Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరాపార్కు వద్ద ధర్నాలో 'ఐలూ' డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని న్యాయవాదుల సమస్యలు పరిష్కరించడంలో బార్ కౌన్సిల్‌తో పాటు రాష్ట్రప్రభుత్వం చొరవ చూపాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శనివారంనాడిక్కడి ఇందిరాపార్కు వద్ద 'ఐలూ' ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐలూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విద్యాసాగర్, కే సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కే పార్థసారది, నగర అధ్యక్షులు ప్రవీణ్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరినాధ్ తదితరులు పాల్గొన్నారు. ధర్నాకు భారీగా తరలివచ్చిన న్యాయవాదులను ఉద్దేశించి వారు మాట్లాడారు. 2019, ఆ తర్వాత న్యాయవాదవృత్తిలో చేరిన వారందరికీ హెల్త్‌కార్డులు అందచేయాలని డిమాండ్ చేశారు. 2019 తర్వాత చనిపోయిన న్యాయవాదుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నదనీ, దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీకి లాభమే తప్ప, న్యాయవాదులకు నష్టం కలుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు చికిత్స కోసం చెల్లిస్తున్న రూ.2 లక్షల బీమా పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల తల్లిదండ్రులకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలనీ, ప్రసవం సహా అన్ని చికిత్సలకు హెల్త్ కార్డులు వర్తింప చేయాలని కోరారు. జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను నెట్వర్క్ జాబితాలో కలపాలనీ, సప్లిమెంటరీ డీడ్ ఆఫ్ ట్రస్ట్ పేరుతో చేసిన చట్టసవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 41(ఏ)సీఆర్పీసీని పోలీసులు దుర్వినియోగపర్చకుండా, కక్షిదారులు ఆర్థిక హింసకు గురికాకుండా న్యాయవాదుల రక్షణలోఉండేలా చట్ట సవరణ చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాలనీ, కొత్తగా ఈ వృత్తిలోకి వచ్చేవారికి ఐదేండ్లపాటు నెలకు రూ.5వేలు చొప్పున భృతి ఇవ్వాలని చెప్పారు. ఈ సందర్భంగా కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ఈ తరహా భృతిని అమలు చేస్తున్నాయని ఉదహరించారు. హైదరాబాద్‌లో న్యాయవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి, నిరంతర శిక్షణా తరగతులు, వసతి సౌకర్యాలు కల్పించాల ని కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చనిపోయిన న్యాయవాది కుటుంబానికి రూ.4లక్షలు చెల్లిస్తున్నదనీ, దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.6లక్షలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన న్యాయవాదులకు ఇండ్లస్థలాలు ఉచితంగా లేదా కనీస ధరకు ఇవ్వాలనీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌ను బార్ కౌన్సిల్ నిర్వహిస్తున్న సంక్షేమ నిధికి బదలాయించాలని డిమాండ్ చేశారు. పై అంశాల పరిష్కారం కోసం లా సెక్రటరీకి, అడ్వకేట్ జనరల్‌కు వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఐలూ రంగారెడ్డి జిల్లా నాయకులు గోవర్థన్, కొండల్‌రెడ్డి, కొత్తగూడెం బార్ అసోసియేషన్ నాయకులు ఎమ్ రమేష్‌కుమార్, కోశాధికారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.