Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీలు లేక తూకం ఆపేస్తున్న నిర్వాహకులు
- తరుగు పేర క్వింటాల్‌కు 15 కిలోల కోతపై ఆగ్రహం
నవతెలంగాణ-నాంపల్లి/ బెజ్జంకి
అకాల వర్షాలు.. కేంద్రాల్లో టార్పాలిన్లూ అందుబాటులో లేవు.. వాతావరణంలో మార్పులతో వర్షం ఎప్పుడు వస్తుందోనన్న ఆందోళనతో రైతులు ఉంటే.. తూకాలు వేయకుండా నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో కడుపు మండిన అన్నదాతలు రోడ్డెక్కారు. లారీలు లేవంటూ తూకం ఆపేయడం.. తరుగు పేర భారీగా కోత విధిస్తుండటాన్ని నిరసిస్తూ నల్లగొండ, సిద్దిపేట జిల్లాల్లో శనివారం ధర్నా రేశారు.
నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం ఆపేయడంపై మార్కెట్‌యార్డు ఎదుట నాంపల్లి-హైదరాబాద్ ప్రధానరోడ్డుపై రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. నాలుగైదు రోజులుగా తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో గురువారం నుంచి కాంటాలు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
లారీలు లేవని ధాన్యం కొనుగోళ్లు జరపకపోవడం అన్యాయమన్నారు. లారీలు పంపించాలని పీఏసీఎస్ చైర్మెన్ గట్టుపల్లి నర్సిరెడ్డి నాలుగైదు రోజులుగా జిల్లా అధికారులతో మాట్లాడుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన కూడా రైతులకు మద్దతుగా రోడ్డుపై బైటాయించి ధర్నాలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ రావుల నాగరాజు తన సిబ్బందితో ధర్నా ప్రదేశానికి చేరుకొని జిల్లా అధికారులతో మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం వరకు లారీలు పంపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూలవెంకటయ్య, పీఏసీఎస్ డైరెక్టర్లు వెంకట్‌రెడ్డి, సతీష్, బిరుదోజు యాదమ్మ, గాదేపాక రాజు, పూల యాదగిరి, రైతులు పాల్గొన్నారు.
రైస్ మిల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం
రైస్‌మిల్లు యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామ రైతులు రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు. సుమారు గంటపాటు రహదారిపై భారీగా వాహనాలు నిలిచాయి. దేవక్కపల్లిలోని ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి కేటాయించిన తోటపల్లి శివారులోని శ్రీలక్ష్మి రైస్ మిల్ యాజమాన్యం తూకం పేరుతో నిలువు దోపిడీ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు తరుగు పేరున 15 కిలోల కోత విధించడానికి అంగీకరిస్తేనే ధాన్యం సేకరిస్తామని లేదంటే వెనక్కి పంపిస్తున్నారని రైతులు అన్నారు. రైతులకు అన్యాయం చేస్తున్న రైస్‌మిల్ యాజమాన్యంపై సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ విజయ ప్రకాశ్‌రావు, ఎస్ఐ ప్రవీణ్‌రాజ్ ఘటనాస్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ కిసాన్ మోర్చా కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఒంటేల సంపత్ రెడ్డి, రావుల రామక్రిష్ణ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.