Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంటాలు వేసినా..రవాణా కావట్లేదు
- రోజుల తరబడి ఎదురుచూసినా లారీలు రావట్లేదు..!
- మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు
- అకాల వర్షాలతో అన్నదాత ఆందోళన
ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలు ప్రారంభించి పక్షం రోజులవుతున్నా కొనుగోళ్లు మాత్రం ఊపందుకోవడం లేదు. ఓవైపు అకాల వర్షాలు వెంటాడుతుండటంతో రైతుల్లో ఆందోళన అలుముకుంటోంది. రాశుల కొద్దీ ధాన్యం కేంద్రాల్లో ఉన్నా కొనుగోళ్లు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. కొనుగోలు చేసిన వడ్లను సైతం వెంటనే తరలించే పరిస్థితి లేదు. ధాన్యం కేంద్రానికి తెచ్చినప్పటి నుంచి మిల్లులకు చేర్చే వరకు రైతులదే బాధ్యత అనే నిబంధన ఉంది. ఈ ప్రక్రియలో ఏ కొద్ది జాప్యం జరిగినా ఆరుగాలం కష్టం వర్షం పాలయ్యే అవకాశం ఉండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కాంటాలు వేసిన ధాన్యాన్ని సైతం లారీలు లేక తరలించడం లేదు. ఈ క్రమంలో చాలా చోట్ల ధాన్యం రాశులు తడిసి వడ్లు నీటిలో కొట్టుకు పోవడంతో అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు.
మందకొడిగా కొనుగోళ్లు.. రవాణా
రాష్ట్రవ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మిల్లుల్లో భారీగా నిల్వలు ఉండటంతో మిల్లర్లు సకాలంలో దిగుమతికి సహకరించట్లేదు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలు ఇలా అన్నిచోట్లా ఇదే పరిస్థితి. ఓవైపు అదనపు కలెక్టర్లు ట్రేడర్లు, మిల్లర్లు, అధికారులతో సమావేశాలు నిర్వహి స్తున్నా ఎలాంటి పురోగతీ కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 200 కేంద్రాలు ప్రారంభించారు. వీటిలో సుమారు 1100 మంది రైతుల నుంచి 15వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేశారు. పది వేల లోపు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు చేర్చారు. ఇంకా మూడు నుంచి ఐదువేలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రాల్లో నిల్వ ఉందని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. కానీ ఇంకా అధిక మొత్తంలోనే నిల్వ ఉండే అవకాశం ఉంది. రవాణా కోసం ఐదువేలు, కొనుగోళ్ల కోసం మరో ఐదువేల మెట్రిక్‌టన్నుల ధాన్యం నిల్వ ఉండటం.. కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటాన్ని సూచిస్తోంది.
మిల్లుల వద్ద నిరీక్షణ...'లారీల' నిరాకరణ
ధాన్యం లోడుతో వెళ్లిన లారీలు దిగుమతులు లేక రోజుల తరబడి మిల్లుల వద్ద నిరీక్షించాల్సి వస్తుంటంతో యజమానులు వడ్లకు వాహనాన్ని పెట్టేందుకు నిరాకరిస్తున్నారు. ఓవైపు రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారు. వారు పై అధికారులకు ఈ విషయాన్ని చేరవేసినా..
వారు మిల్లర్లతో మాట్లాడుతున్నా ఫలితం ఉండటం లేదు. ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోతోందని రైతాంగం వాపోతోంది. ఈ విషయమై పలుచోట్ల రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరికి ఆయా పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. 15 రోజుల్లో పాలేరు కేంద్రం నుంచి నాలుగు లోడ్లు ఎత్తారు. ఐదురోజులుగా లారీలు తిరిగి రావట్లేదని రైతులంటున్నారు. ఈ కేంద్రం నుంచి కూసుమంచి, నర్సింహులగూడెం మిల్లులకు లారీలు వెళ్లాయి. దిగుమతి లేకపోవడంతో ఖమ్మం తరిలిస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం గమన్హాం.
తూకం వేసినా అక్కడే..
బీరెల్లి సుధాకర్, మల్లాయిగూడెం, కూసుమంచి
మొత్తం 12 ఎకరాల వరి సాగు చేశా. కోతలు కోసి నెలరోజులైంది. పాలేరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐదురోజుల కిందట వడ్లు కాంటా పెట్టారు. లారీలు రావట్లేదని.. వాటిని రవాణా చేయట్లేదు. ధాన్యం మిల్లుకు చేరే వరకు రైతుదే బాధ్యతనే నిబంధన ఉండటంతో ఇక్కడే ఉండాల్సి వస్తోంది. ఎప్పుడు అకాల వర్షం వస్తదో.. యాడ ఆగమైతనోనని ఆందోళనగా ఉంది. అమ్మినంక కూడా ఆవేదన తప్పేటట్టు లేదు. రవాణా సాగట్లేదని ఎమ్మెల్యేకు ఫోన్ చేశా. ఆయన నేను మాట్లాడతా అన్నారు. ఏమైందోగానీ ఐదు రోజుల నుంచి నా వడ్లు మాత్రం కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. ఒకటి గాదు.. రెండుగాదు 350 బస్తాలు కేంద్రంలో ఉన్నాయి. అకాలవర్షం వస్తే నేను, నా భార్య ఏమి చేయగలుగుతాం. ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
బొంతు రాంబాబు, తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి
రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎప్పటి ధాన్యం అప్పుడు రవాణా చేయాలి. కొనుగోళ్లు వెనువెంటనే చేస్తుండాలి. ఓవైపు అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. ఆరుగాలం కష్టం ఎక్కడ వర్షార్పణం అవుతుందేమోనన్న ఆందోళన రైతుల్లో ఉంటుంది. కాబట్టి కొనుగోళ్లు, రవాణా, దిగుమతి ఇవన్నీ సకాలంలో జరగాలని తెలంగాణ రైతుసంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి.
లారీల నుంచి వెంటనే దిగుమతి చేసుకోవాలి
ఎన్.మధుసూదన్, అదనపు కలెక్టర్, ఖమ్మం
లారీల నుంచి వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. రవాణా పరంగా జాప్యం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
ఒక్కో కొనుగోలు కేంద్రంలో ఐదువేలకు పైగా బస్తాలు
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో కొనుగోలు కేంద్రంలో ఐదువేలకు పైగా బస్తాలు కొనుగోళ్ల కోసం ఉన్నాయి. వరి అధికంగా పండించే ప్రాంతాల్లోనైతే పదివేలకు పైగా బస్తాలు నిల్వ ఉన్నాయి. కూసుమంచి మండలం పాలేరు ఐకేపీ కేంద్రంలోనైతే పదివేల బస్తాలు మూడురోజులుగా కొనుగోళ్లు లేకుండా ఉంటున్నాయి. ఈ కేంద్రాన్ని ఈనెల 16వ తేదీన స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ప్రారంభించారు. 22వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటి వరకు రెండువేల బస్తాలను మాత్రమే కొన్నారు. కోతలు దాదాపు పూర్తవడంతో భారీ మొత్తంలో ధాన్యం కేంద్రానికి వస్తోంది. కానీ రవాణా లేకపోవడంతో కొనుగోళ్లు ముందుకు కదలట్లేదు. ఇప్పటికీ మూడు రోజులుగా ఈ కేంద్రం నుంచి ఒక్క గింజను కూడా రవాణా చేయలేదు.