Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరుగుజ్జుల్లారా..పున:నిర్మాణమంటే ఇదీ..
- ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు..!!
అభివృద్ధిలో నా తెలంగాణ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిందనీ,అది మరుగుజ్జులకు కనిపించకపోతే తానేం చేయలేనని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. 'రాష్ట్ర పరిపాలనకు గుండెకాయగా, అత్యంత శోభాయమానంగా నిర్మించిన సచివాలయం నా చేతుల మీదుగా ప్రారంభించడం నా జీవితంలో దొరికిన గొప్ప అదష్టంగా భావిస్తున్నా' అని అన్నారు.సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని కొనియాడారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలు కూడా వెలిగిపోతున్నాయని చెప్పారు.
- వైభవంగా సచివాలయం ప్రారంభోత్సవం
- కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఫైలుపై తొలి సంతకం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణకు తలమానికమైన, దేశానికి దిక్సూచిగా నిలిచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అత్యంత వైభోవేతంగా ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా వేదపండింతులు పలు క్రతువులు నిర్వహించారు. ఈ సందర్భంగానే తన పరిపాల నపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాల నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ సచివాలయంలోని ఆరో అంతస్తులోని తన ఛాంబర్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైలుపై తొలి సంతకం చేశారు. మంత్రులు కూడా తమ శాఖలకు చెందిన కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడా రు. 'తెలంగాణ అవతరణకు ముందు అనేక వాదోపవాదాలు, అనేక చర్చలు చూశాం. తెలం గాణ అవతరించిన తర్వాత కూడా పున:నిర్మాణం కోసం అంకితభావంతో అడుగులు వేసే సందర్భంలో కొందరు అర్భకులు తెలంగాణ భావాన్ని, అర్థాన్ని, పున:నిర్మాణ కాంక్షను జీర్ణించుకోలే ని పిచ్చివాళ్లు కారుకూతలు కూశారు. ''తెలంగాణ రాష్ట్ర పున:నిర్మాణమంటే ఏంటీ? ఉన్నయన్నీ కూలగొట్టి మళ్లీ కడ తారా? మొత్తం తెలంగాణనే కూలగొట్టి మల్ల కడతారా?'' అంటూ చిల్లర వ్యాఖ్యలు చేశారు. వాటిని పట్టించుకో కుండా ఈ రోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది నా తెలంగాణ అని గర్వంగా ప్రకటిస్తున్నా' అని సీఎం చెప్పారు.
మండు వేసవిలో మత్తడి దుంకే చెరువులే ...
పున:నిర్మాణం అంటే ఏంటో తెలియని మరుగుజ్జులకు నాలుగు మాటలు చెప్పదల్చుకున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. సమైఖ్య పాలనలో కాకతీయుల కాలం నాటి చెరువులన్నీ శిథిలమైనపోయాయన్నారు. జీవనదులు, వాటికి ఉపనదులున్నా గోదావరిలో డబ్బులు, రాగి నాణేలు వేద్దామంటే నీళ్లు ఉండేవి కావన్నారు. రామగుండ వద్డ బ్రిడ్డి మీద నుంచి నడిచి ఎక్కడైనా చిన్న గుంతల్లో నీళ్లు కనిపిస్తే వాటిని వేసేవాళ్లమని చెప్పారు. పున:నిర్మాణంలో భాగంగా నేడు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేశామనీ, ఆ ప్రాజెక్టు ప్రపంచానికే తలమానికంగా మారిందని చెప్పారు. వాగుల మీద నిర్మించిన చెక్‌డ్యామ్‌లూ గోదావరి, కష్ణ, మంజీర, మానేరు, హల్దీ, కూడవెళ్లి తదితర ఉప నదులపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లు ఏప్రిల్, మేలో కూడా మత్తడి దుంకుతున్నాయనీ, తెలంగాణ పున:నిర్మాణానికి భాష్యం ఇదేనని అన్నారు.
పున:నిర్మాణం అంటే ...
'ఆ నాడు నెర్రలుబారి నోళ్లువెల్లబెట్టిన లక్షలాది ఎకరాల తెలంగాణ బీడు భూములు నేడు నిండు నీటిపారుదలకు నోచుకొని పంట పొలాలై వెదజల్లుతున్న హరిత క్రాంతే తెలంగాణ పున:నిర్మాణం. ఈ యాసంగి పంటలో భారతదేశంలో ఉన్న వరి పైరు 94లక్షల ఎకరాలు. ఇందులో 56లక్షల ఎకరాలు తెలంగాణలో పండుతున్న దని నేను సగర్వంగా చెబుతున్నా. పున:నిర్మాణం అంటే ఒక కాళేశ్వరం... ఒక పాలమూరు ఎత్తిపోతల పథకం... ఒక సీతారామా ప్రాజెక్టు అని మనవి చేస్తున్నా. అర్ధరాత్రి కరెంటు పోయి.. ఎప్పుడు వస్తుందో తెలియక, పారిశ్రామిక వేత్తల ధర్నాలు, ప్రజల గగ్గోలు, జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లతో ఉన్న రాష్ట్రంలో నేడు అవన్నీ మాయమై జాజ్వల్యమానమైన కరెంటు వెలుగులతో విరాజిల్లుతున్నది తెలంగాణ. ఇదీ పున:నిర్మాణం అంటే. అర్ధరాత్రి కరెంటు పెట్టేందుకు వెళ్లి పొలాల దగ్గర కరెంటు షాకులతో నాడు పాములు, తేళ్లకాట్లతో చనిపోయిన రైతులు నేడు దినం పూటనే సాయంత్రం 6 గంటల వరకు పొలాలను పారించుకొని దర్జాగా ఇంటికి వచ్చి కంటినిండా నిద్రపోతున్నారు. ఈ తెలంగాణ రైతుల దర్పమే తెలంగాణ పున:నిర్మాణమని తెలియజేస్తున్నా' అని అన్నారు.
మిషన్ భగీరథ ప్రతీక
'గ్రామాలు, పట్టణాలు ఎంత అద్భుతంగా అలరాలు తున్నాయో, ఎన్ని అవార్డులు సొంతం చేసుకుంటున్నాయో మీ అందరికీ తెలుసు. క్షీణించిపోయి, పత్తాలేకుండాపోయి అగమైనపోయిన అడవులు నేడు హరితశోభను వెదజల్లు తున్నాయి. ఇదీ తెలంగాణ పున:నిర్మాణం అంటే. కోల్పో యిన అడవులను తిరిగి తెచ్చుకోడమే పున:నిర్మాణమని ఆ అర్భకులు, ఆ మరుగుజ్జులకు చెబుతున్నా. వలసపోయిన పాలమూరు కూలీలు మొత్తం తిరిగి వచ్చి వాళ్ల సొంత పొలాల గట్ల మీద కూర్చుంటే ఇతర రాష్ట్రాల కూలీలు తెలంగాణ పొలాల్లో పని చేస్తున్న దృశ్యాలే తెలంగాణ పున:నిర్మాణమని చెబుతున్నా. ఒకనాడు దాహంతో అల్లాడి, ఫ్లోరైడ్‌తో నడుం వంగి లక్షలాది మంది జీవితాలు కోల్పో యిన, కుమిలిపోయిన తెలంగాణలో మిషన్ భగరీథలో ఇంటింటికీ నీరందిస్తున్నాం. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏ నీళ్లు ఉంటయో.. ఆదిలాబాద్ గోండుగూడెంలో అదే నీరందిస్తున్న మిషన్ భగరీథ తెలంగాణ పున:నిర్మాణానికి ప్రతీక' అని కేసీఆర్ స్పష్టం చేశారు.
అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తెలంగాణ
'అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందున్నది. రాష్ట్రమేర్పడ్డప్పటి నుంచి తెలంగాణలో మత కల్లోలాలు లేవు. సమ్మిళిత అభివృద్ధితో ముందుకు పోతున్నాం. పారిశ్రామిక రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఐటీ విధానంలో బెంగళూరును దాటిపోతున్నాం. మురికి కూపాలుగా ఉన్న పట్టణాలను అభివద్ధి చేస్తున్నాం. పచ్చదనం, డంపుయార్డులతో, ఇంటి గ్రేటెడ్ మార్కెట్లతో పట్టణాలు, గ్రామాలు అభివద్ధి చెందు తున్నాయి. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లతో హైదరాబాద్ అభివద్ధి చెందుతున్నది. నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు నిర్మిస్తున్నాం. యాదాద్రి ఆలయ పున:నిర్మాణం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ప్రపంచంలో అభి వద్ధిని, పున:నిర్మాణానికి కొలమానంగా తీసుకునే సూచికలు రెండే రెండు ఒకటి తలసరి ఆదాయం. రెండో ది తలసరి విద్యుత్ వినియోగం. ఇవి నిజమైన అభివద్ధి సంకేతాలు. తలసరి ఆదాయంలో ముందున్నాం. విద్యుత్ వినియోగంలో 2,140 యూనిట్లతో దేశంలోనే అగ్రభాగాన ఉన్నాం. ఆసరా పెన్షన్లతో పేదల ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నాం. సచివాలయం నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను' అన్నారు.
కూలగొట్టి కడతారా అని హేళన చేశారు..
పెద్ద పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగిందనీ, నీళ్లు రానే రావు.. సాధ్యమే కాదు.. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం. భారత ప్లానింగ్ కమిషన్‌లో కూడా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను వెనుకబడిన జిల్లాల్లో చేర్చారు. ఈ రోజు తెలంగాణ సాధించిన ప్రగతిలో ప్రతి ఒక్కరి కషి ఇమిడి ఉంది. అనేక విభాగాలు కలిసి పని చేయడం వల్లే ప్రగతి సాధ్యమైంది. అద్భుతమైన రాష్ట్రాన్ని నిర్మించుకున్నాం. మంత్రుల నుంచి సర్పంచ్ వరకు, సీఎస్ నుంచి గ్రూప్-4 ఉద్యోగుల వరకు అందరికీ నమస్కరిస్తున్నా. సమాన హక్కుల కోసం ఉద్యమించాలనీ, సమీకరించు, బోధించు పోరాడు అని సందేశం ఇచ్చిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, వారి సందేశంతోనే గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. అంబేద్కర్ చూపిన మార్గంలోనే మన ప్రయాణం కొనసాగుతున్నదనీ, ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆయన అంబేద్కర్ స్ఫూర్తిని అందుకుని 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నాం. అనునిత్యం అంబేద్కర్ స్ఫురణకు రావాలనే ఉద్దేశంతో సచివాలయానికి ఆ మహానీయుడి పేరు పెట్టుకున్నాం. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని హామీ ఇస్తున్నాం' అన్నారు.
సచివాలయంలో కొలువుదీరిన మంత్రులు..
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారం భించారు. ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి సుముహుర్త సమయంలో కుర్చీలో ఆసీను లయ్యారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ సహా ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు.
తర్వాత మంత్రులు తమ చాంబర్లలో ఆసీనులయ్యారు. సంబంధిత ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. మంత్రి కేటీఆర్.. పేదల ఆత్మగౌరవ ప్రతీక అయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయగా, మంత్రి హరీశ్ రావు రెండు దస్త్రాలపై సంతకం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. ఒకటో అంతస్తులోని తన ఛాంబర్లో ఆసీనులైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న 19,800 మంది ఉపాధ్యాయులకు రూ.34.25 కోట్లతో ట్యాబ్‌లను, 5 వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్లను రూ. 7.53 కోట్లతో ఏర్పాటు చేసే దస్త్రాలపై తొలి సంతకం చేశారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఫైల్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి సంతకం చేశారు. పౌరసరఫరాల శాఖలో ఐసీడీఎస్ అంగన్వాడీలకు పోషకాల సన్నబియ్యం పంపిణీ ఫైలుపై, బీసీ, ఎంబీసీ కార్పోరేషన్ల ఆక్షన్ ప్లాన్ ఫైల్‌పై మంత్రి గంగుల కమలాకర్ తొలిసంతకం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాలోని 100 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేస్తు ఫైల్ పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తొలి సంతకం చేశారు. భక్తుల ఆరోగ్యాన్ని దష్టిలో పెట్టుకొని ప్రధాన దేవాలయాల్లో మిల్లెట్ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చే దస్త్రంపై ఆయన సంతకం చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన ఛాంబర్లో ఆసీనులై పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు.
తెలంగాణ మీడియాకు 'నో' ఎంట్రీ
కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ మీడియాకు పూర్తిస్థాయిలో ఆహ్వానాలు అందలేదు. దీంతో జర్నలిస్టు సంఘాలు నిరసన తెలిపాయి. మీడియా పట్ల వివక్ష చూపడాన్ని ఖండించాయి. స్థానిక మీడియాను పక్కనపెట్టడం సరికాదని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, హెచ్‌యూజే అధ్యక్ష, కార్య దర్శులు ఎం. అరుణ్‌కుమార్, బి. జగదీశ్వర్ వ్యాఖ్యానిం చారు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమంలోనూ వివక్షను ప్రదర్శించడాన్ని ఖండించారు. పత్రికలు, ఛానెళ్ల వార్తలు, ప్రసారాల పట్ల ఏవైనా అభ్యంతరాలు ఉంటే జాతీయ ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యా దు చేసుకోవచ్చని సూచించారు. భవిష్యత్‌లోనైనా మీడియా పట్ల వివక్ష ప్రదర్శించరాదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
భోజనాల దగ్గర రసాభాస
ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసాక అందరూ భోజనాలు చేసి వెళ్లాలని రాస్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆహ్వానించారు. అయితే ఆమేరకు ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. భోజనాల దగ్గర రసాభాస చోటుచేసుకుంది. ఏర్పాట్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బంది పడ్డారు. అలాగే జాతీయ మీడియాకు, రాష్ట్ర మీడియాకు అసలు భోజనమే లేకుండాపోయింది. చివరకు జాతీయ మీడియాకు వాళ్లకు బసకేటాయించిన హోటళ్లల్లో ఏర్పాటు చేశారు. రాష్ట్ర మీడీయాను మాత్రం పట్టించుకోలేదు.
ఆరు ఫైళ్లపై సంతకం
కొత్త సచివాలయంలోని ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి, సుముహూర్తంలో కుర్చీలో ఆసీనులయ్యారు.
ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు.
1. దళితబంధు పథకం
2. పోడుభూముల పట్టాలు
3. సీఎంఆర్ఎఫ్ నిధులు
4.కేసీఆర్ న్యూట్రిషన్ కిట్
5.కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్
6.పాలమూరు లిఫ్టు ఇరిగేషన్