Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1000 కోట్లు చేతులు మారాయి
- రూ. 30వేల కోట్లు వచ్చేదాన్ని కేవలం రూ.7380 కోట్లకే కట్టబెట్టారు
- అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)ను లీజుకివ్వడం వెనుక దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి ఆరోపించారు. లీజు వ్యవహారంలో రూ.1000 కోట్లు చేతులు మారా యని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏటా కనీసం 10 శాతం పెరుగుతున్నదని అంచనా వేసినా కనీసం రూ. 30వేల కోట్లు ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ను రూ.7380 కోట్లకే ముంబాయి కంపెనీకి తాకట్టు పెట్టారని చెప్పారు. మొదట్లో లీజు ద్వారా రూ. 10వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. ముందుగా రూ.8 లేదా9వేల కోట్లు అని చెప్పారనీ, ఇప్పుడు రూ.7380 కోట్లు వచ్చాయని తెలిపారు. ఈ వ్యవహారంలో దాగి ఉన్న మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన మొత్తం వ్యవహారం సోమేష్‌కుమార్ కనుసన్నుల్లో జరిగిందన్నారు. అర్వింద్‌కుమార్ సంతకం పెట్టారని తెలిపారు. ప్రభుత్వం దిగిపోయే ఆరు నెలల ముందు తీసుకున్నా ఏ నిర్ణయాలైనా వచ్చే ప్రభుత్వం సమీక్షిస్తుందని గుర్తు చేశారు. కేటీఆర్, అధికారులు సోమేష్‌కుమార్, అర్వింద్‌కుమార్ ఈ వ్యవహారంలో దోపీడికి పాల్పడ్డారని ఆరోపించారు. 2018 నుంచి ఓఆర్ఆర్ టోల్‌ను ఏయే సంస్థలు వసూలు చేశాయో, వాటికి టెండర్ రూపంలో లేదా నామినేషన్ రూపంలో కట్టబెట్టారో అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగేండ్ల నుంచి ఓఆర్ఆర్ టోల్‌ను ఈగల్ ఇన్ఫ్రాకు కట్టబెట్టారని చెప్పారు. ఓఆర్ఆర్ రోజుకు రూ. 2 కోట్ల టోల్ వసూలు అవుతుందన్నారు. టెండర్ అవసరం లేకుండానే ఏడాదికి ఏడాది పొడిగించు కుంటూ కేటీఆర్ ఇందులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్‌ను ఆదాయ వనరుగా కేటీఆర్ మిత్రబృందం ఉపయోగిం చుకుందన్నారు. ఇందుకు మాజీ సీఎస్ సోమేష్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్, జయేష్ రంజన్ సహకరిం చారనీ, ఈ ఆదాయాన్ని శాశ్వతంగా ఉపయో గించు కునేందుకు కేటీఆర్ కుటుంబం ఆలోచించిందని చెప్పారు. తమ కుటుంబానికి లాభం ఉండదని గ్రహించి టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) విధానంలో 30 ఏండ్ల ప్రయివేటు సంస్థకు కట్టబెట్టాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డును కేటీఆర్ ప్రయివేటు కంపెనీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ లెక్క ప్రకారం వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్‌రోడ్‌ను ప్రయివేటుకు అమ్మేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను సీఎం కేసీఆర్ అమ్ముతుంటే, బీజేపీ నాయకులు బండి సంజరు, కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఈ అంశంపై బీజేపీ నేతలు కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిందని గుర్తు చేశారు.
హైదరాబాద్ మహా నగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్‌ను నిర్మించేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6696 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వచ్చే ప్రతి వాహనం ఓఆర్ఆర్ను టచ్ చేయాల్సిం దేనన్నారు. ఓఆర్ఆర్ను లీజుకు ఇవ్వాలన్న నిర్ణయంతో ప్రజలు ఔటర్ రింగ్ రోడ్‌ను వినియోగిం చుకోలేని పరిస్థితులొచ్చాయని అవేదన వ్యక్తం చేశారు. టోల్ఛార్జీలు పెంచుకునే వెసులు బాటుకు కూడా టోల్ సంస్థకు కట్టబెట్టారని విమర్శించారు. పెట్టుబడులు అంటే మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కానీ ఉన్నవాటిని ఆమ్మేసి దాన్ని పెట్టుబడిగా ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారానికి దిగుతున్నదని విమర్శించారు. టెండర్ విధానాలపై ఈడీ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్సహా విచారణ సంస్థలన్నింటికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.