Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా ఏర్పాట్లు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిర్మితమైన కొత్త సచివాలయం ఆదివారం ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. దాదాపు రెండు సంవత్సరాల అనంతరం సెక్రటేరియేట్ అందుబాటు లోకి వస్తున్నది. దాదాపు రూ. 1000 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరనుంది. కోట్లాది మంది భవితవ్యానికి చిరునామా కానుంది. సీఎం కేసీఆర్ మాటల ప్రకారం సకుల జనుల సంక్షేమ పాలన కోసమే కొత్త సచివాలయానికి పునాది పడింది. దేశంలోనే తొలి గ్రీన్ సెక్రటేరియేట్ ఇప్పటికే ఖ్యాతిగాంచింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్లగ్ అండ్ ప్లే విధానంతో నిర్మాణం పూర్తి చేసుకుంది. సకల పరిపాలన సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నది. ప్రారంభం రోజు నుంచే సచివాలయం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈమేరకు ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ శాఖల తరలింపు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు సైతం తమ చాంభర్లను ఇప్పటికే చేరకున్నారు. సీఎం నిర్దేశనం ప్రకారం లాంఛనంగా ఆదివారం తమ, తమ కుర్చీల్లో ఆసీనులవుతారు.
నిర్మాణ ప్రత్యేకతలు : మహాద్వారం
29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తున నాలుగు తలుపులతో బాహుబలి మహాద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాదు అడవుల్లోని టేకు కలపతో నాగపూర్ లో ఈ మహాద్వారం తయారుచేయబడింది. కలపపై ఇత్తడి పోతతో నగిషీలు చెక్కించారు. మొత్తం సచివాలయ ప్రాంగణంలో తలుపులన్నింటినీ టేకుతోనే తయారు చేశారు.
జాతీయ చిహ్నం
ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన 4 సింహాల చిహ్నాలను ఏర్పాటుచేశారు. 5 అడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువుండే జాతీయ చిహ్నాలను ఢిల్లీలో తయారు చేయించి తీసుకువచ్చి అమర్చారు.
మినీ రిజర్వాయర్
నీటిని పొదుపు చేసే ఉద్దేశంతో సచివాలయ భవనం భూగర్భంలో రెండున్నర లక్షల లీటర్ల సామర్థ్యంతో మినీ రిజర్వాయర్ నిర్మించబడింది. భవనం నలువైపుల నుంచి వాన నీటిని రిజర్వాయర్ లోకి తరలించేందుకు ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 9 ఎకరాల పచ్చిక బయళ్ళ నిర్వహణకు ఈ రిజర్వాయర్ లోని నీటినే వినియోగిస్తారు.
ప్రార్థనా మందిరాలు
సచివాలయంలో మునుపటి మాదిరిగానే హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థన మందిరాలను ప్రభుత్వం నిర్మించింది. గతం కంటే విశాలంగా, సుందరంగా వీటిని తీర్చిదిద్దారు. ఆయా మత పెద్దల ఆకాంక్షల మేరకు నిర్మా ణాలు చేయించుకునే వెసులు బాటును ప్రభుత్వం కల్పించింది. దేవాలయం, మసీదు, చర్చి కోసం సుమారు తొమ్మిది వేల చదరపు అడుగులను కేటాయించారు.
భద్రత ఏర్పాట్లు
సచివాలయ భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచి వాలయంలోనికి ప్రవేశించ గలరు. నిత్యం సుమారు 650 మందికి పైగా భద్రతా సిబ్బంది పహారా కాయ నున్నారు. రాత్రీ పగలూ నిరంత రాయంగా పని చేసే పటిష్టమైన సీసీటీవీల కెమెరా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శకులు ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) ద్వారా వారి సమాచారం ఆధార్ డేటాతో అనుసంధాన మవుతుంది. పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డేటా ద్వారా సందర్శకుని పూర్తి వివరాలు అప్పటికప్పుడే కంప్యూటర్ తెరపై కనిపిస్తాయి.
ద్వారాలు-ప్రవేశం
- సచివాలయం నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిల్లో నార్త్‌వెస్ట్ (వాయువ్య) ద్వారాన్ని అవసరం వచ్చినపుడు మాత్రమే తెరుస్తారు.
- నార్త్ఈస్ట్ (ఈశాన్య) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు, అధికారుల రాకపోకలు కొనసాగుతాయి. సౌత్ఈస్ట్ (ఆగేయం) ద్వారం విజిటర్స్ కోసం వినియోగిస్తారు.
- సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
- తూర్పుగేట్ (మెయిన్‌గేట్) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ, విదేశీ అతిథుల కోసం మాత్రమే వినియోగిస్తారు.
- దివ్యాంగులు, వద్ధుల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్‌కు అభినందనలు
బౌద్ధ ఉపాసక్ మహాసభ
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడంతో పాటు 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు గానూ ది ప్రాక్టీసింగ్ బుద్దిస్ట్ సొసైటీ (బౌద్ధ ఉపాసక్ మహాసభ) సంస్థ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు లక్నో నుంచి సొసైటీ ప్రధాన కార్యదర్శి కేఆర్ రావత్ సీఎం కేసీఆర్‌కు ఒక లేఖను రాశారు.
ప్రారంభ వేడుకల షెడ్యూల్
- ఏప్రిల్ 30వ తేదీ సూర్యోదయం ఆరు గంటల తరువాత సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం.
- మధ్యాహ్నం ఒంటి గంటా 20 నిమిషాల నుంచి ఒంటి గంటా 30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి.
- తరువాత సమీకృత కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్.
- ఆ వెంటనే ఆరవ అంతస్తులోని తన ఛాంబర్లో కొలువుదీరనున్న సీఎం కేసీఆర్
- మధ్యాహ్నం ఒంటి గంటా 58 నిమిషాల నుంచి రెండు గంటల నాలుగు నిమిషాల మధ్యకాలంలో తమతమ ఛాంబర్లల్లో కొలువుదీరనున్న ఆయా శాఖల మంత్రులు.
మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు కొత్త
సచివాలయం ప్రాంగణంలో గ్యాదరింగ్
- గ్యాదరింగ్‌ను ఉద్దేశించిప్రసంగించనున్న సీఎం కేసీఆర్!
- ఆ తరువాత తమతమ స్థానాల్లో కొలువుదీరనున్న అధికారగణం, ఇతర ప్రభుత్వ యంత్రాంగం.
- ఏప్రిల్ 30వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అందుబా టులోకి రానున్న సమీకత కొత్త పరిపాలనా సౌధం
- ఆనాటి నుంచి అక్కడే పూర్తిస్థాయి విధులు నిర్వర్తించనున్న సీఎం, సీఎంఓ అధికార యంత్రాంగం, మంత్రులు, సచివులు, ఇతర అధికారగణం, సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు.
మళ్లింపు ఇలా..
- ఆఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్‌కు ట్యాంక్‌బండ్‌పై నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి కట్టమైసమ్మ ఆలయం లోయర్ ట్యాంక్‌బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ వైపునకు వెళ్లాలి.
- ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ వైపు నుంచి నెక్లెస్ రోటరీవైపు అనుమతి లేదు. ఈ వాహనాలను వీవీ విగ్రహం చౌరస్తా నుంచి సాదన్ కాలేజీ, నిరంహంకారి వైపు మళ్లిస్తారు.
నిరంహాంకారి చింతలబస్తీ వైపు నుంచి నెక్లెస్
రోటరీ వైపు వెళ్లే వాహనాలకు ఖైరతాబాద్ ఫ్లై
ఓవర్ మీదుగా వెళ్లేందుకు వీలు ఉండదు.
- లిబర్టీ వైపు నుంచి తెలుగు తల్లి, అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్ వైపు అనుమతి లేదు. ఈ వాహనాలు నేరుగా ఫ్లై ఓవర్ మీదకు వెళ్లి అక్కడి నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ వెళ్లాలి.
- ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఎన్టీఆర్మార్గ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ జంక్షన్వైపు మళ్లిస్తారు.
- బీఆర్కే భవన్ వైపు నుంచి ఎన్టీఆర్మార్గ్కు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- బడా గణేశ్ నుంచి నెక్లెస్ రోడ్డు రోటరీ వైపు వచ్చే వాహనాలను బడా గణేశ్ నుంచి రాజ్‌దూత్ హోటల్ లైన్‌కు మళ్లిస్తారు.
ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్ల్టు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. వీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వరకు ఇరువైపుల అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులు మూసివేయనున్నట్టు అదనపు సీపీ వెల్లడించారు. హెచ్ఎండీఏ సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది. ఆహ్వానితుల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించామనీ, సచివాలయానికి వచ్చే ఆహ్వానితులు తమ పాస్‌లను కార్ డోర్లకు అతికించుకోవాలని సూచించారు.