Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్ కళాసిగూడలో ఘటన
- రోడ్డును తవ్వి వదిలేసిన అధికారులు
- ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు ప్రకటించిన మంత్రి తలసాని
- జీహెచ్ఎంసీ తరపున మేయర్ రూ.2లక్షల ఎక్స్గ్రేషియా
- ఇద్దరు అధికారులపై సస్పెన్షన్
నవతెలంగాణ-బేగంపేట్
పాల ప్యాకెట్ కొనుగోలు చేసేందుకు సోదరుడితో కలిసి షాపుకు వెళుతున్న ఓ బాలిక ప్రమాదవశాత్తు నాలాలో కొట్టుకుపోయి మృతిచెందింది. ఈ ఘటన సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. కళాసిగూడ ధనజారుకు చెందిన శ్రీనివాసులు- రేణుక దంపతులకు కార్తిక్, మౌనిక (11) సంతానం. శ్రీనివాసులు స్థానికంగా ఉండే గోల్డ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య ఇంటి వద్దే చిన్న దుకాణం నడిపిస్తుంది. శ్రీనివాసులుకు తరచుగా ఫిట్స్ వచ్చి అనారోగ్యం బారినపడుతుంటారు. కుమారుడు కార్తిక్ కూడా మానసిక వికలాంగుడు. శనివారం ఉదయం పాల ప్యాకెట్ కొనుక్కురమ్మని తల్లి మౌనికను బయటకు పంపించింది. చెల్లితో కార్తిక్ కూడా వెళ్లాడు. అయితే, ఉదయం 6 గంటల నుంచి హైదరాబాద్ జంట నగరాల పరిధిలో భారీ వర్షం కురిసింది. దాంతో కళాసిగూడ ప్రభుత్వ పాఠశాల వద్ద పెద్దఎత్తున వరద చేరింది. ఉదయం 6.30గంటల సమయంలో పిల్లలిద్దరూ పాఠశాల వద్ద రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లారు. సీసీ రోడ్డు కోసం తవ్వి వదిలేయడంతో ఆ గుంతలో కార్తిక్ పడిపోయాడు. మౌనిక కార్తీక్ను లేపింది. ఈ క్రమంలో పక్కనే నాలాపై పడిన గుంతలో మౌనిక పడిపోయి నాలాలోకి కొట్టుకుపోయింది. బాలికను రక్షించేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నించినా లాభం లేకపోయింది. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్, ఫైర్, మహం కాళి పోలీసులు నాలాలో వెతకగా.. అర కిలోమీటర్ దూరం లో పాట్నీ వద్ద భారీ మ్యాన్ హోల్ వద్ద బాలిక మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తర లించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహంకాళి పోలీసులు ఐపీఎస్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మంత్రి తలసాని విచారం
నాలాలో పడి బాలిక మృతిచెందడం చాలా బాధకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఘటనా స్థలానికి చేరుకోని అధికారులను వివరాలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం మౌనిక తల్లిదండ్రుల పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బాలిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం తరపున రూ.5 లక్షల సహాయం అందించనున్నట్టు ప్రకటించారు. ఘటనపై విచారణ జరిపించి బాధ్యులైన వారికి తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
జీహెచ్ఎంసీ రూ.2లక్ష ఎక్స్గ్రేషియా
బాధిత కుటుంబానికి జీహెచ్ఎంసీ తరపున రూ.2 లక్షల ఎక్స్గ్రేషియాను మేయర్ ప్రకటించారు. రోడ్డు నిర్మాణం జరిగే సమయాల్లో ప్రమాదాలు జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారనీ, వాహనాల రాకపోకల కోసం దుకాణదారులు వాటిని తొలగించారనీ మేయర్ తెలిపారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
అధికారుల నిర్లక్ష్యమే బలితీసుకుందా..?
జీహెచ్ఎంసీ, జలమండలి అధికారుల నిర్లక్ష్యమే చిన్నారిని బలితీసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 15 రోజుల కిందట ఇక్కడ సీసీ రోడ్డు నిర్మాణ పనులను జీహెచ్ ఎంసీ అధికారులు మొదలు పెట్టారు. రోడ్డు నిర్మాణం కోసం పాత రోడ్డును తవ్వారు. తర్వాత జలమండలి అధికారు లు డ్రయినేజీ పైప్ లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉందని చెప్పారు. దీంతో అప్పటి నుంచి పనులు ఆగిపోయాయి. కళాసిగూడ స్కూలు వద్ద నాలాపై స్లాబు ఉంది. గతంలో ఉన్న సీసీ రోడ్డు ను తవ్వడంతో నాలా స్లాబుకు రంధ్రం ఏర్పడింది. జీహెచ్ ఎంసీ అధికారులు ఈ రంధ్రాన్ని పెద్దగా పట్టించు కోలేదు. అది లోతట్టు ప్రాంతం కావడం, అక్కడ ఉండే మ్యాన్ హౌల్లో చెత్త అడ్డుపడటంతో శనివారం కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దాంతో ఆ రంధ్రం కనిపించక బాలిక అందులో పడి నాలాలో కొట్టుకుపోయింది. కాగా ఈ ఘటనను సీరియస్గా తీసు కున్న జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఏఈ తిరుమలయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ బీఎం హరికృష్ణను సస్పెండ్ చేస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పది రోజుల్లో సమగ్ర మైన నివేదిక ఇవ్వాలని ఈఈ ఇందిరాభాయిని ఆదేశించారని తెలిసింది.