Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్
- లేబర్ కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా
- జాయింట్ మీటింగ్ పెట్టి సమస్యలను చర్చిస్తాం : జాయింట్ కమిషనర్
నవతెలంగాణ-అంబర్‌పేట
తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం చలో లేబర్ కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వివిధ రంగాల హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ మాట్లాడుతూ హమాలీలు వ్యవసాయ మార్కెట్, కూరగాయలు, పండ్ల మార్కెట్, ఎఫ్ సి ఐ, సిమెంట్ గోడౌన్లో సివిల్ సప్లై, జిసిసి, బేవరేజ్, బజారు ముఠా, ఐకెపి, హమాలీలు, గ్రామీణ హమాలీ లు, రైస్ మిల్, ఆయిల్ మిల్ రైల్వే ఆర్టీసీ లో పనిచేసే హమాలీలందరి సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. హమాలీల సంక్షేమం కోసం నూతన సెక్రటేరియట్ ప్రారంబోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి పేద హమాలీలందరిని ఆదుకోవాలని కోరారు. పీఎఫ్ ఈఎస్ఐ. బోనస్ ప్రమాద బీమా ఆరోగ్య భీమా వంటి సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.. 55 సంవత్సరాల వయసు పైబడిన హమాలీలందరికీ కనీసం 6000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ హమాలీ శ్రమతో ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రయివేటు మార్కెట్లు ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై యావరేజ్ కోల్డ్ స్టోరేజ్ ల నుండి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా హమాలీల సంక్షేమా నికి నిధులు కేటాయించకపోవటం అన్యాయం అన్నారు. హాల్ హమాలి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు మాట్లాడుతూ 50 కిలోలకు మించిన బరువులను నిషేధించాలని ఐఎల్ఓ తీర్మానం ఉన్నప్పటికీ అనేక మార్కెట్లలో కూరగాయలు పండ్లు, అపరాలు 90,100 కేజీల బరువులు మోయించటం వలన అనేక అనారోగ్యాల కు గురవుతున్నారని అన్నారు. హమాలీల ను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.
జాయింట్ కమిషనర్‌కు వినతిపత్రం
మూడు గంటల పాటు హమాలీలు పెద్ద ఎత్తున ధర్నా చేసి అనంతరం జాయింట్ కమిషనర్ గంగాధర్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. గంగాధర్ హమాలీల వద్దకు వచ్చి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు. హమాలీలు అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి హమాలీల సమస్యలన్నీ చర్చించి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి శ్రీకాంత్ హాల్ అమాలి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూక్య శ్రీనివాస్ ఉపాధ్యక్షులు చెన్నయ్య బి రాములు గోపాలస్వామి కార్యదర్శి పి సుధాకర్. యాదగిరి కోశాధికారి కనకయ్య సీఐటీయూ సౌత్ జిల్లా కార్యదర్శి శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.