Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అకాలవర్షాలకు పంటనష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించాలని తెలంగాణ రైతురక్షణ సమితి అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు డిమాండ్ చేశారు. వివిధ పంటలకు పంట నష్టపరిహారం ఏవిధంగా, ఎంత మొత్తం ఎన్ని రోజుల్లో చెల్లిస్తారో చెప్పాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తడిసి రంగు మారిన, మొలకెత్తిన ధాన్యానికి, మొక్కజొన్న పంటలకు ఎంఎస్పీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం పెద్ద ఎత్తున జరిగిందని పేర్కొన్నారు. రైతుకు జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుతో సమానంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహకారం కూడా కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారంతోపాటు రైతుకు 30 రోజుల్లో పరిహారం అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు. రుణ మాఫీ వెంటనే అమలు చేయకపోవడంతో రైతులు ప్రయివేటు అప్పులబారిన పడుతున్నారని చెప్పారు. పంట నష్టపోయిన ప్రాంతాలకు పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలని కోరారు.