Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లింగాయతులను ఓబీసీలో చేర్చాలని తీర్మానం చేసినం
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరిష్కరించాలి
- 12వ శతాబ్దంలోనే కుల రహిత సమాజం కోరిన బసవేశ్వరుడు : సంగారెడ్డి పర్యటనలో హరీశ్‌రావు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
'తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పక్క రాష్ట్రంలో ఉన్న రజనీకాంత్‌కు అర్థమైంది. ఇక్కడే ఉన్న గజినీలకు మాత్రం అర్థం కావడం లేదు' అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన సంగారెడ్డి జిల్లాలోని కంది, సదాశివపేట, న్యాల్కల్ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎంతో మారిపోయిందని, న్యూయార్క్‌లా కనిపిస్తుందని సూపర్ స్టార్ రజనీకాంత్ పేర్కొనడం విశేషమన్నారు. సీఎం కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి కనిపిస్తుందని రజినీ అన్నారని గుర్తు చేశారు. కానీ, ఇక్కడున్న ప్రతిపక్షాలకు కనిపించడం లేదన్నారు. కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తున్నందుకు గద్దె దించుతారా అని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా టీ హబ్, టీఎస్ఐ పాస్‌లతో 15 లక్షల ప్రయివేటు కొలువులు ఇస్తున్నది నిజం కాదా అని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు తాము భర్తీ చేస్తుంటే నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దొంగే దొంగ అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్లు దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. 12వ శతాబ్దంలోని కుల రహిత సమాజం కోసం బసవేశ్వరుడు పోరాడారని గుర్తు చేశారు. కుల మతాలు ఏవైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశం మనదని, అందరూ కలిసి ఉండాలనే బసవేశ్వరుడి సూక్తులను ఆచరణలో పాటించాలని అన్నారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం లింగాయతులు ఎన్నో ఏండ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం లింగాయత్ సమాజాన్ని ఓబీసీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లింగాయతులను ఓబీసీలో కలిపేందుకు కృషి చేయాలని, దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. లింగాయత్‌ల గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. ఆత్మగౌరవ భవనాల కోసం కోకాపేటలో రూ.30 కోట్ల విలువ చేసే స్థలం కేటాయించడమే కాకుండా భవన నిర్మాణం కోసం రూ.పది కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
నాల్కల్ మండలంలో కుంభమేళా జాతరకు అన్ని ఏర్పాట్లూ చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులూ కలవకుండా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కంది మండలంలోని వీరశైవ లింగాయత్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాణిక్యరావు, చేనేత అభివద్ధి సంస్థ చైర్మెన్ చింత ప్రభాకర్, టీఎస్ ఎంఐడిసి చైర్మెన్, డిసిఎంఎస్ చైర్మెన్ శివకుమార్ పాల్గొన్నారు.