Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి పని చేస్తాం
- సీట్లపై ఇంకా నిర్ధిష్ట నిర్ణయాలు జరగలేదు
- మీడియాతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రంలో బీజేపీ నిరుత్సాహంలో ఉన్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి చాలా స్పష్టంగా ఉందని అన్నారు. కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని, ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నదని వివరించారు. ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, వందల కోట్ల ఆశలు చూపినా బీజేపీ పెరిగే అవకాశం కనబడటం లేదని అన్నారు. దీంతో బీజేపీ పూర్తిగా నిరుత్సాహంలో ఉందని, ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా ఎన్ని పర్యటనలు చేసినా ఆశించిన స్థాయిలో బీజేపీలో చేరికలు లేవని అన్నారు. పైగా ఇప్పుడు అసంతృప్తితో బయటకెళ్లే నాయకులు కూడా కాంగ్రెస్, ఇతర పార్టీల్లో చేరుతున్నారే తప్ప, బీజేపీ వైపు చూసే పరిస్థితి లేదని అన్నారు. రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా సీపీఐ(ఎం), సీపీఐలతో కలిసి పని చేస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారని, అయితే సీట్లు, ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేదానిపై నిర్ధిష్టంగా నిర్ణయాలు జరగలేదని అన్నారు. సీట్లనేవీ ఒకరు ఇచ్చేవి, మరొకరు తీసుకొనేవి కావని, బలా బలాలను బట్టే సీట్ల పంపకం జరుగుతుందని తాము ఆశిస్తున్నామని అన్నారు. అటువంటి అవగాహన తమకు, బీఆర్ఎస్ నేతలకు ఉందని స్పష్టం చేశారు.
సమస్యలు పరిష్కారం కాకపోతే జూన్‌లో పోరాటం
రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్తో స్నేహం చేస్తున్నప్పటికీ, పొత్తుకు కూడా అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని అంశాల్లో వాగ్ధాన భంగం జరుగుతోందని విమర్శించారు. పోడు భూములు, కార్మికులకు కనీస వేతనాల జీవో, ఇండ్ల స్థలాలకు పట్టాలు, మధ్యతరగతి ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పీఆర్సీ, ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు వంటి వాటిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి అందజేస్తామని అన్నారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే, జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌తో పాటు అన్ని లౌకిక పార్టీలతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. పోడు భూముల సమస్యపై కాంగ్రెస్‌తో కలిసి పని చేశామని, అయితే బీజేపీని ఎదుర్కోవడానికి ఆ పార్టీ ఐక్యంగా లేదని అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ తమను సంప్రదించిందని, కానీ అక్కడ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే బీజేపీకి అవకాశం ఇచ్చినట్లు అయ్యేదని పేర్కొన్నారు. ఉత్తర భారత దేశంలో చాలా ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉందని అక్కడ తాము కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని అన్నారు.
బీసీ కుల గణన చేపట్టాలి
ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి, బిసిలకు పెంచుతామని అమిత్ షా చేసిన ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీసీ రిజర్వేషన్ అమలకు బిసి జనాభా లెక్కల తీయాలని పార్లమెంట్లో అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని, కానీ బీసీ ప్రధాని ఉన్నప్పటికీ ఆ డిమాండ్‌ను నెరవేర్చటం లేదని విమర్శించారు. నిజంగా బీసీలపై ప్రేముంటే, జనగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. జనగణనలో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ముస్లింలు, బీసీల మధ్య చిచ్చు రేపే బదులు, బీసీ జనగణన చేపట్టి రిజర్వేషన్లు ప్రకటించాలని హితవు పలికారు.