Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజేఎస్ జెండావిష్కరణలో కోదండరాం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతికి అడ్డూ,అదుపు లేకుండా పోయిందని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు. ఈ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. శనివారం నాంపల్లిలోని టీజేఏస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఐదోవ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జన సమితి కార్యకర్త తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఆర్భాట ప్రచారాలు చేస్తున్నదే తప్ప రాష్ట్రంలో ఎక్కడా నిర్మాణాత్మక అభివృద్ధి జరగడం లేదన్నారు. దళిత బంధు లబ్ధిదారుల దగ్గర ఎమ్మెల్యే లు రూ. మూడు లక్షల కమీషన్ తీసుకుంటున్నరని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం సిగ్గు చేటన్నారు. గత ఐదేండ్లుగా ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం అలుపెరుగకుండా పోరాడుతున్నారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, రైతాంగ సమస్యలు, నిరుద్యోగం, ఫీజురియింబర్స్‌మెంట్, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం కోసం, యూనివర్శిటీల బాగుకోసం ఇలా అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, టీజేఏస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు సలీమ్ పాష, ఇతర నాయకులు నర్సయ్య, అరుణ్ కుమార్, రాంచందర్, సత్యనారాయణ పాల్గొన్నారు.