Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ:8 గంటల పనివిధానం కోసం యాజ మాన్యాలకు వ్యతిరేకంగా చికాగో నగరంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆనాడు పోలీసుల కాల్పుల్లో మరణించిన కార్మికుల నెత్తురుతో తడిసిన జెండానే ఎర్ర జెండా. మేడే పోరాట స్ఫూర్తితో కార్మికులు ముందుకు సాగాలి. స్వాతంత్య్రానికి ముందే పోరాడి సాధిం చుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నది. మోడీ సర్కారు 44 కార్మిక చట్టాలను సమూలంగా మార్చేసి పెట్టుబడిదారులకు, యాజమాన్యాలకు అనుకూలంగా విధానాలు తీసుకొస్తున్నది. కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తున్నది. నాలుగు కోడ్లను వెంటనే రద్దు చేసి మోటారు రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఒక సమగ్ర చట్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల వివక్ష చూపుతున్నది. లక్షలాది మంది కార్మికులకు లబ్ది చేకూర్చే కనీస వేతనాల జీవోలను కేసీఆర్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. అసంఘటిత, సంఘటిత రంగాల్లో కార్మికుల హక్కుల కోసం పోరాడుతాం.
- ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బాలరాజ్
మోడీ నిర్బంధాన్ని ప్రతిఘటించాలి
కార్మికుల హక్కులు, స్వేచ్ఛ, సౌకర్యాలు, సమానత్వం, ఓటు హక్కు, దోపిడీ, పీడన, అణిచివేత, అన్యాయాలు, నిర్బంధం, నిరంకు శత్వం, నిరాదరణ అనేక సామాజిక అణిచివేతల నుంచి పుట్టిందే మేడే. బానిస బతుకుకు అంతిమ గీతం ఆలపించి గొంతెత్తిన రోజు మేడే. కార్మిక, కర్షక నవశక్తులకు కొత్త శక్తి అందించిన రోజు మేడే. చికాగో పోరాట వీరుల రక్తంతో ఎగిరిన పోరాట ఎర్రజెండా పీడిత కార్మిక వర్గానికి దిశా నిర్దేశాన్నిచ్చింది, అండగా నిలిచింది. ఎనిమిది గంటల పని విధానం నుంచి అనేక హక్కులను, చట్టాలను సాధించిపెట్టింది మేడే. పోరాడి సాధించుకున్న ఈ హక్కులను, చట్టాలను, స్వేచ్ఛను, సౌకర్యాలను మోడీ ప్రభుత్వం హరించివేస్తున్నది. 137వ మేడే స్ఫూర్తితో కాంట్రాక్టీకరణ, ఔట్ సోర్సింగ్, స్కీమ్ వర్కర్ల రెగ్యుల రైజేషన్ కోసం కొట్లాడాలి. నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం ఉద్యమించాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీ కరణను ఆపాలి. కార్మిక వర్గ ఐక్యతను కాపాడాలి.
- ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ జనార్ధన్
నాలుగు లేబర్ కోడ్లను నిలిపేయాలి
ప్రాణత్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను కాలరాసే అధికారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేదు. రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కులను కాలరాయడానికి వారెవ్వరు? కార్మిక వర్గ హక్కులను అణచాలని చూస్తే కార్మికవర్గ పోరాటాలు కూడా అంతే తీవ్ర స్థాయిలో వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర సర్కారు కూడా కార్మికుల పట్ల చిన్నచూపే చూస్తు న్నది. షెడ్యూల్ పరి శ్రమల జీవోలను విడు దల చేయడంలో తాత్సా రం చేస్తున్నది. కాంగ్రెస్ హయాంలో విడుదల చేసిన జీవోలే అమలవుతున్నాయి. వెంటనే కొత్త జీవోలను తీసుకొచ్చి కనీస వేతనాలను అమలు చేయాలి. వ్యవసాయ, గ్రామీణ, పారిశ్రామిక కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలి. ప్రత్యేక చట్టం ద్వారా కనీస వేతనాలకు భద్రత కల్పించాలి. మేడే స్ఫూర్తితో కార్మికులు మరింత చైతన్యమై తమ హక్కుల కోసం పోరాటాల్లోకి రావాలి.
- ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డీ.చంద్రశేఖర్
ఆర్థిక వ్యవస్థ మూలస్తంభాలను మోడీ సర్కారు కూల్చేస్తున్నది
ప్రభుత్వ రంగ సంస్థలు మన దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవటానికి ఎంతో దోహద పడ్డాయి. సామాజిక న్యాయం జరగటానికీ ఉపయోగ పడ్డాయి. మూలస్తం భాల్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు అమ్మేస్తున్నది. ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరం. అనేక పోరాటాల ఫలితంగా పారిశ్రామిక వివాదాల చట్టం మొదలుకొని కార్మిక, ఉద్యోగుల హక్కుల కోసం 44 కార్మిక చట్టాలు వచ్చాయి. నేడు వాటిని బీజేపీ సర్కారు నాలుగు కోడ్లుగా మార్చి కార్మికులు, ఉద్యోగుల హక్కులను హరిస్తున్నది. మేడే అంటేనే 8 గంటల పనివి ధానాన్ని సాధిం చుకున్న దినం. నేడు మోడీ సర్కారు దానికి తూట్లు పొడిచి 12 పని దినాన్ని పార్లమెంట్లో ఆమోదించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. కార్మిక సంక్షేమం కోసం అనేక పథకాలను గత కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా స్పష్టంగా ఉండేది. మోడీ సర్కారు వచ్చాక కొంత అమౌంట్ ఇచ్చి మిగతాదంతా రాష్ట్రాలే భరించాలనే నెపంతో భారం మోపుతున్నది. ఇది దుర్మార్గం. సింగరేణిని అదానీకి కట్టబెట్టే కుట్రకు పూనుకున్నది. మేడే స్ఫూర్తితో మోడీ సర్కారు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుతాం.
- భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ)
రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబుయాదవ్
మేడే స్ఫూర్తితో పోరాడుతాం
కార్మిక వర్గానికి కనీస వేతనాల పెంపు, సామాజిక భద్రత, పనిగంటల తగ్గింపు కోసం మేడే స్ఫూర్తితో పోరాడుతాం.1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని కోసం కార్మికవర్గం పోరాడి విజయం సాధించింది. ఎంతో మంది కార్మికులు తమ రక్తాన్ని ధారపోశారు. వారి పోరాట ఫలితంగానే 8 గంటల పనివిధానం ఇన్నేండ్లు అమలైంది. నేటి కాలంలో కార్మిక వర్గం నాలుగు గంటలు పనిచేస్తే చాలు బతకగలిగేలాగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం నేడు అందుబాటులో ఉంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 12 గంటల పనిని అమలు చేసి యజమాన్యాలకు అధిక లాభాలు గడించి పెట్టేందుకు తహతహలాడుతున్నాయి. 24 గంటలు దుకాణాలు, షాపులు తెరుచుకోవచ్చనే నిబంధనలు తీసుకురావడం ఈ సభ్య సమాజానికే సిగ్గుచేటు. పాలకవర్గాలు నిస్సిగ్గుగా పారిశ్రామికవేత్తలకు, కంపెనీ యాజమాన్యాలకు సేవ చేసే లక్ష్యంతో అనేక సంస్కరణలు తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్మిక వర్గం హక్కుల భద్రత కోసం, మెరుగైన జీవితాల కోసం కార్మికులు పెద్ద సంఖ్యలో పోరాటాల్లోకి రావాలి.
- కె.సూర్యం, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే లేబర్ కోడ్లు
'మోడీ 2014లో అధికారం చేపట్టిన తర్వాత కార్మికవర్గం మీద దాడిని ముమ్మరం చేశారు. కార్మికుల హక్కులను హననం చేశారు. పోరాడి సాధించుకున్న హక్కు లను కాలరాయడంలో భాగంగానే నాలుగు లేబర్ కోడ్లను తెచ్చారు. బడా కార్పొ రేట్ శక్తులకు అనుకూలంగా ఈ దేశ కార్మికవర్గానికి భంగం కలిగేలా నిబంధనలు రూపొందించారు. పోరాడి సాధిం చుకున్న చట్టాలను కార్పొ రేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తు న్నారు. లేబర్ కోడ్ల ప్రకారం యూనియన్లను ఏర్పాటు చేసుకునే హక్కు లేదు. సమ్మె చేసే హక్కు కూడా లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు భరోసా లేదు. సామాజిక భద్రత లేకుండా పోతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎనిమిది గంటలకు బదులుగా 12 గంటల పనివిధానాన్ని అమలు చేస్తున్నారు. కార్మికులను అణచివేసేందుకు యాజమాన్యాలకు సంపూర్ణ మైన అధికారాలిచ్చారు. ఇవన్నీ అత్యంత ప్రమాదకరం. లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి. ప్రభుత్వరంగాన్ని పరిరక్షించాలి. తెలంగాణలోనూ కార్మికవర్గ వ్యతిరేక విధానాలనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. 74 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోను సవరించి అమలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించాలి.
- ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్