Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థుల సత్తా
- తెలంగాణకు చెందిన సింగరాజు వెంకట కౌండిన్య టాపర్
- టాప్ టెన్‌లో నలుగురు మన విద్యార్థులే
- మహిళల్లో కర్నాటకకు చెందిన మహేశ్వరి ప్రథమం
- నేటినుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు షురూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో ఎన్ఐటీల్లో ప్రవేశం, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 43 మంది విద్యార్థులు వంద ఎన్టీఏ స్కోర్ సాధించారు. ఇందులో తెలంగాణ వారు 11 మంది, ఏపీ వారు ఐదు మంది కలిపి మొత్తం 16 మంది విద్యార్థులున్నారు. టాప్‌టెన్‌లో నలుగురు తెలుగు విద్యార్థులే ఉండడం గమనార్హం. తెలంగాణకు చెందిన సింగరాజు వెంకట కౌండిన్య 300కు 300 మార్కులు సాధించి జాతీయస్థాయిలో టాపర్‌గా నిలిచారు. ఏపీకి చెందిన కల్లకూరి సాయినాథ్ శ్రీమంత్ రెండో ర్యాంకు, తెలంగాణకు చెందిన నందిపాటి సాయి దుర్గారెడ్డి ఆరో ర్యాంకు, ఏపీకి చెందిన పునుమల్లి లోహిత్ ఆదిత్య పదో ర్యాంకు సాధించారు. మహిళల కేటగిరీలో కర్నాటకకు చెందిన రిధి కమలేష్ కుమార్ మహేశ్వరి టాపర్‌గా నిలిచారు. ఓబీసీ కేటగిరీలో అల్లం సుజరు, ఎస్సీ కేటగిరీలో దేశాంక్ ప్రతాప్‌సింగ్, ఎస్టీ కేటగిరీలో ధీరావత్ తనుజ, వికలాంగుల కేటగిరీలో దీపెన్ సోజిత్ర ప్రథమ స్థానంలో ఉన్నారు. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జనవరి 24, 25, 29, 30, 31తోపాటు ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్వహించారు. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ ఆరు నుంచి 15వ తేదీ వరకు జరిగాయి. దేశవ్యాప్తంగా 11,62,398 మంది దరఖాస్తు చేస్తే, 11,13,325 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇందులో పేపర్-1 రాతపరీక్షలకు 9,31,510 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే, వారిలో 8,83,372 (94.83 శాతం) మంది హాజరయ్యారు. జేఈఈ మెయిన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2.50 లక్షల మంది విద్యార్థులను అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. ఈ ఏడాది జనరల్‌లో 98,612 మంది, వికలాంగులు 2,685 మంది, ఈడబ్ల్యూఎస్‌లో 25,057 మంది, ఓబీసీల్లో 67,613 మంది, ఎస్సీల్లో 37,536 మంది, ఎస్టీల్లో 18,752 మంది కలిపి మొత్తం 2,50,255 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆన్లైన్లో ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్లకు తుది గడువు వచ్చేనెల ఏడో తేదీ వరకు ఉన్నది. వచ్చేనెల ఎనిమిదో తేదీ వరకు ఫీజు చెల్లింపునకు గడువున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్ష జూన్ నాలుగో తేదీన నిర్వహించనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. తెలంగాణలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్‌తో మొత్తం 13 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో 22 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి.
బాంబే ఐఐటీలో చేరతా : కౌండిన్య, టాపర్
'నాకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాన్ని సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందన్న నమ్మకముంది. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సులో చేరతాను.'అని జేఈఈ మెయిన్ టాపర్ సింగరాజు వెంకట కౌండిన్య చెప్పారు.