క్యాబినెట్ సమావేశం కోసం మరో హాలు, సీఎంను కలిసేందుకు వచ్చేవారికోసం ప్రత్యేక వెయిటింగ్ హాలును నిర్మించారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణకు కూడా ప్రత్యేక సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. కనీసం 25 మంది విశిష్ట అతిథులతో ముఖ్యమంత్రి కలిసి భోజనం చేసేందుకు ఓ అత్యాధునిక డైనింగ్ హాలును కూడా నిర్మించారు.
ప్రధాన ద్వారం...
సచివాలయ ప్రధాన ద్వారాన్ని నాలుగు భారీ తలుపులతో 29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేశారు. తలుపులపై ఇత్తడి పూతతో నగిషీలను కూడా చెక్కించారు. ఆదిలాబాద్ అడవుల్లోని టేకు కలపను ఉపయోగించి నాగ్‌పూర్‌లో వీటిని తయారు చేయించినట్టు అధికారిక సమాచారం. మొత్తం సచివాలయంలో 875 వరకు తలుపులు ఉండగా, ఇందులో దాదాపు 90 శాతం తలుపులు టేకు కలపతోనే తయారు చేశారు. కొన్ని మాత్రం ఇనుముతో చేయించినట్టు అధికారులు చెబుతున్నారు.
పటిష్టంగా ఫైర్‌సేఫ్టీ
భవనానికి నలువైపులా వెడల్పైన మెట్లదారితోపాటు మూడు, నాలుగు చొప్పున భారీ లిఫ్టులను ఏర్పాటు చేశారు. ఏమైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే కిందకు చేరుకునేలా ఇవి ఎంతో ఉపయోగపడతాయని అధికారుల అభిప్రాయం. ఫైర్‌సేఫ్టీ వ్యవస్థను కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. షార్ట్ సర్క్యూట్‌తో ఎక్కడా ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావులేకుండా ఉండేందుకు విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎక్కడికక్కడ నిలిపివేసేలా తగిన ఏర్పాట్లు చేశారు.