Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు విజయం
నవతెలంగాణ-ఐడిఏబొల్లారం
సంగారెడ్డి జిల్లాలోని ఖాజీపల్లి పారశ్రామిక వాడలో గల టీఐడీసీ పరిశ్రమలో శనివారం జరిగిన కార్మిక సంఘాల ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి సీఐటీయూ జయకేతనం ఎగురవేసింది. బీఎంఎస్ తరఫున ఎమ్మెల్యే రఘునందన్‌రావు, సీఐటీయూ తరఫున ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పోటీపడ్డారు. పరిశ్రమలో మొత్తం 173 ఓట్లు ఉండగా.. రెండు ఓట్లు పోలు కాలేదు. మిగిలిన వాటిలో రఘునందన్ రావు కు 84 ఓట్లు రాగా.. చుక్క రాములుకు 87 ఓట్లు పోలయ్యాయి. మూడు ఓట్ల మెజార్టీతో రఘునందన్‌రావుపై చుక్క రాములు విజయం సాధించారు. ఈ సందర్భంగా పరిశ్రమ వద్ద జరిగిన ఊరేగింపు ప్రదర్శన అనంతరం చుక్కా రాములు మాట్లాడుతూ.. కార్మికులకు సీఐటీయూతోనే న్యాయం జరగుతుందన్నారు. కార్మికులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. హామీలన్నీ అమలుకు కృషి చేస్తామన్నారు. కార్మికులు మంచి విజయాన్ని అందించారని, ప్రత్యర్థి వాళ్ళు డబ్బులు పంచినా, మందు తాగించినా.. చివరికి సీఐటీయూనే గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, ఉపాధ్యక్షులు కే.రాజయ్య, టీఐడీసీ నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్, చంద్రశేఖర్, వేణుగోపాల్, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, యాదయ్య, ఇతర నాయకులు వి.ఎస్ రాజు, మధుసూదన్ రెడ్డి, శ్రీధర్‌రావు, సంతోష్ గౌడ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, టీఐడీసీ పరిశ్రమలో విజయాన్ని పురస్కరించుకుని సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకుని కార్మికులు సంబురాలు జరుపుకున్నారు.