Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల,మతాలకతీతంగా కార్మికులు సంఘటితమవ్వాలి
- ప్రభుత్వరంగ ధ్వంసమంటే సామాజిక న్యాయం దెబ్బతిన్నట్టే
- 12 గంటల పని అంటే తీవ్ర ఒత్తిడే..అనారోగ్యాల పాలే
- కనీసవేతనాల జీవోలు విడుదల చేయాలి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
'కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో కార్మికవర్గంపై దాడి తీవ్రమైంది. పరిస్థితులూ వేగంగా మారుతున్నాయి. కార్పొరేట్ల మేలు కోసం లేబర్కోడ్లను తీసుకొచ్చి హక్కులను హరించి వేస్తున్నారు. మరోవైపు సామాజిక అణచివేత తీవ్రమవుతున్నది. సమస్యల్ని పక్కదోవ పట్టించేందుకు కులమతాల పేరుతో ఏలికలు విభజన చిచ్చు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆర్థిక పోరాటాలే కాదు..సామాజిక పోరాటాలూ ముఖ్యమే. కార్మికువర్గమంతా కుల, మతాలకతీతంగా సంఘటితం కావాలి. 12 గంటల పనికి వ్యతిరేకంగా పోరాటాల్లోకి రావాలి. దేశభక్తులంతా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకు నేందుకు ముందుకు రావాలి. బీజేపీపై పోరుకు దిగిన కేసీఆర్‌కు కార్మికవర్గం మద్దతు దక్కాలంటే రాష్ట్రంలో కోటి మంది కార్మికులకు మేలు చేసే కనీస వేతనాల జీవోలను తక్షణమే విడుదల చేయాలి. బీజేపీలాగా తాము యాజమాన్యాల మేలు కోసం పనిచేయం..కార్మికవర్గం మేలు కోసం పనిచేస్తామనే చిత్తశుద్ధిని సీఎం కేసీఆర్ నిరూపించుకోవాలి' అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అన్నారు. మేడే సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
12 గంటల పనివిధానం, 24ఞ7 షాపులకు అనుమతి ప్రభావం కార్మికుల మీద ఏ విధంగా ఉండబోతున్నది?
ఇది మేడే స్ఫూర్తికి విరుద్ధం. 8 గంటల పనివిధానం పోరాడి సాధించుకున్న హక్కు. పాలకులు పనిగంటలు పెంచేందుకు చట్టాలను సవరిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 12 గంటల పనివిధానం అమలవుతున్నది. దీనివల్ల శ్రమదోపిడీ, పనిభారం పెరుగుతుంది. ఇది తక్కువ మంది కార్మికులతో ఎక్కువ మంది చేసే పనిని చేయించుకుని అధిక లాభాలు గడించే కుట్ర. దీనివల్ల ఉపాధి అవకాశాలు తగ్గి నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుంది. కంటిన్యూగా 12 గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. పనిప్రదేశాల్లో సౌకర్యాలు, భద్రత లేని పరిస్థితుల్లో ఎక్కువ పని గంటల చేయడం ప్రమాదకరం. 24+7 దుకాణాలకు అనుమతించడం అంటే కార్మికులతో వెట్టి చేయించడమే. దీని వల్ల జరిగే నష్టాన్ని కార్మికులకు అర్థమయ్యేలా చెబుతున్నాం. 8 గంటల పనివిధానం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం.
ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే ఏమిటి? సామాజిక ఉద్యమాలను ఏవిధంగా ముందుకు తీసుకెళ్తున్నారు?
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక అంశాలనే తీసుకుని ముందుకెళ్లటం సరిగాదు. మనిషిని ఆర్థిక అంశాలే కాకుండా భాష, కట్టుబాట్లు, సాంఘిక, సాంస్కృతిక అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఆచారవ్యవహారాలు, కట్టుబాట్లు, జీవన విధానమే సంస్కృతి. సంస్కృతి పేరుతో ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు సెంటిమెంట్‌ను ముందుకు తీసుకొస్తున్నారు. ఇక్కడ కులం, మతం ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. విశ్వాసాలను పాలనలో జొప్పిస్తున్నారు. ఇది ప్రమాదకరం. ఆపదలో ఉన్నప్పుడు కులం, మతం అనే తేడా లేకుండా కార్మికులు ఒకరికొకరు సహకరించేలా చైతన్యపరుస్తున్నాం. ఇది ప్రాథమికస్థాయిలోనే ఉంది. దీన్ని మరింత విస్తృతం చేయాల్సిన బాధ్యత ట్రేడ్ యూనియన్లపై ఉంది. సామాజికంగా మనుషులందరూ సమానమే. కులవివక్షను అడ్డుకోవడం, స్త్రీ, పురుషుల సమానత్వాన్ని సాధించడం, లౌకికవిధానాన్ని కాపాడటం, శ్రమ సంస్కృతిని ముందుకు తీసుకురావటం అనేదానిపై దృష్టిసారించాం. రణదివే, ఫూలే, అంబేద్కర్, వంటి వ్యక్తులు సామాజిక చైతన్యం కోసం చేసిన కృషిని విడమరుస్తూ ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 14 వరకు వారోత్సవాలను నిర్వహించాం. ఆర్థిక, సామాజిక వివక్షలకు, దోపిడీకి వ్యతిరేకంగా జమిలి పోరాటాలే మా ముందున్న మార్గం.
కనీసవేతనాల జీవో విడుదల అంశం చర్చనీయాంశంగా ఉంది కదా దీనిపై మీరేమంటారు?
పెరిగిన ధరలు, ఇంటి అద్దెలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ ఎంప్లాయీమెంట్స్‌లో వేతనాలు సవరించాలి. తెలంగాణ వచ్చి తొమ్మిడేండ్లవుతున్నా జీవోలను విడుదల చేయడం లేదు. కోటి మంది కార్మికుల సమస్యపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించడం లేదు. పైగా, పొరుగు రాష్ట్రాల కంటే ఇక్కడే వేతనాలు ఎక్కువున్నాయనీ, పెంచితే పరిశ్రమలు పక్కరాష్ట్రాలకు తరలివెళ్తాయని సాకు చెప్పటం తగదు. కార్మికుల ప్రయోజ నాలను బలిపెట్టడం సరిగాదు. శ్రమదోపిడీకి అనుమతిచ్చి పరిశ్రమలు నడిపించు కోవాలని ప్రభుత్వమే చెప్పటం ఎంత వరకు సముచితమో ఆలోచించాలి. కార్మికులకు రోజువారీ వేతనం రూ.178 ఇస్తే సరిపోతుందని మోడీ సర్కారు ప్రకటించింది. దీనిని సాకుగా చూపి యాజమాన్యాలు వేతనాలు పెంచడం లేదు. బీజేపీపై రాజకీయ పోరులో గెలవాలంటే కేసీఆర్‌కు కార్మికవర్గం మద్దతు అవసరం. దీన్ని ఆయన గుర్తించాలి. కోటిమంది కార్మికులకు మేలు చేసే జీవోలను విడుదల చేయాలి. లేనిపక్షంలో ఐక్య పోరాటాలు చేస్తాం.
ప్రభుత్వ రంగ సంస్థల మీద కేంద్రం దాడి ప్రభావం తెలంగాణ మీద ఏ విధంగా ఉంది?
ఆ ప్రభావం తెలంగాణపై కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. సింగరేణి ప్రయివేటీకరణపై కేంద్రం కన్ను పడింది. ఇప్పటికే హైదరాబాద్‌లో, దాని చుట్టుపక్కల ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్డర్లు తగ్గాయి. కేంద్రంలోని మోడీ సర్కారు అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ల మేలు కోసం పనిచేస్తున్నది. ఈ విధానాలు దేశ భవిష్యత్తుకే ప్రమాదకరం. డీఆర్డీఓ, మెదక్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ధ్వంసం అవుతున్నది. ప్రభుత్వ రంగం ధ్వంసం కావడమంటే సామాజిక న్యాయం దెబ్బతిన్నట్టే. ఆర్థిక స్వావలంబన కూడా దెబ్బతింటుంది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడమంటే ప్రజల ఆస్తులను కాపాడుకోవడమే. నిజమైన దేశ భక్తులంతా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు ముందుకు రావాలి.
రాష్ట్రంలో వలస కార్మికుల పోరాటాల పరిస్థితేంటి?
వలస కార్మికుల బతుకులు దుర్భరంగా ఉన్నాయి. తెలంగాణలో పరిశ్రమలు, నిర్మాణరంగం, వ్యవసాయ రంగంలోని తీరుతెన్నులను పరిశీలిస్తే అన్ని రకాల పనుల్లోనూ వలస కార్మికులు కనిపిస్తున్నారు. చివరకు సేవా రంగాల్లోనూ విస్తరించారు. ప్రత్యేకంగా హిందీ పాలిత ప్రాంతాల నుంచి ఈ వలసలెక్కువగా ఉన్నాయి. వారి నివాస ప్రాంతాలు చాలా దుర్భరంగా ఉంటున్నాయి. అతితక్కువ వేతనా లతో దీనావస్థల్లో జీవనం గడుపుతున్నారు. తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. యాజమాన్యాలు వారిని కార్మిక సంఘాలవైపు కూడా చూడనివ్వడం లేదు. చేరనియ్యటం లేదు. వారిని ఆర్గనైజ్ చేయడంలో భాష ఒక సమస్యగా మారింది. వలస కార్మికులను సంఘటితం చేయడంలో సీఐటీయూకృషి మరింత పెరగాల్సిన అవసరం ఉంది.
మేడే సందర్భంగా కార్మికులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి?
బీజేపీ ప్రభుత్వం ఉన్న కార్మిక చట్టాలను తొలగిస్తున్నది. పోరాటం చేయకుంటే హక్కులు నిలబడని పరిస్థితి. హక్కుల కోసం పోరాడటమే మేడే స్ఫూర్తి. రాబోయే రోజుల్లో కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా కార్మికులు సంఘటితం కావాలని పిలుపునిస్తున్నాం. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా మరిన్ని పోరాటాలు రావాలి. బీజేపీ ప్రజల మధ్య మతం ప్రాతిపదికన చీలికలు తెస్తున్నది. దీని ప్రభావం కార్మికవర్గంపైనా ఉంది. మరోవైపు లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులను హరి స్తున్నది. అందుకే బీజేపీని ఓడించాలి. రాబోయే కాలంలో రాజకీయంగానూ కార్మికులు ఆలోచించాలి. దేశ సంపదను, లౌకికతత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవాలి. దీనికన్నింటికీ కార్మికుల ఐక్యపోరాటాలే శరణ్యం.