Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనువాదాన్ని మళ్లీ తెచ్చే కుట్ర
- అదే జరిగితే....మనమంతా మళ్లీ బానిసత్వలోకే
- ఒక్కటవుదాం....ఐక్యంగా పోరాడుదాం
- పూలే, అంబేద్కర్ జన జాతరలో వక్తల పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మతోన్మాద ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు దేశంలో మళ్లీ మనువాదాన్ని అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని పలువురు వక్తలు హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదుట కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్), తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం, తెలంగాణ రజక వృత్తిదార్ల సంఘం, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, తెలంగాణ గిరిజన సంఘం, మత్యకారులు, మత్స్యకార్మిక సంఘం, కల్లుగీత కార్మిక సంఘం, ఆవాజ్, ప్రజానాట్య మండలి సంయుక్తాధ్వర్యంలో ఫూలే, అంబేద్కర్ జన జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఏ బానిసత్వం, అంటరానితనం, మనువాదం పోవాలంటూ మహనీయులు పూలే, అంబేద్కర్ తమ జీవితాలను అంకితం చేశారో, వాటిని తిరిగి తెచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే తిరిగి శాశ్వత బానిసత్వంలోకి తీసుకెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు.రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాల్ రావు మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి సాంఘిక విప్లవకారులు ఫూలే, అంబేద్కర్లని కొనియాడారు. అందరికి సమాన హక్కులు, అవకాశాలు రావాలని అంబేద్కర్ కోరుకున్నారనీ, బీజేపీ ఆయన ఆశయాలను, కన్న కలలను వెనక్కి తీసుకెళ్తున్నదని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నరని తెలిపారు. సమాజాన్ని విడగొట్టే దుర్మార్గవాదానికి వ్యతిరేకంగా ఐక్యపోరాటానికి ప్రజలు కదిలి రావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్‌దాస్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మన కోసం మనం రాసుకున్నామని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని ఆమోదించుకోవడం ద్వారా అందరికి అన్ని హక్కులు దక్కాయని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వమున్న భారతదేశంలో సోదరభావాన్ని రాజ్యాంగం కల్పించిందన్నారు. అంబేద్కర్ అంటే ఒక విగ్రహం మాత్రమే కాదనీ, మనం అనుసరించాల్సిన బాట అని తెలిపారు.
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ సామాజిక పోరాటానికి ఫూలే, అంబేద్కర్ రెండు కండ్లని అభివర్ణించారు. అంబేద్కర్ మహిళా పక్షపాతి అని తెలిపారు. మహిళా కోడ్ కోసం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మహనీయడని తెలిపారు.
గౌడ సంఘాల జేఏసీ చైర్మెన్ బాల్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును ఆయుధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రముఖ అంబేద్కరిస్టు జే.బీ.రాజు మాట్లాడుతూ ఓటు హక్కుతో బీజేపీ సర్కారును కూలదోస్తేనే మనవాద ప్రమాదం నుంచి బయపడగలుగుతామని తెలిపారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో మిగతా సంఘాలకు సీఐటీయూ మద్ధతుగా నిలబడుతుందని ప్రకటించారు. బీసీ కులగణన, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, సామాజిక న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాల్సిందేనని స్పష్టం చేశారు.
ఆవాజ్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ బానిసత్వం, అంటరానితనం భరించలేక ఇతర మతాల్లోకి వెళ్లిన వారు స్వేచ్ఛను అనుభవిస్తున్నారని తెలిపారు. ఇది మనువాదులకు కంటగింపుగా మారిందన్నారు. ఇలాంటి చర్యలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీల వైఖరేంటి?.... జాన్ వెస్లీ
బీజేపీ నమ్ముతున్న మనవాద సిద్ధాంతం ప్రకారం బండి సంజయ్ ఎంపీగా కావడానికి కానీ, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండటానికి వీల్లేదని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ తెలిపారు. ఆయన కూడా బానిసగానే ఉండాల్సి ఉంటుందన్నారు. ఆ పార్టీలో కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మనువాదంపై తమ వైఖరేంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మనువాదం వస్తే మనుషులుగా చూసే పరిస్థితి ఉండబోదన్నారు. చదువు, పాలన, ఆస్తిలో హక్కులుండవని చెప్పారు. తప్పును బట్టి శిక్షలుండాలని రాజ్యాంగం చెబితే కులాన్ని బట్టి శిక్షలుండాలని మనవాదం చెబుతున్నదని గుర్తు చేశారు. మనువాదంపై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మనవాదులకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్నం ప్రధాన కార్యదర్శి డీ.జీ.నర్సింహారావు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్, గొర్రెల, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, తెలంగాణ గిరిజన సంఘం హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి బాలు నాయక్, పట్నం హైదరాబాద్ జిల్లా నాయకులు ఎం.మహేందర్, టీపీఎస్కే రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర్లు, ఆవాజ్ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎండీ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఆట-పాట
ఈ సందర్భంగా టీపీఎస్కే శిక్షణలో చిన్నారులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అంబేద్కర్ జీవితం, దేశ పరిస్థితులు, బీజేపీ కుట్రలపై ఆలోచింపజేశాయి. చిన్నారులు హావభావాలతో సాహిత్యానికి తగినట్టు ప్రదర్శించిన అభినయం ప్రజలను మెప్పించింది. అంబద్కర్, ఫూలే, సావిత్రిభాయి ఫూలే మహనీయులను జీవితాలను కండ్ల ముందు సాక్షాత్కరింపజేశారు.